సాగు కంటే పాడి బాగు
- పాడి పెంపకంతో లాభాలు
- పెరుగుతున్న పాల దిగుబడులు
- గొలుగొండ రైతాంగం విజయగాథ
గొలుగొండ : పుడమితల్లిని నముకున్నా.. వాతావరణం సహకరించక బడుగు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాడి లేకపోతే వారి దైనందిన పరిస్థితి ఊహించడమే కష్టం. మండల రైతులు రెండేళ్లుగా ఆరుగాలయం కష్టించి పనిచేసినా.. పంటలు ఆశాజనకంగా లేకపోవడంతో అధికశాతం మంది పాడివైపు దృష్టిమళ్లించారు. మార్కెట్లో పాలకు ఉన్న డిమాండ్‌తోపాటు, పాల సేకరణ ధరలు కూడా బాగుండడంతో కుటుంబ పోషణకు ఢోకాలేకుండా పోయింది.
పెరిగిన పాల దిగుబడులు
మండలంలో 8 వేల ఎకరాలకు పైగా సాగు భూములున్నా, ఏటా పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు రైతులను కుంగదీస్తున్నాయి. భూమిని నుమ్ముకుంటున్నా అప్పులే మిగులుతుండడంతో.. పాడివైపు దృష్టిసారించారు. ఇలా చేయడం వల్ల గతంలో కంటే పాల దిగుబడులు రెట్టింపవుతున్నాయి. ప్రధానంగా పాకలపాడు, ఏటిగైరంపేట, శ్రీరాంపురం, కొత్తమల్లంపేట, కేడీ పేట, పుత్తడిగైరంపేట, కొంకసింగి, జోగుంపేట తదితర ప్రాం తాల్లో డైరీలకు రైతులు ఈ వేసవిలో అధికమొత్తంలో పాల సరఫరా చేస్తున్నారు. గత ఏడాది రోజుకు 3,211 లీటర్లు సరఫరా కాగా ప్రన్తుతం4,300 లీటర్లు ఎగుమతవుతున్నాయి.
ఈ గ్రామాల్లో మోటారు బోర్లు అధికంగా ఉండడం వల్ల నీటి సదుపాయం అందివచ్చి పశుగ్రాసాన్ని విస్తారంగా పెంచుతున్నారు. నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో గడ్డి పెరగడం, పాల సేకరణ ధర కూడా బాగుండడంతో ఈ ఏడాది కూడా మంచి లాభాలు వస్తాయని పాడి రైతులు ధీమాగా ఉన్నారు.
డెయిరీల మధ్య పోటీ
వివిధ డైయిరీలు పోటీ పడి మరీ రైతుల నుంచి పాలు కొనుగోలు చేస్తున్నాయి. మార్కెట్లో పాలకు డిమాండ్ పెరగంతోనే సేకరణ ధర కూడా భారీగా పెంచాయి. 2012-2013 లో లీటరు పాలకు రూ.46 ఉండగా ఇప్పుడు రూ.51కి చేరింది. ధర పెంచడంతోపాటు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తున్నాయి.