మై చాయిస్ ఇదీ..
మహిళా సాధికారతపై ‘మై చాయిస్’ పేరిట అదజానియా విడుదల చేసిన షార్ట్‌ఫిలింలో దీపిక పదుకొనే చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించిన విషయం విదితమే. ముఖ్యంగా స్త్రీ, పురుష సంబంధాలపై ఈ వీడియో పెద్ద ఎత్తున చర్చను రేకెత్తించింది. అయితే మహిళా సాధికారత అంటే వేసుకునే దుస్తులు, వివాహేతర సంబంధాలేనా...? అంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో ఎన్నో విమర్శలూ చేశారు. దీనిపై ఇంతకాలం మౌనంగా ఉన్న దీపిక ఎట్టకేలకు నోరువిప్పింది. ‘మై చాయిస్’లో కొన్ని లైన్లను తీసుకుని దానిని గోరంతలు చేయడం తగదని వివరణ ఇచ్చింది. వివాహ వ్యవస్థను,
దాని పవిత్రతను తాను ఎంతో గౌరవిస్తానని, వివాహేతర సంబంధాలను తాను సమర్ధించలేదని తెలిపింది. ‘మై చాయిస్’ వీడియో ఇంకా ఎన్నో అంశాలను స్పృశించిందని, ఏదేమైనా మహిళలకు సంబంధించిన అంశాలపై లోతైన చర్చ జరగడం చక్కని పరిణామమని దీనిని తాను స్వాగతిస్తానని చెబుతోంది.