నియమాలు పెడితే నిరోధక శక్తి తగ్గుతుంది | Despite the resistance decreases rules | Sakshi
Sakshi News home page

నియమాలు పెడితే నిరోధక శక్తి తగ్గుతుంది

Published Wed, Dec 23 2015 11:54 PM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

Despite the resistance decreases rules

హోమియో కౌన్సెలింగ్
 
టైప్-1 డయాబెటిస్ అంటే ఏమిటి? మా పిల్లవాడికి టైప్-1 డయాబెటిస్ అన్నారు. దీని గురించి వివరించి, మావాడు పాటించాల్సిన ఆహార నియమాలు వివరించండి.
 - నాగార్జున, నల్గొండ  

 పిల్లల్లో సాధారణంగా 15 ఏళ్ల లోపు వారిలో వచ్చే చక్కెరవ్యాధిని టైప్-1 డయాబెటిస్ (మధుమేహం) అంటారు. టైప్-1 డయాబెటిస్ అంటే ఇందులో క్లోమగ్రంథి అస్సలు పనిచేయదు. అంటే క్లోమగ్రంథి తయారు చేయాల్సిన ఇన్సులిన్ శరీరంలో అస్సలు ఉండదన్నమాట. కాబట్టి వీరికి ఇన్సులిన్ మాత్రలతో ఆరంభించి, కొంతకాలానికి ఇంజెక్షన్‌కు మారుస్తుంటారు.

సి-పెప్టైడ్ అనే ప్రోటీన్ మోతాదు 0.3 నానోగ్రాము ఉంటే క్లోమగ్రంథి సక్రమంగా పనిచేస్తున్నట్టు లెక్క. అంతకన్నా తక్కువ ఉంటే క్లోమగ్రంథి పనిచేయక, టైప్-1 డయాబెటిస్ ఉన్నట్టు నిర్ధారణ చేయవచ్చు. కొందరిలో ఈ కొలత సాధారణంగా ఉంటూ కూడా మధుమేహం వస్తుంది. అంటే ఇన్సులిన్ బాగానే ఉంది కానీ మధుమేహం వచ్చింది కాబట్టి ఇది టైప్-2 డయాబెటిస్ అని చెప్పవచ్చు. కాబట్టి పిల్లల్లో మధుమేహం ఉంటే నేరుగా ఇన్సులిన్ ఇవ్వకుండా సి-పెప్టైడ్ ఏ స్థాయిలో ఉందో చూసుకొని వైద్యం చేయాల్సి ఉంటుంది.

చిన్నపిల్లల్లో మధుమేహం ఉంటే పాటించాల్సిన ఆహార నియమాలు:
పిల్లల్లో ఎలాంటి ఆహార నియమాలు తగవు. 15-25 మధ్య వయసువారు లావుగా ఉంటేనే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే జంక్‌ఫుడ్ తగ్గించుకోవాలి. ఇన్సులిన్ నిరోధకత రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ను పెంచుతుంది కాబట్టి  ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించుకోవాలి  5 - 15 ఏళ్ల పిల్లల ఎదుగుదల కోసం వాళ్ల బరువుకు తగినట్లు ఎన్ని క్యాలరీలు అవసరమవుతాయో డైటీషియన్‌ను సంప్రదించి వారు చెప్పినట్లు పాటించాలి. త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాలను వాడాలి. ఆహారం విషయంలో ఆంక్షలు విధించడం, ఆహారాన్ని తగ్గించి, వ్యాయామాలను పెంచడం చేస్తే అసలే పిల్లల్లో తక్కువగా ఉండే రోగనిరోధకశక్తి మరింత తగ్గుతుంది. దీనికితోడు క్షయవ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.

ఎలాంటి లక్షణాలతో టైప్-1ను గుర్తించవచ్చు?
టైప్-1 డయాబెటిస్ హఠాత్తుగా వస్తుంది. రక్తంలో గ్లూకోజు ఆర్నెల్ల నుంచి పన్నెండు నెలల్లోపు 100 - 500 పెరగవచ్చు  అతిమూత్రం, ఆకలి, దాహం వేయడం, మూత్రవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్తుడడం జరుగుతుంది.  రోగనిరోధకశక్తి తగ్గడంతో తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు  ఎదుగుదల తగ్గుతుంది. హోమియో వైద్యవిధానంలో చికిత్స: హోమియోలో టైప్-1కు అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది. ఇన్సులిన్‌తోపాటు హోమియో మందులు ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
 
డాక్టర్ టి. కిరణ్ కుమార్
పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్
 
 పీడియాట్రిక్ కౌన్సెలింగ్
 
మా పాపకు ఆరు నెలలు. తల మీద విపరీతమైన ర్యాష్‌తో పాటు ఇన్ఫెక్షన్ వచ్చింది. మా పిల్లల వైద్యులు ఇచ్చిన చికిత్సతో తగ్గిందిగానీ, కొన్నాళ్లకు మళ్లీ  వచ్చింది.  ఇక  పాపకు తలలోని కొన్నిప్రాంతాల్లో జుట్టు సరిగా రావడం లేదు. మా పాప సమస్యకు పరిష్కారం చెప్పండి. ఇది భవిష్యత్తులో రాబోయే సమస్యలకు ఏదైనా సూచికనా?
 - శ్రీకాంత్, అనంతపురం

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు మాడు (స్కాల్ప్) భాగంలో చర్మం మీద ర్యాష్ వచ్చినట్లుగా, కొద్దిగా సూపర్ యాడ్ ఇన్ఫెక్షన్ కూడా అయినట్లుగా అనిపిస్తోంది. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇది కాస్త దీర్ఘకాలికంగా కనిపించే సమస్యగా చెప్పవచ్చు. దీన్ని ప్రధానంగా నెలల పిల్లల్లో, యుక్తవయసుకు వచ్చిన పిల్లల్లో కూడా చూస్తుంటాం. ఈ సమస్య ఉన్న పిల్లలకు మాడు (స్కాల్ప్)పైన పొరల్లా ఊడటం, అలాగే కొన్నిసార్లు తలంతా అంటుకుపోయినట్లుగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాడుపై పొర ఊడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఇది రావడానికి ఇదమిత్థంగా కారణం చెప్పలేకపోయినప్పటికీ... కొన్నిసార్లు ఎమ్.పర్ఫూరా అనే క్రిమి కారణం కావచ్చని కొంతవరకు చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్లో... అందునా ముఖ్యంగా నెల నుంచి ఏడాది వయసు ఉండే పిల్లల్లో ఈ సమస్యను మరీ ఎక్కువగా చూస్తుంటాం. కొన్నిసార్లు ఈ ర్యాష్ ముఖం మీదకు, మెడ వెనక భాగానికి, చెవుల వరకు వ్యాపిస్తూ ఉండవచ్చు. ఇది వచ్చిన పిల్లల్లో పై లక్షణాలతో పాటు కొందరిలో నీళ్ల విరేచనాలు (డయేరియా) లేదా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియెన్సీ డిసీజ్‌కు సూచికగా చెప్పవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర కండిషన్స్... అంటే అటోపిక్ డర్మటైటిస్, సోరియాసిస్ వంటి స్కిన్ డిజార్డర్స్ కూడా ఇదేవిధంగా కనిపించవచ్చు.
 ఇక చికిత్స విషయానికి వస్తే ఈ సమస్య ఉన్నవారికి యాంటీసెబోరిక్ (సెలీనియం, సెల్సిలిక్ యాసిడ్, టార్) షాంపూలతో క్రమం తప్పకుండా తలస్నానం చేయిస్తుండటం, తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ తలకు పట్టించడం, ఇమ్యూనోమాడ్యులేటర్స్ వంటి మందుల వల్లా తప్పనిసరిగా నయమవుతుంది. అలాగే ఈ సమస్య ఉన్న భాగాన్ని తడిబట్టతో తరచూ అద్దుతూ ఉండటం చాలా ముఖ్యం.ఇదేమీ భవిష్యత్తు వ్యాధులకు సూచిక కాదు. మీరు ఒకసారి మీ పిల్లల డాక్టర్‌ను లేదా డర్మటాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. ఈ సమస్య తప్పక తగ్గిపోతుంది.
 
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్
రోహన్ హాస్పిటల్స్
విజయనగర్ కాలనీ
హైదరాబాద్
 
ఫిజియోథెరపీ కౌన్సెలింగ్

 
 మా అమ్మగారి వయసు 60 సంవత్సరాలు. ఆమె మోకాలి చిప్పలు అరిగిపోవడం వల్ల ఇటీవల మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్ చేశారు. బాగా ఫిజియోథెరపీ చేస్తే తొందరగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు. ఇంటి దగ్గరే ఉండి ఫిజియోథెరపీ ఎలా చేసుకోవాలో తెలియజేయగలరు.
 - ఎం.వి.ఎస్. ఫణికుమార్, హైదరాబాద్
ఆపరేషన్ తర్వాత డిశ్చార్జ్ అయ్యేముందు వైద్యులు కొన్ని వ్యాయామాల గురించి చెబుతారు.  
 స్టాటిక్ క్వాడ్రిసెస్ట్: వెల్లకిలా పడుకుని కాళ్లు చాపుకుని కూర్చుని మోకాలిని గట్టిగా కిందికి వంచి ఐదు లేదా పది సెకన్లపాటు ఉంచాలి.
 తిన్నగా కాళ్లు పైకి లేపటం: వెల్లకిలా పడుకుని తొడ కండరాలను బిగించి మోకాళ్లను తిన్నగా  పైకి ఎత్తి 5 నుంచి పది సెకన్లపాటు ఉంచి నెమ్మదిగా కిందికి దించాలి. చీలమండల వ్యాయామం: పాదాన్ని పైకి, కిందికి పిక్క కండరాలను బిగిస్తూ ఆడించాలి. ఈ వ్యాయామాన్ని చీలమండలం, పాదం, కాళ్ల వాపు తగ్గేవరకు చేయాలి.
 
మోకాలు తిన్నగా చేసే వ్యాయామం: మోకాలి కింద చిన్న తువ్వాలును మడిచిపెట్టి తొడ కండరాన్ని బిగించి కాలిని తిన్నగా పైకిలేపాలి.
 మోకాలిని మంచం మీద జార్చటం: మోకాలిని వంచి మడమతో మంచం మీద జార్చాలి, ఎంత వరకు ముడవగలరో అంత మడిచి, ఆ పొజిషన్‌లో 5 నుంచి పది నిమిషాలు ఉంచి మరల కాలిని కిందికి జార్చాలి. కూర్చొని ఆసరాతో మోకాలు వంచటం: మంచం కింద గాని కుర్చీలోగాని కూర్చొని ఆపరేషన్ అయిన కాలి మడమ కింద రెండవకాలు మడమను పెట్టి నెమ్మదిగా కాలిని పైకి ఎత్తాలి. ఇలా కాలిని తిన్నగా ఎత్తిన తర్వాత 5 నుంచి 10 సెకన్లు ఉంచాలి. కూర్చొని మోకాలిని వంచటం: ఆపరేషన్ అయిన తర్వాత గదిలో నడవడం, చిన్న చిన్న రోజువారీ పనులు మొదలు పెట్టాలి. దీనివల్ల కాళ్ల కీళ్లకు రక్తప్రసరణ జరిగి కదలికలు మెరుగుపడతాయి.
 
నడవడం
: మోకాలు త్వరగా నయం అవడంలో దోహదపడే అంశం సరైన పద్ధతిలో నడవడం. మొదట మీరు మీ డాక్టర్ లేదా ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో వాకార్ లేదా క్రచ్చెస్ సాయంతో ఏ కాలుపై ఎంత బరువు పెట్టాలో, ఎలా నిలబడాలో తెలుసుకోవాలి.
 
డాక్టర్ ఆర్. వినయ కుమార్
హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్
ఫిజియోథెరపీ
కేర్ హాస్పిటల్స్
బంజారాహిల్స్, హైదరాబాద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement