పుట్టు వెంట్రుకలు...
షోడశ సంస్కారాలలో కేశఖండనం లేదా చూడాకర్మ ఒకటి. దీనినే పుట్టువెంట్రుకలు తీయటం అని వ్యావహారికంగా చెప్పుకుంటారు. తల్లి కడుపులోనుండి బయటకు వచ్చిన శిశువుకి మొదటిసారి వెంట్రుకలు తీయించే కార్యక్రమం.
సాధారణంగా ఈ కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం నిండకుండా గాని, మూడవ సంవత్సరంలో గాని నిర్వహిస్తుంటారు. అదీ కుదరనప్పుడు ఐదవ సంవత్సరంలో చేస్తారు. గోళ్ళు, జుత్తు మృత కణజాలం కదా! పైగా జుట్టు పెరగటం వల్ల పిల్లలు చికాకుగా ఉంటారు. చికాకు తగ్గించటానికి, ఆరోగ్య దృష్టితోను జుట్టుని చిన్నదిగా ఉంచటం మంచిదనే ఉద్దేశంతో ప్రాచీనులు కేశఖండనాన్ని చూడాకర్మమనే సంస్కారంగా మలచారు.
పిల్లలకు కొంత వయసు వచ్చే వరకు తల లోపలి సంధులు కూర్చబడవు. అందుకే చిన్న పిల్లల తల పైభాగం మెత్తగా లోతుగా ఉంటుంది. ఆ మెత్తని భాగాన్ని మాడు అంటారు. కొన్ని నెలల నుండి రెండు మూడు సంవత్సరాలకు అది గట్టి పడుతుంది. దానిని మాడు పూడటం అంటారు. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏర్పడిన జుట్టు మెత్తని ఆ మాడు భాగాన్ని భద్రంగా కప్పి ఉంచి కాపాడుతుంది.
కొంతమంది పిల్లలకు త్వరగా కొద్దినెలలకే గట్టి పడినా సాధారణంగా ఎక్కువ మందికి ఒకటిన్నర రెండు సంవత్సరాలకు మాడు గట్టి పడుతుంది. అప్పటితో పుట్టినప్పుడున్న జుట్టు అవసరం తీరిపోతుంది. దానిని తీసివేయాలి. తరువాత తాజాగా కొత్త జుట్టు వస్తుంది. పుట్టుకతో వచ్చిన జుట్టు తల్లి గర్భంలో ఉన్నన్ని రోజులూ మలిన జలాలలో నాని ఉంటుంది. వాటిని తొలగించటం వల్ల మలినమైన జుట్టు పోయి కొత్తగా ఆరోగ్యకరమైన జుట్టు వస్తుంది.