ఇద్దరు స్నేహితులు వెళుతున్నారు. వారిలో ఒకడికి గొప్పలు చెప్పుకోవడం అలవాటు. అందరికన్నా తానే అధికుడినని చెప్పి ఆనందించడం అతని స్వభావం. స్వతహాగా మంచివాడే. పరోపకారే. కానీ, ఈ ఒక్క గుణంతో పదిమందిలో పలచబడిపోతుంటాడు. అయితే ఆ విషయం అతనికి తెలియదు. పైకి మాత్రం అందరూ అతని గొప్పతనాన్ని అంగీకరించినట్టే కనిపించి, ఆహా ఓహో అన్నా, చాటుగా నవ్వుకునేవారు.
ఇప్పుడు కూడా స్నేహితునితో, తన ఊరిలో తనకన్నా ఎక్కువ సంపన్నుడు లేడని, తనకన్నా ఎక్కువగా ఊళ్లోవాళ్లు ఎవరినీ గౌరవించరనీ, తాను లేకపోతే ఊరిలో పనులేమీ జరగవనీ కోతలు కోయడం ప్రారంభించాడు. వారలా మాట్లాడు కుంటూ, ఆ ఊరి దేవాలయం ముందుకు వచ్చారు. గొప్పలు కోసే వ్యక్తితో ‘‘ఆ గోపురం ఎంత ఉన్నతంగా ఉందో, దేవుని ముందు ఎంత వినయంగా ఒదిగి ఉందో’’ అన్నాడు స్నేహితుడు. గొప్పలు పోయే వ్యక్తి ఆ గోపురం వైపు చూశాడు.
స్నేహితుడి మాటలో ఆంతర్యం అర్థమైంది. అత్యున్నతమైన ఆ కట్టడంతో పోల్చి చూస్తే తాను కీటకం వంటి వాడిని అనుకున్నాడు. అతనిలోని అహంభావం, గొప్పలు చెప్పుకునే గుణం అణగారి పోయాయి. మరెన్నడూ అతను గొప్పలు చెప్పుకోలేదు. వినయంగా ఉన్నాడు. అప్పటివరకూ అతన్ని చాటుమాటుగా ఎగతాళి చేసిన వారే అతన్ని బాహాటంగా గౌరవించడం మొదలు పెట్టారు. అందుకే జీసస్ అన్నారు... తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని. మహా ప్రవక్త ప్రబోధించాడు అహంకారం అనర్థదాయకం అని!
Comments
Please login to add a commentAdd a comment