స్వీట్ కిడ్స్ | Diabetes in young childrens | Sakshi
Sakshi News home page

స్వీట్ కిడ్స్

Published Wed, Jun 3 2015 11:48 PM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

స్వీట్ కిడ్స్

స్వీట్ కిడ్స్

చిన్నపిల్లల్లో డయాబెటిస్
డయాబెటిస్ రోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ పోతుడడంతో ఈ వ్యాధి ఒక చర్చనీయాంశమైంది. ఈ రోగుల సంఖ్య ఒక సామాజిక ఉపద్రవంగా మారుతుండటం కలవరం కలిగిస్తోంది.  క్రితం తరంతో పోలిస్తే ఈ తరంలో మరీ చిన్న వయసు పిల్లల్లోనూ డయాబెటిస్ కనిపిస్తుండటం ఆందోళనకరంగా మారింది. అయితే పెద్దల్లోని డయాబెటిస్‌పైనే ఎక్కువ చర్చ జరుగుతోంది తప్ప... దీనిపై అంతగా దృష్టిసారించడం లేదు.

ఇప్పటికీ అదృష్టవశాత్తు పెద్దవయసులో డయాబెటిస్ వచ్చే రోగులతో పోలిస్తే చిన్న వయసులో డయాబెటిస్ వచ్చే రోగుల సంఖ్య తక్కువగానే ఉండటం కొంత ఊరటనిచ్చే విషయం. కానీ... చిన్నపిల్లల్లో డయాబెటిస్ వస్తే తక్షణం దాన్ని నిర్ధారణ చేసుకొని, రక్తంలో పెరిగే చక్కెరపాళ్లను నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. లేకపోతే అది చాలా తీవ్రమైన, ఆందోళనకరమైన పరిణామాలకు దారితీయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
 
డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇందులో ఇన్సులిన్ లోపం వల్ల ఆహారాన్ని శక్తిగా మార్చుకునే ప్రక్రియల్లో తేడాలు వస్తాయి. పిల్లల్లో స్థూలకాయం ఉన్నవారిలో ఇన్సులిన్ తన కార్యకలాపాలను సక్రమంగా కొనసాగించలేదు. డయాబెటిస్‌లో రెండు రకాలు ఉంటాయి. మొదటిది టైప్-1 డయాబెటిస్, రెండోది టైప్-2 డయాబెటిస్.
 
చిన్నపిల్లల్లో డయాబెటిస్...
చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటిస్ సాధారణంగా టైప్-1కు చెందుతుంది. దీనిలో పిల్లలు తమ జీవితాంతం ఇన్సులిన్‌పై ఆధాపడాల్సి ఉంటుంది. చిన్నపిల్లల్లో పూర్తిగా ఇన్సులిన్ లోపం ఏర్పడటం వల్లనే ఇది వస్తుంది. మన శరీరంలో పాంక్రియాస్ అనే ఒక గ్రంథిలోని బీటా-సెల్స్ అనే కణాలు ఇన్సులిన్ అనే హార్మోన్‌ను తయారు చేస్తాయి. ఈ హార్మోన్ రక్తంలో చక్కెరపాళ్లు ఎప్పుడూ నార్మల్‌గా ఉండేలా చూస్తుంది. పిల్లల్లో ఇది ఏ వయసులోనైనా రావచ్చు.
 
చిన్నపిల్లల్లోని డయాబెటిస్ నియంత్రణ ఎలా...
పిల్లల్లో వచ్చే టైప్-1 డయాబెటిస్‌ను నియంత్రించడానికి చర్మం కింది పొర అయిన సబ్‌క్యుటేనియస్ పొరలోకి ఇన్సులిన్ ఎక్కించాలి. ఇక ఆహారం విషయానికి వస్తే చక్కెర పాళ్లు అస్సలు లేకుండా అన్ని రకాల పోషకాలూ అందేలా సమతులాహారం ఇవ్వాలి. చికిత్స విజయవంతం కావాలంటే... ప్రతి చిన్నారికీ... అతడి లేదా ఆమె పరిస్థితిని బట్టి వ్యక్తిగతంగా ఆహారం, వ్యాయామం, మందుల పాళ్లను నిర్ణయించాల్సి ఉంటుంది.

రోగి రక్తంలో తగినంత చక్కెరపాళ్లు మాత్రమే ఉండేలా చేయడమే చికిత్స ప్రధాన ఉద్దేశం. దీనిలో జాప్యం జరిగితే అది చిన్నారి మూత్రపిండాలు, నరాలు లేదా కనుచూపునకు సంబంధించిన సమస్యలకు దారితీసే అవకాశాలుంటాయి. సిరంజీ ద్వారా తగిన మోతాదులో ఇన్సులిన్ ఇవ్వడం వల్ల రోగికి అవసరమైనంత మేరకే రక్తంలో చక్కెర పాళ్లు ఉండేలా చేయడం జరుగుతుంది. ఇలా చేయడంలో రోగి తీసుకునే ఆహారమూ, అతడికి/ఆమెకు ఇవ్వాల్సిన ఇన్సులిన్ పాళ్లూ, రోగి చేసే వ్యాయామం ఎంతో పరిగణనలోకి తీసుకొని ఆహారం, మందుల మోతాదులను సరిగ్గా నిర్ణయించాల్సి ఉంటుంది.

రక్తంలోని చక్కెరపాళ్లు ఎప్పుడూ అవసరమైనంతే ఉంటూ నిర్ణీతమైన రేంజిలోనే ఉండేలా పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్‌లు చూస్తుంటారు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ అతడు/ఆమె పెరుగుదల ఆధారంగా చిన్నారి తీసుకునే మందుల మోతాదులతో పాటు అతడి ఆహారంలో పిండిపదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు ఎంతెంత ఉండాలో నిర్ణయిస్తారు.

చికిత్స విషయంలో భవిష్యత్తు ఆశలు...
ప్రస్తుతానికి చిన్నారుల్లో వచ్చే టైప్-1 డయాబెటిస్‌కు   ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వడం మాత్రమే ప్రధాన చికిత్సగా ఉన్నా... ఈ అంశంపై విశేషంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎన్నెన్నో ఆశాజనకమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తునికి మాత్రం సర్జరీలు, ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియలు చిన్న పిల్లల విషయంలో సిఫార్సు చేయడం లేదు.
 
ఇక టైప్-2 డయాబెటిస్ అనేది పెద్దల్లో వచ్చే సమస్య. ఆధునిక నాగరికత పేరిట ఆహారం, విహారాల విషయంలో పెరుగుతున్న మన అనారోగ్యకరమైన జీవనశైలి దీన్ని మరింతగా ప్రేరేపిస్తోంది. మన శరీరంలోకి వెలువడే అదనపు చక్కెరను నియంత్రించాల్సిన ఇన్సులిన్ తగినంతగా విడుదల అయినా... పెద్దవారిలో (అడల్ట్స్‌లో) ఉండే  కొవ్వు ఆ ఇన్సులిన్ పనితీరుకు ప్రతిబంధకంగా మారుతుంది. దాంతో ఈ తరహా వ్యక్తుల్లో మెడ వెనక భాగంలోనూ, బాహుమూలాల వద్ద, తొడల వద్ద నల్లటి చారలను ఏర్పరుస్తుంది.

మనలో ఇన్సులిన్ సరిగా పనిచేయడం లేదనే విషయానికి ఇది ఒక భౌతికంగా కనిపించే గుర్తు. ఇక స్థూలకాయం ఉండే పిల్లల్లో టైప్-2 డయాబెటిస్ కూడా ఉందేమో చూడాలి. కుటుంబ చరిత్రలో డయాబెటిస్ ఉన్న పెద్దవారికి మెడపై ఈ పిగ్మెంటేషన్ ఉంటే... వారి పిల్లల్లో డయాబెటిస్ రావడంతో పాటు అమ్మాయిల్లో పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్), రుతుక్రమం సరిగా రాకపోవడం, శరీరంపై అవాంఛిత రోమాలు కనిపించడం, రక్తపోటు పెరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు రక్తపరీక్ష, మూత్రపరీక్షల వంటివి చేసి పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ ఆధ్వర్యంలో మందులు, న్యూట్రిషనిస్ట్ సలహా మేరకు ఆహారంతో పాటు బిహేవియర్ స్పెషలిస్ట్ సలహా, సూచనలతో వ్యాధిని అదుపులో పెట్టడం ఎలాగో తెలుసుకోవాలి. ఒకవేళ పిల్లలు అన్ని రకాలుగా బాగానే ఉండి, అతడిలో కేవలం టైప్-2 డయాబెటిస్ వచ్చే లక్షణాలు కనిపిస్తుంటే... అప్పుడు ఆ చిన్నారుల జీవనశైలి, ఆహారం, వ్యాయామాలు, బరువును అదుపులో పెట్టుకోవడం ఎలా అనే అంశాలపై అవగాహన కలిగించాలి.

ఇవన్నీ అతడి రక్తంలోని చక్కెరపాళ్లను అదుపు చేయలేకపోతే అప్పుడు నోటి ద్వారా మందులు ఇవ్వడమో లేదా ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇవ్వడమో చేయాలి. ఆ వయసు పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఏమిటి, ఎన్ని సార్లు ఎంతెంత మోతాదుల్లో (పోర్షన్స్)తీసుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించాలి.

ఇలాంటి పిల్లలు రోజుకు కనీసం ఒక గంటసేపైనా శారీరకమైన శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇలా టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలున్న పిల్లలను గుర్తించి వారి జీవనశైలిలో మార్పులు తీసుకురావడం వల్ల డయాబెటిస్‌ను సాధ్యమైనంతగా నివారించవచ్చ్చు లేదా ఆలస్యం చేయవచ్చు. కానీ టైప్-1 డయాబెటిస్ నివారణ సాధ్యం కాదు. కాబట్టి వారి విషయంలో అత్యవసరంగా వైద్యనిపుణుల సలహా తీసుకోవాలి.
 
లక్షణాలు... చిన్నపిల్లల్లో డయాబెటిస్ వచ్చాక ఆ చిన్నారిలో కొద్ది రోజులు లేదా వారాల్లోనే దానికి సంబంధించిన లక్షణాలు కనబడతాయి. అవి...  చాలా ఎక్కువగా దాహం వేస్తుండటం  ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్తుండటం  ఒక్కోసారి నిద్రలో పక్క తడపడం  క్రమంగా బరువు తగ్గుతుండటం  ఎప్పుడూ అలసటగా ఉండటం. ఈ దశలోనే తల్లిదండ్రులు గమనించి వ్యాధి నిర్ధారణ చేయించాలి.

వ్యాధి నిర్ధారణ ఆలస్యమైతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తీవ్రమైన డీహైడ్రేషన్ (శరీరంలోని నీరు, లవణాలను ఎక్కువ పరిమాణంలో కోల్పోవడం), కడుపునొప్పి, వాంతులు, మత్తుగా ఉండటం, శ్వాస తీసుకోవడం కష్టం కావడం వంటి లక్షణాలు కనపడవచ్చు. అప్పుడు రక్తనాళంలోకి సెలైన్‌తో పాటు ఇన్సులిన్ ఎక్కించాల్సి రావచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement