డయాబెటిస్ అన్ని అవయవాలను ప్రభావితం చేసినట్లే... పళ్లనూ చేస్తుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు గుండె, రక్తపోటు విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లే... పళ్ల విషయంలోనూ అంతే శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారికి రోగనిరోధకశక్తి తక్కువ. దాంతో నోటిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. పైగా చిగుళ్ల వ్యాధిలో నొప్పి తెలియదు. దీనికి తోడు డయాబెటిస్ ఉందంటే చిగుళ్ల వ్యాధులు వచ్చేందుకు అన్ని రకాల అవకాశాలుంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు నోరు, దంతాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న అవగాహన కోసం ఈ కథనం.
డయాబెటిస్ రోగులు డెంటిస్ట్ వద్దకు వెళ్లినప్పుడు తమకు డయాబెటిస్ ఉందన్న సంగతి తప్పనిసరిగా చెప్పాలి. డయాబెటిస్‌కు వాడుతున్న మందులు, వ్యాధి నియంత్రణలో ఉన్నదా అన్న విషయం డెంటిస్ట్‌కు వివరించాలి. డయాబెటిస్ మందులతో పాటు వారు వాడే ఇతర మందులు అంటే రక్తాన్ని పలుచబార్చే మందుల వంటి వాటి వివరాలతో పాటు రోగి తాలూకు పూర్తి మెడికల్ హిస్టరీని వివరించాలి.
డయాబెటిస్ రోగుల్లో వచ్చే సాధారణ నోటి సమస్యలు...
తరచూ నోరు తడారిపోవడం: సాధారణంగా నోరు ఎప్పుడూ తడిగా ఉంటుంది. కానీ డయాబెటిస్ ఉన్నవారిలో మాత్రం నోరు పొడిబారిపోతూ ఉండటం చాలా సాధారణం. ఈ పరిస్థితిని ‘జీరోస్టోమియా’ అంటారు. ఇలా నోటిలో తగినంత లాలాజలం లేనప్పుడు బ్యాక్టీరియా అంతా ఒకచోట గూడుకట్టినట్లుగా పెరుగుతుంది. దీన్ని కాలొనైజేషన్ అంటారు. ఇలా జరగడం వల్లనే చాలామంది షుగర్ రోగుల్లో నోటి దుర్వాసన చాలా సాధారణం. ఇలా నోరు పొడిబారడం అన్నది దీర్ఘకాలం పాటు కొనసాగితే అది నోటిలోని మృదుకణజాలం (సాఫ్ట్ టిష్యూస్) దెబ్బతినేలా చేస్తుంది. దాంతోపాటు దంతక్షయం, పంటినొప్పి వంటి సమస్యలు వస్తాయి. జీరోస్టోమియా అనే సమస్య కాస్త వయసు పైబడినవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో మరికాస్త ఎక్కువ. మనం తిన్న ఆహార పదార్థాలను గొంతులోకి సులువుగా జారుతూ వెళ్లేలా చేయడానికి లాలాజలం అవసరం. నోటిలో తగినంత లాలాజలం లేకపోతే పళ్లు పుచ్చిపోవచ్చు, చిగుళ్ల వ్యాధులతో పాటు మాట్లాడటంలో ఇబ్బంది, మింగలేకపోవడం, గొంతు బొంగురుపోవడం, నోటిలో మంట, ముక్కుపొడిబారడం వంటి సమస్యలు కూడా రావచ్చు.
దీర్ఘకాలంపాటు నోరు పొడిబారిపోయినట్లుగా ఉండే చక్కెర రోగులు తప్పనిసరిగా దంతవైద్యులను కలవాలి. వారు నోరు పొడిబారకుండా ఉండేందుకు కొన్ని చికిత్సలు చేస్తారు. వాటితో పాటు కొన్ని పుక్కిలించే ద్రవాలు, ఫ్లోరైడ్ ఉండే పూతమందులను సైతం సూచిస్తారు.
చక్కెర లేని గమ్స్, చక్కెర రహిత మింట్ వంటి వాటిని నములుతూ ఉండటం వల్ల నోటిలో తగినంత లాలాజలం ఊరుతుంటుంది. ఇక కొద్ది కొద్ది సేపటికి ఒకసారి చిన్న చిన్న గుటక వేస్తూ మంచినీళ్లు తాగడం కూడా మేలు చేస్తుంది. ఫ్రిజ్‌లోని ఐస్ ముక్కలను తీసుకుని చప్పరించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక నోరు పూర్తిగా పొడిబారిపోయేవారు కాఫీ, కూల్‌డ్రింక్స్ వంటి కెఫిన్ ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ కాఫీ తాగే అలవాటు ఉంటే, చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి.
నోటికి రుచి తెలియకపోవడం: ఇంతకు ముందులా ఇప్పుడు తమ నోటికి రుచి తెలియడం లేదంటూ చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఫిర్యాదు చేస్తుంటారు. అందుకే వారు ఆహార పదార్థాలను మరింత రుచికరం చేసుకోవడం కోసం రిఫైన్‌డ్ కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకుంటుంటారు. దాంతో వారి పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. పైగా ఈ తరహా ఆహారం వల్ల నోటిలో మరింతగా బ్యాక్టీరియా చేరుతుంది. అది చేరుతున్న కొద్దీ దంతక్షయం, పంటినొప్పి వంటి సమస్యలూ పెరుగుతాయి.
అందుకే రుచి తెలిసినా, తెలియకపోయినా ఆహారం విషయంలో డయాబెటిస్ రోగులు తమ పరిమితులను పూర్తిగా పాటించాలి. కార్బోహైడ్రేట్ ఆహారాన్ని, కొవ్వుపదార్థాలను పరిమితంగా తీసుకుంటూ, పుష్టికరమైన ప్రోటీన్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.
ఓరల్ క్యాండిడియాసిస్: ఇది నోటిలో వచ్చే ఒకరకం ఫంగల్ ఇన్ఫెక్షన్. నోటిలో డెంచర్స్ వాడేవాళ్లతో పాటు డయాబెటిస్ రోగుల్లోనూ ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ వ్యాధి వచ్చినవారు దంతవైద్యుల సలహాతో యాంటీ ఫంగల్ మందులను వాడాల్సి ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నవారు నోటి పరిశుభ్రతను పాటించడం అవసరం.
అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నవారు సైతం ప్రతి ఆర్నెల్లకు ఒకసారి డెంటిస్ట్‌ను కలిసి క్లీనింగ్ వంటి సాధారణ ప్రక్రియలు చేయించుకోవాలన్నది దంతవైద్యులు చేసే సిఫార్సు. అలాంటిది ఒకవేళ డయాబెటిస్ కూడా ఉంటే వారు తరచూ దంతవైద్యనిపుణులను కలిసి తమ పళ్లు పరీక్షింపజేసుకోవడం చాలా అవసరం.
- నిర్వహణ: యాసీన్
చక్కెరతో దంతాలపై ప్రభావం ఇలా...
మనం ఆహారం తీసుకున్నప్పుడు నోట్లో మిగిలిపోయిన ముక్కల నుంచి బ్యాక్టీరియా పెరిగి అది దంతాలపై పాచి (ప్లాక్)లా ఏర్పడుతుంది. మన ఆహారంలో తీపి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటే ఈ బ్యాక్టీరియా పెరుగుదల మరీ ఎక్కువ. వాటి నుంచి యాసిడ్స్ తయారై, అవి పంటిపై దుష్ర్పభావం చూపడం వల్ల పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. ఇది అదేపనిగా జరగడం వల్ల పంటి ఎనామిల్‌లో పగుళ్లు వచ్చి అవే పంటిలోని క్యావిటీస్‌గా ఏర్పడతాయి. చక్కెర వ్యాధి అదుపులో లేనివారిలో బ్యాక్టీరియా మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. దాంతో పాచి కాస్తా ‘గార’ (టార్‌టార్)గా మారి చిగుళ్ల వద్ద, పంటికీ పంటికీ మధ్య దీర్ఘకాలికంగా ఉండిపోతుంది. అది అలా ఉండిపోవడం వల్ల క్రానిక్ (దీర్ఘకాలిక) ఇన్ఫెక్షన్స్‌కు, ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీయవచ్చు.
డాక్టర్ వై.నరేంద్రనాథ్‌రెడ్డి
ఆర్థోడాంటిస్ట్
స్మైల్‌మేకర్స్ డెంటల్ హాస్పిటల్
ముసారాంబాగ్, హైదరాబాద్