
పాకిస్తాన్ పహిల్వాన్
ఖాన్ బాబా
ఇతని పేరు అర్బాబ్ ఖైసర్ హయత్. వయసు కేవలం 25 ఏళ్లు. కాని వెయిట్ ఎంతో తెలుసా? 436 కిలోలు. రోజుకు 36 గుడ్లు తింటాడు. నాలుగు కోళ్లు పంటి కింద వేసి నమిలేస్తాడు. ఐదు లీటర్ల పాలు గుటగుటమని చప్పరించేస్తాడు. పాకిస్తాన్ నేల మొత్తానికి ఇంతకు మించి బల సంపన్నుడు లేడని ఆ దేశం దాదాపుగా తీర్మానించింది. అర్బాబ్ సొంత ప్రాంతమైన ‘మర్దాన్’లో ఇతణ్ణి అందరూ ముద్దుగా ‘ఖాన్ బాబా’ అని పిలుచుకుంటూ ఉంటారు. ‘పద్దెనిమిదేళ్ల వయసు నుంచి నేను బరువు పెరగడం మొదలుపెట్టాను. దానిని గమనించి నేనే ఎక్కువ తినడం ప్రారంభించాను’ అంటాడు అర్బాబ్. ఇతని ఛాతీని కొలవడానికి టేప్ చాలదు. ఎత్తు ఆరు అడుగుల మూడు అంగుళాలు ఉంటాడు. ఏ మామూలు కారులో కూడా పట్టడు.
‘అందుకే నేను నా సొంతానికి ఒక పెద్ద వెహికిల్ ఏర్పాటు చేసుకున్నాను’ అంటాడు ఖాన్‌బాబా. ఖాన్‌కి బలం ఎక్కువ. ఒక ట్రాక్టర్‌కు తాడు కట్టి చేత పట్టుకున్నాడంటే ఆ ట్రాక్టర్ కదలను కూడా కదలదు. రెండు కార్లను ఏక కాలంలో తాళ్లు కట్టి ఆపగలడు. ఒక మనిషిని సునాయాసంగా గాల్లో లేపగలడు. ‘నేను ఏదో అరుదైన జబ్బు వల్ల ఈ ఆకారం దాల్చలేదు. ఆరోగ్యంగా ఉంటూనే సాధించాను. నాకు రోజువారి పనుల్లో ఏ ఇబ్బందీ లేదు’ అంటాడు ఖాన్‌బాబా.
ఖాన్ బాబాకు వెయిట్ లిఫ్టర్ కావాలని ఉంది కాని పాకిస్తాన్‌లో వెయిట్ లిఫ్టింగ్ లేదు. డబ్లు్యడబ్లు్యఎఫ్‌లో పాల్గొనాలని ఉంది కాని దానికి కూడా మార్గం సుగమం కాలేదు ఇంకా. ‘రెజ్లింగ్‌లో నాకు రికార్డులు సాధించాలని ఉంది’ అంటాడు ఖాన్‌బాబా. రోజూ తినడం అభిమానులతో సెల్ఫీలు దిగడం తప్ప ఇతనికి ప్రస్తుతానికి పనేం లేదు. అతను కోరుకున్నట్టుగా జరిగితే త్వరలోనే మనం ఇతణ్ణి డబ్లు్యడబ్లు్యఎఫ్ రింగ్‌లో చూస్తాం. కాని ఇతని బలం ముందు ఎవరైనా నిలుస్తారా అనేదే ప్రశ్న.