
నోట్ల పాట శింబు నోట!
ఐదువందలు, వెయ్యిరూపాయల నోట్లు రద్దు చేసి ఏడాది అయింది. ఈ సందర్భంగా శింబూ సరదాగా ఓ పాట పాడాడు. అది ఇప్పుడు వైరల్ అయింది. అంతేకాదు, నోట్లరద్దు వల్ల సామాన్య ప్రజలపై పడ్డ ప్రభావాన్ని వీడియోలుగా తీసి డీ మానిటైజేషన్ యానివర్సరీ పేరుతో ఐదు ఫన్నీ వీడియోలు తీశారు. అందులో మోడీ సర్కస్ ఒకటి. వాటిలో కొందరు రెండువేల నోటుకు పుట్టినరోజు జరుపుతుంటే, ఇంకొందరు ఐదువందలు, వెయ్యినోట్లకు వర్ధంతి జరుపుతున్నారు. ఇప్పుడు ఈ విడియోలన్నీ హల్ చల్ చేస్తున్నాయి. చూసినవాళ్లు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏ మాటకా మాట చెప్పుకోవాలంటే... వీటన్నిటిలో సినీనటుడు శింబూ పాటదే హైలైట్.
స్టెప్పు అదిరింది ధోనీ!
సెలబ్రిటీలయినంత మాత్రాన మేం మనుషులం కామా, మాకూ సరదాలుండవా అంటున్నాడు ఇండియన్ క్రికెటర్ ఎం.ఎస్. ధోని. క్రికెట్ ఆటలోనే కాదు, డాన్స్‌లో కూడా తానేమీ తీసిపోనంటున్నాడు. అందుకు ఉదాహరణగా, ఓ పాటకు స్టెప్పులు కూడా వేశాడు ఈ ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్. సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ సప్నా మోతీ భావ్నాని ఇటీవల పోస్ట్ చేసిన ఈ వీడియో దాన్ని బలపరుస్తోంది. 2011లో విడుదలైన హిందీ చిత్రం దేశీ బాయ్స్‌లోని ఝాక్ మార్ కే పాటకు ధోనీ సరదాగా స్టెప్పులు వేసిన ఈ వీడియోలో దోని భార్య సాక్షి కూడా ఉన్నారు. ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయని వాళ్లు, కామెంట్లు పెట్టని వాళ్లూ లేరు. వాళ్లలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఉన్నారు.
ది ట్రంప్ డాగ్!
మనిషిని పోలిన మనుషులుంటారని మనం విన్నాం. కొండొకచో కన్నాం కూడా. అయితే, కుక్క చెవిలో మనిషిని పోలిన కణితి ఉండడం ఎంత వింత! అందునా ఆ మనిషి ఒక ప్రముఖ వ్యక్తి కావడం ఇంకెంత విడ్డూరం! అందుకే ఇది వైరల్ అయి కూచుంది మరి.యూకేకు చెందిన జేడ్ రాబిన్సన్ తన పెంపుడు కుక్క చెఫ్, గత కొద్దికాలంగా చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండడంతో, దాని చెవిలోపలి భాగాన్ని ఫొటో తీసి, పెట్ డాక్టర్‌కు పంపింది. అది చూసిన ఆ వైద్యురాలు, షాకయ్యింది. ఆమెను అంతగా షాక్‌కు గురి చేసిన విషయమేమిటంటే, ఆ పెంపుడు కుక్క చెవిలో ఒక గడ్డ ఉంది. ఆ గడ్డ మూలంగానే దానికి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇంతకీ సదరు డాక్టర్ షాక్ తిన్న విషయం అది కాదు... ఆ గడ్డ అచ్చం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముఖాన్ని పోలి ఉండటమే! చెఫ్, అదేనండీ, ఆ కుక్కగారు.. మేలుకుని ఉన్నప్పుడు దాని చెవిని కనీసం తాకనివ్వను కూడా తాకనిచ్చేది కాదు. దాంతో, జేడ్ అది గాఢంగా నిద్రపోయేటప్పుడు కనీసం 20 సార్లయినా వివిధ భంగిమలలో దాని చెవిని ఫొటోలు తీసి, తన ఫ్రెండ్‌కు పంపింది. ఆమె ఆ ఫొటోలను జూమ్ చేసింది. అందులో ఆమెకు ట్రంప్ ముఖం కనిపించింది. వెంటనే ఆమె ఆ విషయాన్నే జేడ్ చెవిన వేసింది. జేడ్ ఊరుకోలేదు. తన ముద్దుల చెఫ్ వైద్యానికయ్యే ఖర్చులకోసం సాయం చేయవలసిందిగా అర్థిస్తూ ట్విటర్‌లో పోస్ట్ చే సింది. దానికోసం ఓ పేజ్ కూడా క్రియేట్ చేసింది. దీనిపై నలుగురూ నాలుగు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అదే ఇప్పుడు వైరల్ అయ్యింది.
సుస్మితా లుక్‌సూపర్!
నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ త్వరలో 42వ ఏట అడుగు పెట్టబోతోంది. గతంలో ఆమె నిర్ణయం తీసుకుంది. అదేమంటే, బాడీ షేపవుట్ కాకుండా ఫిట్‌గా ఉంచుకోవాలని...ముఖంపై ఏమాత్రం ముడతలు పడకుండా చూసుకోవాలని. వీటిని కాస్మటిక్ ట్రీట్‌మెంట్లు, శస్త్రచికిత్సలతో కాకుండా ఎక్సర్‌సైజ్‌లు, డైటింగ్ ద్వారా మాత్రమే సాధించాలని. ఈ 19న బర్త్‌డే చేసుకోబోతున్న సుస్మిత ప్రస్తుతం షార్జాలో ఉంది. తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.
కుర్చీని తొడిగేసుకోవచ్చు
విలన్ విలాసంగా కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఎదురుగా హీరో నిలబడి ఉంటాడు. హీరోని కూర్చోమని కుర్చీ చూపించే కనీస మర్యాద మన తెలుగు విలన్‌కు ఉండదు. కనుచూపు మేరలో ఉన్న కుర్చీని కండువాతో లాగి, దాని మీద కూర్చుని కాలు మీద కాలేసుకుని దర్పాన్ని ఒలకబోస్తాడు మన హీరో. ఇకపై మన హీరోలు కుర్చీ కోసం లేనిపోని ఫీట్లు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కుర్చీని తొడిగేసుకోవచ్చు. అదేంటి ఫ్యాంటా? కోటా? తొడిగేసుకోవడానికి అని ఆశ్చర్యపోకండి. ఇంచక్కా ఫ్యాంటులాగానే ఒంటికి తొడిగేసుకునే కుర్చీ అందుబాటులోకి వచ్చేసింది.
ఈ కుర్చీలాంటి కుర్చీని ఫ్యాంటుకు తొడిగేసుకుని ఎక్కడికైనా ఈజీగా వెళ్లొచ్చు. కూర్చోమని ఎవరూ కుర్చీ చూపించకపోయినా, దర్పానికి లోటు రాకుండా ఎక్కడంటే అక్కడ కాలు మీద కాలేసుకుని భేషుగ్గా కూర్చోవచ్చు. ‘నూనీ ఏజీ’ అనే స్విస్ కంపెనీ ఈ తొడుక్కునే కుర్చీని రూపొందించింది. దీని ధర దాదాపు వెయ్యి డాలర్లు. మన లెక్కల్లో చెప్పుకోవాలంటే సుమారు రూ.60 వేలు.
Comments
Please login to add a commentAdd a comment