అడవిలో అదృశ్యం | Disappear in the jungle | Sakshi
Sakshi News home page

అడవిలో అదృశ్యం

Published Tue, Apr 10 2018 12:23 AM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

Disappear in the jungle - Sakshi

మూడు దిక్కులు అబద్ధాలు చెబుతున్నాయి ఒక దిక్కు కనపడ్డం లేదు ఆ భార్య ఇప్పుడు ఏం చేయాలి? క్రిమినల్స్‌ కనికట్టు చేస్తారు అది వాళ్ల పని. ఆ కనికట్టులో ఉన్న  కట్టును విప్పడమే స్మార్ట్‌ పోలీస్‌ పని.

మానవ హక్కుల సంఘం నిర్వహించిన ప్రెస్‌మీట్‌.  నిందితులు ముగ్గురూ చేతులు కట్టుకుని నిల్చున్నారు. పొదయ్యను కిడ్నాప్‌ చేసింది మావోయిస్టులు కాదు పోలీసులు అయి ఉంటారని వాళ్ల తాజా స్టేట్‌మెంట్‌.

అవును. మూడు దిక్కుల నుంచి అబద్ధాలు వినపడుతున్నాయి. నాలుగో దిక్కు చీకటిగా ఉంది.వెలుతురు ఎప్పుడు వస్తుంది.ఆమె ఏమి చేయాలి?మొగుడూ పెళ్లాల మధ్య ఉన్న ప్రేమ వాళ్లు ఒకరికొకరు దూరమైనప్పుడే బయటకు వస్తుంది కాబోలు. ఇప్పుడు ఆమెలో అటువంటి ప్రేమ, ఆతురత, అక్కర కనిపిస్తున్నాయి. ఆందోళన, భయం కూడా ఉంది. ఆమెకు సమాధానం కావాలి. సమాధానంచెప్పాల్సింది పోలీసులు.‘ఏం కావాలమ్మా?’ కానిస్టేబుల్‌ అడిగాడు.స్టేషన్‌ వాతావరణం చూసి ఆమె భయపడకుండా ఉండేలా అతడు గొంతులో స్నేహాన్ని ప్రదర్శించాడు.‘అయ్యా... మా ఆయన..’ ఆమె ఏదో చెప్పబోతుండగా లంచ్‌కి వెళ్లిన సీఐ ప్రసాద్‌ అప్పుడే స్టేషన్‌కు వచ్చాడు. ఆమె చూసి కానిస్టేబుల్‌తో ‘ఏంటి విషయం’ అడిగాడు. ‘అదే అడుగుతున్నాను సార్‌! ఏంటో నీ విషయం పెద్ద సారుకు  చెప్పు’ అన్నాడు కానిస్టేబుల్‌ టేబుల్‌ మీద ఫైళ్లు సరిగ్గా పెడుతూ. ఆమె రెండు చేతులు కట్టుకుంది. ముప్పై ఐదేళ్లు ఉంటాయి. ‘సారూ.. నా పేరు ముత్తమ్మ. మా ఇంటాయన నెల రోజుల్నుంచి కనిపించడం లేదు. నా మీద అలిగి సుట్టాలింటికి Ðð ళ్లాడేమోలే అని అనుకున్నా. సుట్టాలింట్లోనూ లేడని తెలిసింది. ఊరోళ్లు తలో మాట చెబుతున్నారు. నాకేమీ తెలియడం లేదు. మాకిద్దరు చిన్న పిల్లలున్నారయ్యా.. నాయిన మీద బెంగెట్టుకున్నారు! మా ఆయన ఏడున్నాడో మీరే కనుక్కొని చెప్పండి’ రెండు చేతులెత్తి దణ్ణం పెట్టింది.సీఐ కానిస్టేబుల్‌ వైపు చూశాడు. అప్పటికే అతడు ముత్తమ్మ దగ్గర నుంచి వివరాలు రాసుకోవడం మొదలుపెట్టాడు. మిస్సింగ్‌ కేస్‌. తేదీ: 20 నవంబర్, 2004పేరు: మిడియం పొదయ్యవయసు : 40గ్రామం: గోపాలపురం, చింతూరు మండలం, తూ.గో.జిల్లా.పని: పోడు వ్యవసాయంముత్తమ్మను పంపించేశాక సి.ఐ ఆలోచనలో పడ్డాడు– పొదయ్య ఏమైనట్టు అని.

మరుసటి రోజు ఉదయం.సీఐ, ఎస్‌ఐ, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు గోపాలపురం వెళ్లారు. పోలీసుల జీప్‌ శబ్దం, బూట్ల అలికిడికి ఊరు కుతూహలంగా, భయంగా సమీపించింది.‘పొదయ్య ఎక్కడ?’ సి.ఐ అడిగారు.అందరూ మౌనంగా ఉన్నారు.‘చివరిసారి ఎవరు చూశారు... ఎవరితో చూశారు?’ మళ్లీ అడిగారు.పొదయ్య కాలు కుదురుగా నిలవని మనిషి. ఎప్పుడు ఎటు వెళతాడో ఎవరికీ తెలియదు. చివరిగా ఎప్పుడు కనిపించాడో ఎవరికీ గుర్తు లేదు. ఎంత సేపున్నా ఏం తెలిసేలా లేదు. ఇంకాసేపట్లో జీపు కదలబోతోంది. ఆ ఊళ్లోని  చెంచులయ్య వచ్చి ‘సార్‌ అతగాడు గంగయ్య, లక్ష్మయ్య, ముత్తయ్యలతో వెళ్లడం నేను చూశా’ అన్నాడు.‘వాళ్లెవరు?’ సి.ఐ అడిగాడు.‘పొదయ్య నేస్తులే’ అన్నాడు చెంచులయ్య. ఊళ్లో వాళ్లు అవునన్నారు.ఆ ముగ్గురినీ పిలిపించారు పోలీసులు. ‘పొదయ్య ఎక్కడ?’ అడిగాడు సీఐ. ‘మాకేం తెలుసు సారూ!’ అన్నారు ముగ్గురూ. ‘ఈ ముగ్గురునీ జీపెక్కించండి’ అన్నాడు సీఐ..వచ్చినంత వేగంగా ఆ ముగ్గురినీ జీపులోకెక్కించుకొని పోలీసుస్టేషన్‌కి తీసుకెళ్లారు. 

ఇంటరాగేషన్‌ మొదలయ్యింది.  ‘పొదయ్య ఎక్కడ..’ పోలీసులు అడుగుతూనే ఉన్నారు. వాళ్లు హాహాకారాలు చేస్తున్నారు.‘మాకేం తెలియదు సారూ. ఆ రోజు రాత్రి పొదయ్య మా వెంట ఉన్నాడు నిజమే. మేమంతా ఊరి బయట ఉన్న గుట్ట దగ్గర మందు కొట్టాం. అప్పుడే ‘అన్నలు’ (మావోయిస్టులు) బిలబిల వచ్చారు. పొదయ్యతో పాటు మా నలుగురు కళ్లకు గంతలు కట్టి అడవిలోకి తీసుకెళ్లిపోయారు. ఆ రోజంతా వాళ్లతోపాటే ఉంచుకున్నారు. మేం ముగ్గురం వదిలిపెట్టమని వాళ్ల కాళ్లావేళ్లా పడ్డాం. పొదయ్య మాత్రం ఏమీమాట్లాడలేదు. తర్వాత ఏమనుకున్నారో ఏమో మా ముగ్గురినీ విడిచిపెట్టారు. పొదయ్యను వాళ్ల వెంట తీసుకెళ్లిపోయారు. అంతకు మించి మాకేం తెలియదు సారూ. మమ్మల్ని నమ్మండి’ అన్నారు.పోలీసులు షాక్‌ అయ్యారు. పొదయ్యను మావోయిస్టులు తీసుకెళ్లారా? మావోయిస్టులు ఇన్‌ఫార్మర్లను లిఫ్ట్‌ చేయడం ఆనవాయితే. పొదయ్య ఇన్ఫార్మరా? వీళ్ల మాటల్ని ఎలా నమ్మాలి. లాఠీలకు పని చెప్పారు. గంగయ్య, లక్ష్మయ్య, ముత్తయ్యలు పెడబొబ్బలు పెట్టారు. రెండు మూడు రోజులకు ఈ విషయం బయటకు పొక్కింది. మానవ హక్కుల సంఘానికి సమాచారం అందింది. అమాయకులను పట్టుకుని హింసిస్తున్నారని అంతటా పోలీసులపై విమర్శలు ప్రారంభమయ్యాయి.వీళ్లు అమాయకులైతే నిందితులు ఎవరు? పొదయ్య ఏమయ్యాడు. క్లూ ఏమిటి? మరుసటి రోజు బాంబు పేలింది.

మానవ హక్కుల సంఘం నిర్వహించిన ప్రెస్‌మీట్‌.  నిందితులు ముగ్గురూ చేతులు కట్టుకుని నిల్చున్నారు. పొదయ్యను కిడ్నాప్‌ చేసింది మావోయిస్టులు కాదు పోలీసులు అయి ఉంటారని వాళ్ల తాజా స్టేట్‌మెంట్‌.‘సార్, మీకూ తెలుసు కదా. మన పక్కనే బలిమెల వద్ద (ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతం) జరిగిన మావోయిస్టుల దాడిలో 36 మంది గ్రేహౌండ్స్‌ సిబ్బంది చనిపోయారు. ఈ అటాక్‌కు సమాచారం అందించాడన్న అనుమానంతో పోలీసులే పొదయ్యను కిడ్నాప్‌ చేసుంటారు. నేరాన్ని మా మీద నెట్టి వీళ్లు తప్పించుకోవాలని చూస్తున్నారు’ అన్నాడు లక్ష్మయ్య.అటూ ఇటూ తిరిగి ఈ పిడిగు తమ మీద పడటంతో పోలీసులు ఖంగు తిన్నారు. ప్రెస్‌లో అంతా గోలగోల అయ్యింది. పొదయ్య ఏమయ్యాడో తేలలేదు.  గంగయ్య, లక్ష్మయ్య, ముత్తయ్య వాళ్ల పనుల్లో వాళ్లు పడ్డారు. ముత్తవ్వ ఆమె పిల్లలు పొదయ్య రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

రెండున్నర నెలలు గడిచిపోయాయి పొదయ్య కనిపించక. పై అధికారుల నుంచే కాదు బయట నుంచి కూడా ఒత్తిడి పెరిగింది– పోలీసులు దాచిపెట్టిన పొదయ్యను బయటకు తీసుకురావాలని. ఈలోపు పోలీసులు ఎందుకైనా మంచిదని గంగయ్య, లక్ష్మయ్య, ముత్తయ్యల మీద నిఘా పెట్టారు. పెద్దగా ఏమీ దొరకలేదు. ముగ్గురి ఇళ్లల్లో హటాత్‌ మరణాలు సంభవించాయి. అవన్నీ అనారోగ్య మరణాలే. కనుకవాటికీ పొదయ్యకు సంబంధం ఉండే అవకాశం లేదు. కనుక వీళ్లు అమాయకులే అయి ఉండాలి. మరైతే పొదయ్య ఏమైనట్టు? మావోయిస్టులే చంపేసి ఉండాలి.అప్పుడే మావోయిస్టుల నుంచి ఓ లేఖ మీడియాకు చేరింది. ‘పొదయ్య అదృశ్యానికీ మాకూ ఎలాంటి సంబంధం లేదు’ అని ఉంది అందులో. అంతే. పోలీస్‌ జీప్‌ రయ్యిన గోపాలపురం వైపుగా దూసుకెళ్లి్లంది. గంగయ్య, లక్ష్మయ్య, ముత్తయ్యలను అరెస్ట్‌ చేశారు. వాళ్లు చెప్పింది విని పోలీసులు ఆశ్చర్యపోయారు. మూఢవిశ్వాసాలు ఇంత పని చేస్తాయా?

‘పొదయ్యకు చేతబడి వచ్చు. మంత్రాలు, పూజలు విపరీతంగా చేస్తాడు. మా అక్క కొడుకు పొదయ్య చేతబడి చేయడం వల్లే చనిపోయాడు. అందుకే వాడ్ని మట్టుపెటాలనుకున్నాను’ అన్నాడు గంగయ్య. ‘మా దగ్గరి సుట్టాల్లో ముగ్గురు పొదయ్య చేతబడి వల్ల చచ్చిపోయారు. అదీ నెల తేడాతోనే. పొదయ్య బతికుంటే చేతబడితో ఇంకెంతమందిని చంపుతాడో అని మేమే∙చంపాలని నిర్ణయించుకున్నాం’ అన్నారు లక్ష్మయ్య, ముత్తయ్య. ‘మూడు నెలల కిందట ఓ రోజు చీకటి పడుతుండగా పనుందంటూ పొదయ్యను గ్రామానికి సమీపంలోని ఓ కొండపైకి తీసుకెళ్లాం. అక్కడే కర్రలతో కొట్టి చంపేశాం. తర్వాత శవాన్ని బండరాళ్ల నడుమ పడేసాం’ చెప్పారు ముగ్గురూ!తాము పట్టుబడకండా వుండేందుకు ఓసారి మావోయిస్టులు, మరోసారి పోలీసులు కిడ్నాప్‌ చేసారని కేసును తప్పుదోవ పట్టించామని ముగ్గురూ నేరం అంగీకరించారు. తమకు సంబంధం లేదంటూ మావోయిస్టులు రాసిన లేఖ క్లూ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు తమను ముప్పుతిప్పలు పెట్టిన నిందితులను ఎట్టకేలకు అరెస్టు చేసారు. మరుసటి రోజు నిందితులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు అక్కడి బండరాళ్ల నడుమ లభ్యమైన పొదయ్య అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
– మొహమ్మద్‌ షౌకత్‌ అలీ, 
సాక్షి ప్రతినిధి, చింతూరు, తూర్పుగోదావరి జిల్లా, 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement