పదిలం పసి కుసుమం
చలికాలంలో చర్మం పొడిబారుతుంది. అతి కోమలంగా ఉండే శిశువుల చర్మమైతే ఇక చెప్పేదేముంది? అందుకే చలికాలమంతా శిశువుల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సీజన్‌లో చలిగాలులు వీస్తుంటాయి. గాలిలోని తేమ తగ్గిపోతుంటుంది. పర్యవసానమే చర్మం పొడిబారడం.. పొట్టు రాలడం... దురదపెట్టడం. కందిపోవడం. శిశువుల విషయంలో ఇలా జరక్కుండా ఉండాలంటే వారి చర్మ సంరక్షణకు సంబంధించి కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
చలికాలంలోనూ వేడి పొక్కులు!
వేడిపొక్కులు, గుల్లలు వేసవిలో మాత్రమే వస్తాయనుకుంటాం. అది తప్పు. శిశువులను చలి నుంచి కాపాడేందుకు వారికి తొడిగే మందపాటి వస్త్రాల వల్ల కూడా ఉక్కబోసి, ఊపిరాడనట్లై వారి చర్మం మీద గుల్లలు, దద్దుర్లు ఏర్పడుతుంటాయి. అందుకే ఒంటికి గాలి తగిలేలా తేలికపాటి దుస్తులను వేయాలి. కాటన్ దుస్తులకు చెమటను పీల్చుకునే గుణం ఉంటుంది. కాబట్టి శిశువులకు మొదట కాటన్ దుస్తులను వేసి, చలి తీవ్రతను బట్టి పైన ఉన్ని వస్త్రాలను కప్పాలి. అయితే అవి కూడా తేలికపాటివై ఉండాలి.
నులివెచ్చని నీటి స్నానం
పెద్ద వాళ్లతో పోల్చి చూసినప్పుడు శిశువుల చర్మం శీతాకాలంలో త్వరగా నిర్జలీకర ణ చెందుతుంది. ఆ పరిస్థితి నివారించేందుకు వేణ్ణీళ్లతో లేదా చన్నీళ్లతో కాకుండా నులివెచ్చటి నీటితో వారికి స్నానం చేయించాలి. అప్పుడు చర్మం సమస్థితిలో ఉంటుంది. అలాగే బేబీ ప్రాడక్ట్ విషయంలోనూ జాగ్రత్త వహించాలి. గాఢమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులు శిశువు శరీరంపై ఉండే సహజసిద్ధమైన నూనెలను హరించివేస్తాయి. దీని వల్ల చర్మం బిరుసెక్కి దురద పెడుతుంది. స్నానం చేయించాక శిశువు ఒంటి పై తడిని మెత్తటి పొడి టవల్‌తో అద్దినట్లుగా తుడవాలి. ఆ తర్వాత తే లికపాటి హెర్బల్ బేబీ లోషన్‌ను సుతిమెత్తగా, చర్మం లోనికి పీల్చుకునేలా ఒంటికి పట్టించాలి. అలా చలికాలమంతా ఆరు గంటలకోసారి చర్మానికి లోషన్ రాస్తుంటే మృదువుగా ఉంటుంది.
సుతిమెత్తగా మర్దనా
చలికాలంలో శిశువుకు మృదువుగా మర్దనా చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. మర్దనా వల్ల రక్త ప్రసరణ క్రీయాశీలమై శరీరానికి వెచ్చదనం చేకూరుతుంది. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల చర్మం తేమగా, మృదువుగా ఉండి, పొట్టు రాలే సమస్య ఉత్పన్నం కాదు. అయితే వాతావరణం సమస్థితిలో ఉండే మధ్యాహ్నం వేళల్లో మాత్రమే శిశువుకు మర్దనా చేయాలి. అలాగే ఆహారం తినిపించాక మర్దనా చేయకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఏడు మాలికా వైద్య పరిష్కారాలు
ఆలివ్ ఆయిల్: ఇందులో ఇ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. శిశు చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచే ఉపశమనాలు, క్రిమినిరోధకాలు ఇందులో ఉన్నాయి. ఆల్మండ్ ఆయిల్: శిశువు చర్మానికి తేమను అందిస్తుంది.
కంట్రీ మాలో: ఇది యాంటీ ఆక్సిడెంటు. ఇందులో పోషకాలు ఉన్నాయి. శిశువు చర్మాన్ని క్రిముల నుండి కాపాడుతుంది.
లికోరైస్: దురద, వాపు. దద్దుర్లకు ఇది చక్కటి లేపనం.
ఫెనూగ్రీక్: తిరుగులేని మాయిశ్చరైజర్. ప్రత్యేకించి శిశువు పొడిచర్మానికి తేమను అందించడానికి ఉద్దేశించినది.
గ్రీన్‌గ్రామ్: శిశువు చర్మాన్ని సమశీతోష్ణంగా ఉంచుతుంది.
అలోవెరా: గాయాలు, కాలిన గాయాలు, చర్మ వ్యాధులకు ఇది చక్కటి ఆయుర్వేద ఔషధం. చర్మానికి తేమను అందిస్తుంది.
బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పని చేస్తుంది.
కాటన్ దుస్తులకు చెమటను పీల్చుకునే గుణం ఉంటుంది. కాబట్టి శిశువులకు మొదట కాటన్ దుస్తులను వేసి, చలి తీవ్రతను బట్టి పైన ఉన్ని వస్త్రాలను కప్పాలి. అయితే అవి కూడా తేలికపాటివై ఉండాలి.