విచక్షణ ప్రధానం
ఆత్మీయం
ఆయన ఓ జెన్ గురువు. ఆయన ఒకరోజు సాయంత్రం వాకిలి అరుగుమీద కూర్చుని రేడియోలో వస్తున్న పాటలు వింటూ ఆనందిస్తున్నారు. పక్కనున్న శిష్యుడికి పాటలలోని భావాన్ని, గాన మాధుర్యాన్ని వివరిస్తున్నారు. కాస్సేపటికి ఆయనను చూడడానికి ఒక సాధువు వచ్చారు. ఏంటీ? ఇవాళ షికారుకెళ్ళలేదా?’’ అడిగారు సాధువు. ‘లేదు... ఇదిగో ఈ పాటలు వింటున్నాను. బాగున్నాయా?’’ అడిగారు గురువు. ఏమిటీ ఆయన పాటలు వింటున్నారా? ఆయన తాగుబోతటగా? చుక్కజీnకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. అంతెందుకు తాగందే పాడలేడు...’’ అని ఆ గాయకుడి గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాడు సాధువు. అప్పుడు గురువుగారు ‘‘మనకు కావలసింది ఆయన గొంతు బాగుందా? లేదా? పాట బాగా పాడుతున్నాడా? లేదా అనేవే ముఖ్యం... ఏమంటారు?అన్నారు. ఏదో పనున్నట్టు అక్కడినుంచి వెళ్ళిపోయాడు సాధువు.
కొంతసేపైంది. మరో సాధువు వచ్చాడు గురువుగారిని చూడటానికి. రేడియోలో వినిపిస్తున్న పాట విని సాధువు కూర్చుంటూనే ఆ పాట పాడుతున్న గాయకుడి గురించి పొగిడాడు. ‘ఆయన గాత్రం అమోఘం. ఆయన ఏ పాటైనా ఆస్వాదించి పాడతారు. ఆ తీరు నాకు చాలా ఇష్టం’ అన్నాడు. అప్పుడు గురువుగారు ‘‘ఆ గాయకుడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడటగా? చుక్క లేనిదే క్షణంæఉండలేడంటారు అందరూ...’’ అన్నారు. దాంతో ఆ సాధువు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరు సాధువులతోనూ గురువుగారి మాట తీరును గమనిస్తున్న శిష్యుడికి ఏమీ అర్థం కాలేదు. సమయం చూసుకుని ‘‘గురువుగారూ, మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు’’ అన్నాడు. గురువుగారు ఇలా అన్నారు – ‘‘కాయగూరలు తూకం వేయడం దుకాణదారు పని. ఆ త్రాసులో మనుషులను కూర్చోపెడితే అది విరిగిపోదూ? అందుకే ఎవరు ఎవర్ని తూకం వేసినా నేను అడ్డుపడి ఏదో ఒకటి మాట్లాడి ఆ విమర్శను సరి చేస్తాను. ఎవరో ఏదో అంటున్నారని మనల్ని మనం సందిగ్ధంలోకి నెట్టేసుకోకూడదు. మనకు హాని లేనంత వరకు ఎవరు ఏం చెప్పినా నష్టం లేదు. విచక్షణ ముఖ్యం’’ అని!