సాక్షి, అమరావతి: ప్రజా సంకల్ప పాదయాత్రలో ఉన్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 12వ తేదీన విశాఖపట్నంలో ముస్లింలు ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొంటారు. పాదయాత్రలో ఇప్పటికే జగన్ వివిధ సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో(2014) సీఎం చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలతో తీవ్రంగా మోసపోయిన వర్గాల ప్రజలంతా ఈ సమ్మేళనాల్లో జగన్‌ను కలుసుకుని తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు.
వారు మోసపోయిన తీరును, వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుంటున్న ప్రతిపక్ష నేత.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో చెబుతూ ఆయా వర్గాల వారికి భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు. జగన్ పాల్గొంటున్న ఈ కార్యక్రమాలన్నింటికీ భారీఎత్తున జనం హాజరై ఆయనకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. అంతేగాక.. తమ సమస్యలు పరిష్కారం కావాలన్నా, తమ బతుకులు బాగుపడాలన్నా జగన్ గెలుపు ఒక్కటే పరిష్కారమనే విశ్వాసాన్ని ఆయా వర్గాలవారు వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ముస్లింల జనాభా గణనీయంగా ఉన్న విశాఖపట్నం నగరంలో ఆ వర్గం వారితో జగన్ సమావేశం అవుతున్నారు.
2014 ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింలకోసం చంద్రబాబు పొందుపర్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా మళ్లీ కొత్తగా వారిని మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను జగన్ ఈ సమావేశంలో తిప్పికొట్టడమేగాక సీఎం నిజస్వరూపాన్ని గ్రహించాలని పిలుపునివ్వబోతున్నారు. 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్‌టీఎస్ రోడ్డు–అరిలోవలో ఈ సమావేశం జరుగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. విశాఖ ముస్లింలు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment