అన్న ఉంటే కొండంత అండ ఉన్నట్లేనని భావిస్తుంది ఏ ఆడబిడ్డ అయినా! కాని అదే అన్న.. పరాయి ఆడపిల్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తెలిస్తే.. తోడపుట్టిన వాడు లేడని చెప్పుకోవడానికీ వెనకాడదు! గౌరవ మర్యాదలు ఏ అమ్మాయికైనా ఒకటే కాబట్టి వాటిని లెక్కచేయనివాడు తోబుట్టువైనా సరే క్షమించదు. తనకసలు తోడే పుట్టలేదనుకుంటుంది. ‘దిశ’ నిందితుల అక్కాచెల్లెళ్లూ అదే చేస్తున్నారు.. తోటి వాళ్లముందు తమను తలెత్తుకోనివ్వకుండా శిక్ష వేసిన అన్నదమ్ములు తమకు లేరనే నిర్ణయానికి వచ్చారు!
ఈ యేడాది (2019) జూన్‌లో ‘ఆర్టికల్ 15’ అనే హిందీ సినిమా వచ్చింది. అస్పృశ్యతా నేరాన్ని చర్చించిందీ సినిమా ఇద్దరు అమ్మాయిల మీద చేసిన లైంగిక దాడి, హత్య నేపథ్యంలో. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సరే.. ఆ విషయం పక్కన పెడితే.. ఈ సినిమాలో దిశ ఘటనను పోలి ఉన్న అంశం ఒకటి ఉంది. ‘‘ఆర్టికల్ 15’’లో ఇద్దరు అమ్మాయిల హత్యకేసును ఛేదించే ప్రయత్నంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్‌కు ఒక నిజం తెలుస్తుంది.
ఆ రేప్, హత్యానేరంలో తన ఇంట్లో పనిచేసే టీన్స్ అమ్మాయి అన్న కూడా భాగస్తుడని. చెల్లెలి పట్ల ఎంతో ప్రేమగా, బాధ్యతగా ఉండే ఆ అన్న ఇలాంటి పని ఎలా చేశాడో మింగుడుపడదు ఆ ఐపీఎస్ ఆఫీసర్‌కి. తల్లీతండ్రిని ఆ అన్నలోనే చూసుకుంటున్న ఆ సోదరి ఈ వాస్తవం విని ఎలా తట్టుకుంటుందో? అని మథన పడ్తాడు. చెప్పేస్తాడు కూడా... ‘‘అంతటి దారుణానికి బలైన ఆ ఇద్దరు నీ ఈడు పిల్లలే. నీలాంటి వాళ్లే. జీవితం పట్ల ఎన్నో ఆశలు, కలలు కన్నవాళ్లే.
నీ కోసం అంత కష్టపడే నీ అన్ననే ఆ పిల్లల పట్ల ఇలా ప్రవర్తించాడు’’ అంటూ. అంతా విన్న ఆ అమ్మాయి షాక్ అవుతుంది. తేరుకున్నాక ఏడుస్తుంది. అన్న మీద ఉన్న నమ్మకం పోయి. ఇంచుమించు ఇలాంటి స్థితిలోనే ఉన్నారు ‘దిశ’ నిందితుల తోబుట్టువులు. ఆరిఫ్, నవీన్‌కు చెల్లెళ్లు, జోళ్లు శివ, చెన్నకేశవులుకు అక్కలు ఉన్నారు. తమ అన్న, తమ్ముళ్లు చేసిన పనికి సిగ్గుపడ్తున్నారు. తలెత్తుకొని నలుగురిలోకి రాలేకపోతున్నారు. ఆరిఫ్ చెల్లెలు అయితే ఆ ఊర్లోంచే వెళ్లిపోయి బంధువుల ఇంట్లో ఉంటోంది. మిగిలిన వాళ్లూ అంతే.. అవమానభారంతో అజ్ఞాతాన్నే కోరుకుంటున్నారు.
నేనొక్కదాన్నే పుట్టాననుకో..
ఈ మాట అంటున్నది ఆరిఫ్ చెల్లెలు. ‘‘నేనూ ఒక ఆడపిల్లనే. నాలాంటిదాని మీదే అఘాయిత్యం చేశాడు అన్న. ఆ పనికి అన్నకు ఏ శిక్షపడినా బాధపడకు అమ్మా..! అన్న పుట్టనేలేదనుకో. నేనొక్కదాన్నే పుట్టాననుకో. నేను మిమ్మల్ని పోషిస్తా. అన్న జైలుకి వెళ్లినా తిరిగిరాడు. తప్పు చేసిన అన్న గురించే నువ్వు ఇంత బాధ పడ్తుంటే అవతల ఏ తప్పూ లేకుండా కూతుర్ని పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడ్తూండాలమ్మా..! అందుకే అన్న గురించి ఆలోచించడం మానెయ్’’ అని వాళ్లమ్మకు చెప్తోంది ఆరిఫ్ సోదరి. పదవ తరగతి చదివిన ఆ అమ్మాయి తొందరగా పై చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటోంది.
మొహమెట్లా చూపించాలి?
నవీన్ చెల్లెలు ఎనిమిదవ తరగతి చదువుతోంది. అన్న చేసిన దారుణమైన పనికి భయంతో వణికిపోతోంది. ఆ దుర్ఘటన వెలుగు చూసినప్పటి నుంచి బడికి వెళ్లాలన్నా భయపడుతోంది. స్కూల్లో తోటి విద్యార్థులతో ఇమడలేక.. వాళ్లతో కలవలేక.. బడికి వెళ్లడమే మానుకుంది. ‘‘స్కూల్లో నా ఫ్రెండ్స్‌కి ఎట్లా మొహం చూపించాలి? నాతోకాదు’’ అంటూ ఏడుస్తోందట.
ఏ శిక్ష విధించినా సరే..
చెన్నకేశవుల అక్క కూడా ఇంచుమించు ఇంతే. తమ్ముడు చేసిన పనికి అటు అత్తగారి ఊర్లో, ఇటు పుట్టిన ఊర్లో ఎదురయ్యే అవమానాలను తలుచుకొని ఇంటి గడపదాటడమే మానేసింది.చెన్నకేశవులుకి పెళ్లయింది. భార్య ప్రస్తుతం గర్భవతి. ‘‘తన భార్యా ఒక ఆడదే అని మరిచి ఆ ముగ్గురితోపాటు నా మొగుడు ఇంకో ఆడపిల్లను చంపాడు. ఇందుకు అతనికి ఏ శిక్ష విధించినా సరే! ఇంకో రెండు నెలల్లో బిడ్డ పుడతాడు. వాళ్ల నాన్న గురించి వాడికి ఏమని చెప్పాలి? వాడు అట్లా కాకుండా అయితే చూసుకోవాలి కదా! నా తల రాత ఇట్లా రాసి ఉంది మరి.. ఏం చేయాలి?’’ అని వాపోతోంది చెన్నకేశవులు భార్య. ఆ నలుగురూ కనీసం ఈ అయిదుగురు ఆడవాళ్ల గురించి ఆలోచించినా.. వాళ్ల ప్రవర్తన తాలూకు పర్యవసానాలను వీళ్లు భరించాల్సి ఉంటుందని గ్రహించగలిగినా ఈరోజు వీళ్లు ఇలా సిగ్గుతో తలవంచుకునేవాళ్లు కాదు.
ఇది అందరు అన్నలు, తమ్ముళ్లు, కొడుకులు, తండ్రులు, భర్తలు ఆ మాటకొస్తే మొత్తం పురుషులకే పాఠం. ఈ నలుగురి తల్లిదండ్రులకు తమ పిల్లలు చేసిన నేరం తీవ్రత తెలియదు. అందరివీ పేద కుటుంబాలే. కూలీనాలీ చేస్తూ పిల్లలను పెంచారు. ఆ నలుగురిలో ఆరిఫ్ ఒక్కడే పదవ తరగతి వరకు చదివాడు. మిగిలిన ముగ్గురు ఏడుతో ఆపేశారు. జల్సాలు, బైక్ మీద తిరగడాలు, మద్యం తాగడమే వాళ్లకు తెలిసినవి. గమనించదగ్గ విషయమేంటంటే.. ఈ ముగ్గురూ ఊళ్లో ఏడవ తరగతి వరకే ఉండడంతో అంతదాకే చదివి మానేశారు. కాని ఈ ఇంటి ఆడపిల్లలు పక్క ఊరికి వెళ్లి మరీ చదువుకుంటున్నారు. అందుకే ఆడపిల్లల పట్ల కాదు మనం శ్రద్ధ పెట్టాల్సింది మగపిల్లల పెంపకం మీద. పేదింట్లో అయినా.. పెద్దింట్లో అయినా!
– ఆనంద్‌కుమార్ గౌడ్,
సాక్షి, నారాయణపేట,
Comments
Please login to add a commentAdd a comment