ఒడిసిపడితే లాభం... బెడిసికొడితే నష్టం
ఉమెన్ ఫైనాన్స్ / పుట్ ఆప్షన్స్
షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్క్ తగ్గించుకోడానికి ‘డెరివేటివ్స్’ ఒక చక్కటి పరిష్కారం. డెరివేటి వ్స్‌లో రెండు రకాలు ఉంటాయి. ఫ్యూచర్స్, ఆప్షన్స్. డెరివేటివ్స్ గురించి, ఫ్యూచర్స్ గురించి గత సంచికల్లో తెలుసుకున్నాం. ఆప్షన్స్‌లోని రెండు రకాలలో ఒకటైన కాల్ ఆప్షన్‌పై గతవారం అవగాహన కలిగించుకున్నాం. ఈవారం పుట్ ఆప్షన్ అంటే ఏమిటో, దాని లాభనష్టాలేమిటో చూద్దాం.
పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్‌కి సరిగ్గా రివర్స్‌లో ఉంటుంది. అంటే కాల్ ఆప్షన్ కొన్నవారికి ధర పెరిగితే లాభం. అదే పుట్ ఆప్షన్ కొన్నవారికి ధర తగ్గితే లాభం. అలాగే పుట్ ఆప్షన్ అమ్మినవారు ధర తగ్గితే ఎక్కువ నష్టపోవలసి వస్తుంది. పెరిగితే ప్రీమియం మొత్తం గరిష్ట లాభంగా ఉంటుంది. ఈ పుట్ ఆప్షన్‌లోని లాభనష్టాలు ఎలా ఉంటాయో కింది పట్టికలో గమనించవచ్చు.
ఆప్షన్ అమ్మిన వ్యక్తి అపరిమిత నష్టాన్ని భరించవలసి ఉండడమే కాకుండా, మార్జిన్ మొత్తాన్ని కూడా చెల్లించవలసి ఉంటుంది. హెడ్జింగ్ (ముందస్తు రక్షణ ఏర్పాటు) చేసుకునేవారికి ఈ ఆప్షన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ స్పెక్యులేషన్ చేసేవారు జాగ్రత్తగా వ్యవహరించకుంటే భారీగా నష్టపోవలసి ఉంటుంది. ఆప్షన్స్ అనేవి పదునైన కత్తి లాంటివి. సరైన క్రమపద్ధతిలో, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. బెడిసికొడితే చాలా నష్టపోవలసి ఉంటుంది.