
గర్వభంగం!
అనగనగా ఒక సారి ఒక నెమలి పురివిప్పి నాట్యం చేస్తూ ఆనందిస్తోంది. రంగు రంగుల పింఛంతో నెమలి మరింత అందంగా ఉంది. తన అందమైన పింఛాన్ని చూసుకుని ఎంతో గర్వపడింది. కొంతసేపటికి అక్కడికి ఒక పెద్ద కొంగ వచ్చింది. అది నెమలితో కబుర్లు చెప్పాలనుకుంది. కానీ నెమలి బోసిగా ఉన్న కొంగ తోకను చూసి అసహ్యించుకుంది.
‘‘నా వైపు అలా ఎందుకు చూస్తున్నావు?’’ అని నెమలిని కొంగ అడిగింది. అందుకు నెమలి నవ్వుతూ ‘‘నీ తోకని చూసి నవ్వొస్తోంది. ఈకలు ఏమిటి అలా ఉన్నాయి? అందంలేదు, పొడవూ లేవు. నన్ను చూడు ఎంత అందంగా ఉన్నానో’’ అంది. ఇక అంతటితో ఊరుకోక దాన్ని మరింత ఏడిపించాలని, ‘‘చూశావా! ప్రకృతి నీకు ఎంత అన్యాయం చేసిందో! బలమైన పక్షివే, కాని ఏం లాభం నీ తోక ఏమాత్రం ఆకర్షణీయంగా ఉండదు. నిన్ను చూస్తే జాలి వేస్తోంది’’ అని అంది. నెమలికి బుద్ధి చెప్పాలని కొంగ అనుకుంది. ‘‘నీకేం తెలుసు? ప్రకృతి అందరికీ, అన్నింటికి ఎప్పుడూ సమన్యాయమే చేస్తుంది. నీకు అందమైన రెక్కలు, పింఛమూ ఉంటే నా తోక ఆకర్షణీయంగా ఉండదు. కాని నేను ఆకాశంలో మబ్బుల్ని తాకుతూ ఎగిరిపోగలను, నీకు ఆ అదృష్టం లేదుగదా!’’ అన్నది. నెమలి తన పొరపాటును గ్రహించి కొంగను క్షమించమని కోరింది.