అహంకారం చీకటికన్నా ప్రమాదకరం
దురహంకారం, మూర్ఖత్వం కవలపిల్లలు. విషాదమేమిటంటే తన మూర్ఖత్వమే తనకు గొయ్యి తవ్వుతుందన్నది దురహంకారికి తెలియదు. ఈజిప్టు చక్రవర్తి ఫరో దురహంకారి, పరమమూర్ఖుడు కూడా! అక్కడ నాలుగొందల ఏళ్లుగా బానిసలుగా దుర్భర జీవితాన్ననుభవిస్తున్న ఇశ్రాయేలీయులను మోషే నాయకత్వంలో విడుదల చేయించడానికి దేవుడే పరోక్షంగా ఫరో మూర్ఖత్వం, దురహంకారంతో పోరాడవలసి వచ్చింది. ఇశ్రాయేలీయులు అక్కడ బానిసలే అయినా తమ ప్రతిభాపాటవాలతో, శ్రమతో ఈజిప్టు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. వాళ్లు దేశం వదిలివెళ్లిపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న భయంతో ఫరో వారిని విడుదల చేయడానికి ససేమిరా అన్నాడు. ఈజిప్టు ప్రజలు, జంతువుల తొలి సంతానాన్ని దేవుడు హతం చేయడంతో ఫరో దిగి వచ్చి ఇశ్రాయేలీయులను పోనిచ్చాడు.
అయితే దేవుడు దూరదృష్టితో వారిని కనానను దేశానికి దర్గరి దారిలో కాక, ఎర్రసముద్రం అడ్డుగా ఉన్న చుట్టు దారిలో నడిపించాడు (నిర్గమ 13: 17,18). ఇశ్రాయేలీయులను వదిలినట్టే వదిలి మనసు మార్చుకొని మూర్ఖత్వంతో వారి సంహారానికి ఫరో తన సైన్యంతో బయలుదేరాడు. ముందు సముద్రం, వెనుక ఫరో సైన్యంతో ముందు నుయ్యి, వెనుక గొయ్యిలో ఉన్న ఇశ్రాయేలీయులకు, సముద్రాన్ని రెండు పాయలు చేసి మధ్యలో దారిని ఏర్పరచి, దేవుడు వారిని ముందుకు నడిపించాడు. అంతదాకా ఇశ్రాయేలీయులకు నీడనిస్తూ, దారి చూపిస్తున్న మేఘస్తంభాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఫరో సైన్యానికి మధ్యలో పెట్టాడు. అకారణంగా వారిని తరుముతూ వస్తున్న ఫరో సైన్యానికి తాము ఎర్ర సముద్రంలోకి వచ్చామన్నది తెలియలేదు.
ఇశ్రాయేలీయులంతా సముద్రపు దారిని దాటేటప్పటికి ఫరో సైన్యం ఆ దారిలో సముద్రం మధ్యలో ఉంది. దేవుడు తిరిగి మేఘస్తంభాన్ని తొలగించి ఇశ్రాయేలీయులకు ముందు పెట్టినప్పుడు కాని ఫరోకు తామెంత ప్రమాదంలో చిక్కుకున్నామో అర్థం కాలేదు. కాని తప్పించుకునే మార్గం లేదు. దేవుడు సముద్రజలాల్ని యధాతథం చేయడంతో ఫరో, అతనితో పాటున్న వేలాదిమంది సైనికులు జలసమాధి అయ్యారు. అలా ఇశ్రాయేలీయులకున్న శత్రుభయమనేది లేకుండా పోయింది.
ఈ ఉదంతం రెండు విషయాలు స్పష్టం చేస్తుంది. దగ్గరి దారులుండగా వాటిని కాదని దేవుడు చుట్టు దారిన నడిపిస్తున్నాడన్నా, ఎదురుచూస్తున్న ఆశీర్వాదాన్నివ్వడంలో ఆలస్యం చేస్తున్నాడన్నా, దాంట్లో ఒక మహాగొప్ప ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడన్నది మొదటి విషయం. తాను బలవంతుడనని దురహంకారంతో ఎంత విర్రవీగినా దేవుడు తలుచుకుంటే చివరికి మట్టి కరిచి చరిత్రహీనుడు కాక తప్పదన్నది రెండవ అంశం. ప్రతికూలత ఎదురైనప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు, అనుకున్నవి అనుకున్నట్లుగా సాగనప్పుడు కృంగిపోకుండా, దేవుడు చుట్టుదారిలో నడిపించినా తుదకు ఆశీర్వాదకరమైన గమ్యానికే చేర్చుతాడని మనం నమ్మాలి.
ఫరో బలం ముందు బానిసలైన ఇశ్రాయేలీయులెంత? కాని ఇశ్రాయేలీయుల వెనుక దేవుని బలం ఉన్నదని, ఆ బలాన్ని తానెదుర్కోలేనన్న వివేచనను ఫరో తన దురహంకారం కారణంగా కోల్పోయి దిక్కులేని వాడిలాగా దుర్మరణం చెందాడు. రాత్రి చీకటున్నా పగలు వెలుగుంటుంది. కాని దురహంకారి జీవితంలో పగలు, రాత్రి కూడా చీకటే, అనుక్షణమూ అశాంతే!
ఫరో దురహంకార నిర్ణయానికి వేలాదిమంది సైనికులు బలైనట్టే, కొందరు నాయకుల మూర్ఖత్వం, దురహంకారం మొత్తం దేశాన్ని అశాంతిమయం చేయడం ఇప్పుడూ చూస్తున్నాం. కొండను కూడా పెకిలించగల శక్తి మంచితనానిది, మృదుత్వానిదైతే, ఉన్నట్టుండి కొండంత అశాంతికి గురి చేసే శక్తి దురహంకారానిది!!
– రెవ.డాక్టర్.టి.ఎ. ప్రభుకిరణ్