బతకడానికి మీరేం చేస్తుంటారు? అన్న ప్రశ్నకు జవాబిస్తాం. కాని దేనికోసం మీరు బతుకుతున్నారు? అనే ప్రశ్నను మాత్రం దాటవేస్తాం. డబ్బు, పేరు, అధికారం కోసమే బతికే వాళ్ళున్నా ఆ మాట ఒప్పుకొనే నిజాయితీ వారికుండకపోవచ్చు. జాలరిగా వృత్తిలో ఎంతో ప్రావీణ్యమున్న పేతురు యేసును ఎరుగక ముందు గలిలయ సరస్సులో ఒక రాత్రంతా శ్రమించినా ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. పేతురుకు అది ఘోర వైఫల్యం, అవమానం కూడా. అలా కుమిలిపోతున్న పేతురును మరునాడు ఉదయమే యేసు కలుసుకొని, దోనెలో అతనితో పాటు సరస్సు లోతుల్లోకి వెళ్ళాడు. అక్కడ యేసు మాట మేరకు పేతురు మళ్ళీ వలలు వేస్తే ఈ సారి విస్తారంగా చేపలు దొరికాయి. ’నేను చేపలు పట్టలేని అసమర్ధుణ్ణి ప్రభువా !!’ అని అంతకు మునుపు వాపోయిన పేతురు (లూకా 5:5), యేసు మహాత్మ్యాన్ని కళ్లారా చూసిన తర్వాత ఇపుడు ’నేను పాపాత్ముడను ప్రభువా !!’ (8:8) అంటూ సాగిలపడ్డాడు. మనుషుల కోసం చేపలు పట్టడం కాదు, ఇకనుండి నాకోసం మనుషులనే పట్టమంటూ యేసుప్రభువు అతనికి మేలుకొల్పునిస్తే, పేతురు, అతని పాలివారైన యాకోబు, యోహాను అన్నీ అక్కడికక్కడే వదిలేసి యేసును వెంబడించారు. చేపలు పట్టి జీవిస్తున్నామని చెప్పుకునే స్థాయి నుండి, యేసుప్రేమను ప్రకటించడానికి జీవిస్తున్నామని సగర్వంగా చెప్పుకునే అత్యున్నతమైన ఆత్మీయ స్థాయికి వారు ఎదిగారు. మేధావులమైనా, ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా, చాలా మంచివారమని లోకం ఎంతగా పొగిడినా, మనం పాపులమేనని బైబిల్ చెబుతోంది (రోమా 3:23). ఇది చాలామందికి రుచించని విషయం. బంగారాన్ని నగ రూపంలో మెడలో వేసుకున్నప్పుడు దానికున్న సౌందర్యం, గనుల్లో ముడిసరుకుగా ఉన్నపుడు బంగారానికుండదు. నిజానికపుడది వికారంగా ఉంటుంది. అయితే ముడిసరుకుగా ఉన్నా, మెడలో నగగా మెరిసినా బంగారం విలువ మాత్రం ఏ మాత్రం తగ్గదు. పాపియైనంత మాత్రాన అతనిపట్ల దేవుని ప్రేమ కూడా అణుమాత్రమైనా తగ్గదు సరికదా, ఒక పరమ కంసాలి లాగా దేవుడు పాపిని ప్రేమతో తన చేతుల్లోకి తీసుకొని, ప్రక్షాళన చేసి, ఆత్మీయ వన్నెతో కూడిన ఒక దివ్యరూపాన్నిచ్చి దిశానిర్దేశం చేసేందుకు పాపి కోసం ఆయన నిరంతరం తపిస్తాడని బైబిల్ చెబుతోంది (యెషయా 30:18).
మన జీవనోపాధి ఏమిటి? అన్నది లోకానికి ముఖ్యం, కాని మన జీవితాశయం ఏమిటి? అన్నది దేవుని దృష్టిలో అత్యంతవిలువైన అంశం. శక్తి నిండిన జీవితాన్నంతా జీతం కోసం ఎవరికో ధారపోసి, రిటైరయ్యి, రోగాల పుట్టగా మారి, బతుకు మీద ఆశలుడిగిపోతున్నపుడు, చేవ చచ్చి కేవలం ఇక ‘చావు ఘడియ’ కోసం దీనంగా ఎదురుచూసే పరిస్థితి తన పిల్లల జీవితాల్లో ఎన్నటికీ ఉండకూడదన్నదే దేవుని అభీష్టం. జీవితాన్ని చేజార్చుకొని బాధపడుతూ కేవలం చావడానికి బతికే బదులు, ‘నాకున్న ఈ ఒక్క రోజైనా దేవుని కోసం బతుకుతాను. ఒక నిరాశ్రయుడు లేదా నిర్భాగ్యుని ఆదుకొని, అతని మొహాన దేవుని పేరిట చిరునవ్వు వెలిగించి, ఒక సదాశయాన్ని నెరవేర్చుకున్న సంతృప్తితో సగర్వంగా చనిపోతాను’ అని ఎవరన్నా తీర్మానించుకుంటే దేవుడే ఎక్కువగా సంతోషిస్తాడు, తన పరలోక ద్వారాలు తెరిచి మీకు నిత్యత్వమనే వెలలేని బహుమానమిస్తాడు. ఒకసారి కారులో ఊరికెళ్తున్న ఒక జంటకు దారిలో తమ చిన్నపాప కోసం పాలు అవసరమైతే అక్కడి ఒక ఫైవ్ స్టార్ట్ హోటల్లో 500 రూపాయలు తీసుకొని ఒక చిన్న సీసాలో పాలు అమ్మారట. కాసేపయ్యాక మధ్య దారిలో పాపకు మళ్ళీ పాలు అవసరమై అక్కడున్న చిన్న గుడిసెలాంటి హోటల్ లోని ఒక పేద ముసలాయన్నడిగితే, సీసానిండా పాలు నింపి ఇచ్చాడు. అతనికి వంద రూపాయలివ్వబోతే, నేను పేదవాణ్ణే కాని ఒక పసిపాప కడుపు నింపి పైసలు సంపాదించే దౌర్భాగ్యం నాకు లేదమ్మా! పాపకు దారిలో మళ్ళీ పాలు అవసరమవుతాయేమో, ఇదిగో మరో సీసా పాలు కూడా తీసుకెళ్లండి, అన్నాడట ఆ పేద వృద్ధుడు. ప్రతి వ్యక్తినీ దేవుడు మరొక వ్యక్తికి ఆసరాగా ఉండాలనే సృష్టించాడు. అదే ఆయన సృష్టి ధర్మం. కాని దైవ నిర్దేశిత విలువలకు పాడె కడుతున్నాం. అదీ మన దౌర్భాగ్యం!!
– రెవ.టి.ఎ.ప్రభుకిరణ్
మీ జీవితాశయం ఏమిటో మీకు తెలుసా?
Published Sun, Aug 5 2018 12:27 AM | Last Updated on Sun, Aug 5 2018 12:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment