తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం.. డాక్టర్‌ చేతన | Doctor chetana ips story | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ చేతన

Published Mon, Jul 16 2018 12:57 AM | Last Updated on Mon, Jul 16 2018 12:24 PM

Doctor chetana ips story  - Sakshi

మెడిసిన్‌ చదివి డాక్టర్‌ అయింది. పోలీసుగా మారి ప్రాక్టీస్‌ చేస్తోంది. స్టెతస్కోపు మీద ఒట్టేసి... ఖాకీకి సలాం చేసి... చెప్తున్నాం డాక్టర్‌ చేతన సమాజానికి వైద్యం చేస్తోంది.

కోఠీ లోని మెటర్నిటీ హాస్పిటల్‌ నుంచి సుభావత్‌ విజయకు పుట్టిన ఆరు రోజుల పాపాయి ఈ నెల రెండవ తేదీన అపహరణకు గురైంది. సుల్తాన్‌బజార్‌ ఏసీపీ చేతన మూడవ తేదీ సాయంత్రానికి ఆ పాపాయిని తెచ్చి తల్లి ఒడికి చేర్చింది!

డాక్టర్‌ చేతన ఐపీఎస్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. నిజమే, హాస్పిటల్‌ నుంచి మాయమైన బిడ్డను గంటల్లో వెతికి తెచ్చిన అధికారి మరి. రాష్ట్రం దాటిన బిడ్డను సలక్షణంగా తెచ్చి తల్లిఒడిలో పెట్టిన పోలీస్‌ అధికారి ఆమె. రెండు తెలుగు రాష్ట్రాలూ ఈ అమ్మాయిని ప్రశంసల్లో ముంచెత్తుతుంటే ఆమె మాత్రం ‘నా ఉద్యోగాన్ని నేను చేశాను. ఇదంతా టీమ్‌ వర్క్‌’ అంటున్నారు.

డాక్టర్‌గా ఓ ఏడాది
‘‘మెడిసిన్‌ చేసేటప్పుడు దేహం, ఆరోగ్యం, అనారోగ్యాలను చదివాను. డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేసిన ఏడాది కాలంలోనే సమాజాన్ని చదవడం సాధ్యమైంది. నా దగ్గరకు వచ్చిన పేషెంట్‌లలో ఎనీమియా, వరుస గర్భస్రావాలతో బాధపడే వాళ్లే ఎక్కువగా కనిపించారు. వాళ్లందరూ దాదాపుగా వరకట్న బాధితులే. కొందరు నేరుగా భర్త, అత్తమామల నుంచి వేధింపులకు గురవుతుంటే మరికొందరు పరోక్షంగా సూటిపోటి మాటలతో మౌనంగా వేదనను భరిస్తున్న వాళ్లే.

డాక్టర్‌గా వాళ్ల దేహానికి వైద్యం చేసేదాన్ని, అంతకంటే ఎక్కువగా మరేదయినా చేయాలనిపించేది. కానీ, వారికి మానసిక ధైర్యాన్నివ్వడం వరకే సాధ్యమయ్యేది. ఆ మహిళల అనారోగ్యం వెనుక ఉన్నది అనారోగ్యకరమైన సమాజం. నిజానికి వైద్యం చేయాల్సింది సమాజానికి. మూల కారణానికి వైద్యం చేయాలంటే ఓ డాక్టర్‌కి సాధ్యం కాదు. సమాజంలో కరడు గట్టి ఉన్న ఈ రోగానికి వైద్యం చేయాలంటే చట్టంతోనే సాధ్యం అనిపించింది. అందుకే పోలీస్‌ అవ్వాలనుకున్నాను.

ఐఆర్‌ఎస్‌ వచ్చింది!
సివిల్స్‌ ప్రిపరేషన్‌లో తొలి ప్రయత్నంలో ఐఆర్‌ఎస్‌ వచ్చింది. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ కమీషనర్‌గా ఓ ఏడాది చేశాను. రెవెన్యూ సర్వీసెస్‌లో పని చేయడం బాగానే ఉంటుంది. కానీ నా ప్రధాన ఉద్దేశం మహిళలు, వాళ్ల మీద దాడులు. వాటిని అరికట్టాలంటే ఐపీఎస్‌ అయి తీరాల్సిందే. రెండవ ప్రయత్నంలో అంటే.. 2013లో ఐపీఎస్‌ వచ్చింది. కానీ అప్పటికి మెటర్నిటీ లీవ్‌లో ఉన్నాను. రెండేళ్ల తర్వాత సర్వీస్‌లో చేరాను. ట్రైనింగ్‌ పూర్తయిన తర్వాత తొలి పోస్టింగ్‌ ఇదే.

బిడ్డ అపహరణ ఘటన
ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత హాస్పిటల్‌ నుంచి బిడ్డను అపహరించారని కంప్లయింట్‌ వచ్చింది. వెంటనే హాస్పిటల్‌కెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్‌ చూశాం. నీలం రంగు చీర కట్టుకున్న ఒక మహిళ.. బిడ్డతో హాస్పిటల్‌ ఆవరణ దాటడం కనిపించింది. ‘నీలం రంగు చీరతో ఉన్న మహిళ, ఆరు రోజుల పాప...’ ఆ ఆధారంతో మా సెర్చ్‌ టీమ్‌లు పరుగులు తీశాయి.కొన్ని టీమ్‌లు నగరంలోని పబ్లిక్‌ ప్లేస్‌లు, బస్టాప్‌లు, రైల్వే స్టేషన్‌లలో సీసీకెమెరా ఫుటేజ్‌ చూస్తూ వివరాలు నోట్‌ చేశాయి.

ఆ మహిళ ఎంజిబిఎస్‌ నుంచి బీదర్‌ వెళ్లే బస్‌ ఎక్కిందనే సమాచారం రావడంతో బీదర్‌ పోలీస్‌కు సమాచారమిచ్చాం. వెంటనే మా టీమ్‌తో బీదర్‌కెళ్లాను. ఈ టాస్క్‌లో మొత్తం ఎనిమిది టీమ్‌లు పనిచేశాయి.  మర్నాడు సాయంత్రం నాలుగు గంటలకు పాపాయిని బీదర్‌లోని హాస్పిటల్‌లో గుర్తించాం. ఆ తర్వాత ఆ మహిళను కూడా అదుపులోకి తీసుకున్నాం.

ఎందుకు అపహరించింది?!
పాపాయి కోసం వెతికేటప్పుడు ఒకటే ఆందోళన. ఎందుకోసం అపహరించిందో తెలియదు. క్షుద్ర పూజల కోసమైతే మేము ట్రేస్‌ చేసే లోపలే జరగరానిది జరిగిపోతుందేమోననే భయం. అవయవాల అపహరణ కూడా చాపకింద నీరులా ఉంది. అందుకే ప్రతి వాహనాన్నీ చెక్‌ చేశాం, చెత్త కుప్పలను కూడా వదలకుండా శోధించాం. అయితే మేము భయపడినట్లేమీ జరగలేదు.

ఆమె పాపాయిని ఎత్తుకెళ్లిన కారణం గుండెల్ని కదిలించేదిగా ఉంది. ఆమెకు పిల్లలు లేరు. రెండుసార్లు అబార్షన్‌ కావడం, గర్భం వచ్చిన నాలుగు నెలలకే ఫిట్స్‌ వచ్చి కోమాలోకి వెళ్లడం, మళ్లీ గర్భం రాకపోవడంతో ఇక తనకు పిల్లలు పుట్టరనే అభిప్రాయానికి వచ్చింది. బహుశా పిల్లలు పుట్టని కారణంగా ఇంట్లో వివక్షను కూడా ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఆరు నెలల కిందట ఇంట్లో వాళ్లతో తనకు గర్భం వచ్చిందని చెప్పిందట.

పొట్ట ఎత్తుగా చేసుకుంటూ... భర్తకు దూరంగా సోదరులు, సోదరి దగ్గర ఎక్కువ కాలం గడుపుతూ వచ్చింది. బిడ్డను అపహరించి తనకే పుట్టినట్లు బీదర్‌లోని తల్లిని, సోదరులను నమ్మించడానికి ప్రయత్నించింది. పాపాయిని చాలా ప్రేమగా చూసుకుంది కూడా. దుస్తులు కొన్నది, పాల సీసాలు, పాలు... ఇతర అవసరమైనవన్నీ కొన్నది. టైమ్‌కి పాలు పట్టి, తన ఒడిలోనే నిద్రపుచ్చింది.

వరండాలో దీనంగా...
ఆమె చదువుకున్న మహిళ. డీఎడ్‌ చేసి టీచర్‌గా ఉద్యోగం చేసింది. టెన్త్‌ క్లాస్‌లో ఉండగా బీదర్‌లోనే పెళ్లి జరిగింది. కొద్ది నెలల్లోనే భర్త పోవడంతో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో మళ్లీ పెళ్లయింది. పిల్లలు పుట్టకపోవడంతో బెంగ పెట్టుకుంది. చాలా రోజుల్నుంచి ఆమె రోజూ కోఠీ మెటర్నిటీ హాస్పిటల్‌కొచ్చి వరండాలో దిగాలుగా కూర్చుని ఉండేదని అక్కడి వాళ్లు ఇప్పుడు చెబుతున్నారు. పాపాయిని ఎత్తుకెళ్లిన సంగతి టీవీల్లో వస్తుండటంతో భయపడిపోయి హాస్పిటల్‌లో వదిలేసి వెళ్లిపోయింది. ఎందుకిలా చేశావని అడిగినప్పుడు ‘తప్పయిపోయింది’ అని తలదించుకుంది. ఆమె పరిస్థితి చూస్తే జాలేసింది. కానీ ఆమె చేసింది నేరమే. ఏ కారణంగా చేసినా తప్పు తప్పే. కాబట్టి విచారణ కొనసాగుతుంది.

ఇదే తొలికేసు
ఏసీపీగా చార్జ్‌ తీసుకున్న తర్వాత నేను డీల్‌ చేసిన తొలికేసు ఇదే. పాపాయిని క్షేమంగా తల్లి ఒడికి చేర్చడం గొప్ప అనుభూతి, అయితే ఈ విజయం, ఘనత అంతా నాదేనన్నట్లు మీడియా ప్రశంసిస్తుంటే కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్‌ పాయింట్‌ ఇది నా ఉద్యోగం, నా విధిని నేను నిర్వర్తించాను. ఇక రెండవది... ఇది నా ఒక్కదాని వల్ల వచ్చిన విజయం కాదు, సమష్టి కృషి. మా పోలీసులతోపాటు టెక్నాలజీకి కూడా సమభాగస్వామ్యం ఉంది.

‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు’ అని శ్రీశ్రీ సంధించిన ప్రశ్న కూడా గుర్తుకు వస్తోంది. తాజ్‌మహల్‌ సౌందర్యాన్ని ప్రశంసించడం కాదు, దాని నిర్మాణంలో చెమటోడ్చిన శ్రామికులకు వందనం చేయాలని నమ్ముతాను. ఈ పాపాయి టాస్క్‌ కూడా అంతే. మా టీమ్‌ ఎంత చురుగ్గా పని చేసిందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ పాపాయి అపహరణ కేసు. ఈ కేస్‌ నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషాన్నిచ్చిన మాట నిజమే. కానీ, చేతన ఘనత అన్నట్లు కాకూడదు. పాపాయిని రక్షించి తెచ్చాననే కృతజ్ఞతతో ఆ తల్లి బిడ్డకు నా పేరు పెట్టుకుంది. నిజమైన ఆనందం అది. ఆ క్షణంలో నాకు శ్రీశ్రీ ‘మరో ప్రపంచం’ కనిపించింది’’.

అమ్మ స్ట్రిక్టు... నాన్న సాఫ్ట్‌!
పుస్తకాలు చదవడం నా హాబీ. జిడ్డు కృష్ణమూర్తి తత్వాన్ని పూర్తిగా చదివాను. ప్రకృతిని ప్రేమించడం, మానవ సంబంధాలలోని సున్నితమైన, అందమైన బంధాన్ని ఆస్వాదించడం ఇష్టం. మా మీద నాన్న ప్రభావం ఎక్కువే కానీ, నిజానికి నన్ను, తమ్ముడిని పెంచడంలో పెద్ద పాత్ర అమ్మది. నాన్న ఎప్పుడూ బిజీగా ఉండేవారు. అమ్మ చాలా స్ట్రిక్టు. నాన్నది మృదుస్వభావం. మార్కులు తక్కువ వచ్చినప్పుడు ప్రోగ్రెస్‌ రిపోర్టును చాటుగా నాన్నకు చూపించేవాళ్లం.

నాన్న కూడా అమ్మకు తెలియకుండా సంతకం చేసి, గండం గట్టెక్కించేవాళ్లు. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం అనే రోల్‌ అమ్మ తీసుకుంటే, వ్యక్తిత్వ వికాసంలో నాన్న రోల్‌ పెద్దది. సామాజికాంశాల పట్ల ఆసక్తి పెరగడానికి కారణం మా నాన్న పెంపకమే. ఆయన జర్నలిస్ట్‌ కావడంతో ఇంట్లో... నిత్యం నేర్చుకునే వాతావరణమే ఉండేది. ఆ ప్రభావంతోనే నేను పత్రికల్లో కాలమ్‌ రాయగలిగాను. ఆ వ్యాసాలను ‘అల’ పేరుతో సంకలనం వేశారు నాన్న. – డాక్టర్‌ చేతన మైలాబత్తుల,  ఏసీపీ, సుల్తాన్‌బజార్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement