నన్ను అనువాదకుడిని చేసింది చైనా | Doctor DS Rao says china has made me a Traslator | Sakshi
Sakshi News home page

నన్ను అనువాదకుడిని చేసింది చైనా

Published Mon, Oct 23 2017 12:13 AM | Last Updated on Mon, Oct 23 2017 12:13 AM

Doctor DS Rao says china has made me a Traslator

కేంద్ర సాహిత్య అకాడమీలో స్టెనోగ్రాఫర్‌గా ఉద్యోగం ప్రారంభించి, అకాడమీ జర్నల్‌ ‘ఇండియన్‌ లిటరేచర్‌’ ఎడిటర్‌ స్థాయికి ఎదిగారు తెలుగువాడైన డాక్టర్‌ డి.ఎస్‌.రావు. మూడున్నర దశాబ్దాల పాటు పనిచేసి, 1991లో పదవీ విరమణ చేశారు. త్రిపురనేని గోపీచంద్‌ రెండు నవలల్ని ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ‘ఎ షార్ట్‌ హిస్టరీ ఆఫ్‌ సాహిత్య అకాడమీ’, ‘మనోహర్‌ మాల్గోన్కర్‌: ఎ స్టడీ ఆఫ్‌ హిజ్‌ కంప్లీట్‌ ఫిక్షన్‌’ వెలువరించారు. కొత్తగా ‘ప్రాక్టికల్‌ లిటెరరీ క్రిటిసిజం: యాన్‌ ఇండియన్‌ టేక్‌’ పేరిట మరో పుస్తకమూ తెచ్చారు. 80 ఏళ్ల రావు ప్రస్తుతం అమెరికాలో ‘ఓవర్సీస్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ఇండియా’గా తన ముగ్గురు పిల్లల వద్ద ఉంటున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఇటీవల హైదరాబాద్‌ వచ్చినప్పుడు సాక్షి సాహిత్యం ప్రతినిధితో స్వేచ్ఛగా సంభాషించారు.


దుగ్గిరాల సుబ్బారావు అన్న తన పేరును డి.ఎస్‌.రావు అని పొడిగా పెట్టుకోవడానికి కారణం ఉద్యోగంలో చేరిన కొత్తలో దిల్లీవాళ్లు ‘సుబ్బా’ను ‘సుబాహ్‌’(ఉదయం), ‘సూబా’(రాష్ట్రం) అని పిలవడమే అంటారాయన నవ్వుతూ. సాహిత్యంతో ఏ పరిచయమూ లేని రావు కేవలం ఉద్యోగం కోసమే ఏలూరు నుంచి 1955లో దిల్లీ వెళ్లారు. అకాడమీలో స్టెనోగ్రాఫర్‌గా చేరారు. తర్వాత పీఏ టు సెక్రెటరీ అయ్యారు. పబ్లికేషన్‌ అసిస్టెంట్, సేల్స్‌ మేనేజర్, ఎడిటర్‌... ఇలా అంచెలుగా ఎదిగారు. ఆయన చేరిన కొత్తలో అకాడమీ కార్యదర్శి కృష్ణ కృపలానీ. ఈ యువకుడి ‘ఉత్సాహం’ గమనించి రచయితలతో జరిగే అన్ని సమావేశాలకూ వెంటపెట్టుకెళ్లేవారు.

జవాహర్‌లాల్‌ నేహ్రూ, రాధాకృష్ణన్‌ లాంటి పెద్దవాళ్లను అలా చూడగలిగానంటారు. ‘‘నా అసలు చదువు అకాడమీలోనే ప్రారంభమైంది. గాంధీజీ శతజయంతి సందర్భంగా యునెస్కో కోసం ‘లైఫ్‌ అండ్‌ థాట్స్‌ ఆఫ్‌ మహాత్మాగాంధీ’ పేరిట ఒక పుస్తకం తెచ్చాం. దానికోసం గాంధీ వర్క్స్‌ అన్నీ చదివాను. అప్పుడు నా నెలజీతం 150 రూపాయలు. యునెస్కో వాళ్లు మాకు 1400 గౌరవ పారితోషికం ఇవ్వబోతే కృపలానీ వద్దన్నారు గాంధీజీ మీద గౌరవంతో చేశానని. కానీ నాకూ అందులో భాగం ఉంది కాబట్టి 250 రూపాయలు మాత్రం ఇమ్మన్నారు. భక్తితో చేశానని నేనూ వద్దన్నాను. అప్పుడదొక ఆదర్శవాదం’’ అని నవ్వుతారు.

చిన్న ఉద్యోగి – పెద్ద పాత్ర
నిజాయితీగా పనిచేస్తే చిన్న ఉద్యోగి సైతం ఎంత శక్తిమంతమైన పాత్ర పోషించవచ్చో తెలిపే ఒక ఉదంతం చెబుతారాయన. ‘‘అది 1983. నేను అసిస్టెంట్‌ ఎడిటర్‌గా ఉన్నాను. పోపటి హీరానందాని ‘హిస్టరీ ఆఫ్‌ సిం«ధీ లిటరేచర్‌’ను అకాడమీ ప్రచురణగా వేయాలి. ప్రొఫెసర్‌ హరీష్‌ వాశ్వానీ ‘కంటెంట్స్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూ’లో అంగీకరించారు. అదీ రెండు సార్లు రివిజన్‌ జరిగాక. డాక్టర్‌ చేతన్‌ కర్ణాని ‘లాంగ్వేజ్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూ’లో ఒప్పుకున్నారు. కవి నారాయణ్‌ శ్యామ్‌ ‘ఫైనల్‌’ చేశారు. తరవాత సిం«ధీ సలహా సంఘం సూచన మేరకు మాన్యుస్క్రిప్ట్‌ నా టేబుల్‌ మీదకు వచ్చింది. చదవగానే నా గుండె జారిపోయింది. ఒక చరిత్రను కేవలం 30 ఏళ్ల కాలావధి తీసుకుని చెప్పడం బాలేదు. దాన్నే ప్రక్రియలుగా, దశలుగా, ఉద్యమాలుగా వర్గీకరిస్తే అదే రచయితలు పునరుక్తం అవుతున్నారు. ఇంత తక్కువ కాలపు సాహిత్యం మీద స్పష్టమైన తీర్పు ఇవ్వలేం. అదీగాక బతికివున్న రచయితలను నిజాయితీగా అంచనా కట్టలేం. ఈ లోపాలన్నీ ఏకరువు పెడుతూ నా పై అధికారులకు నోట్‌ రాశాను. చివరకు ఆ పుస్తక ప్రచురణను అకాడమీ తిరస్కరించింది.’ తప్పులు ఎత్తిచూపితే రచయితలు సంతోషిస్తారు

‘‘లిటరేచర్‌ ఎడిటింగ్‌ అనేది చాలా నిర్మాణాత్మకమైన పని. అది తిరగేసిన పిరమిడ్‌లా వార్తలు రాసే జర్నలిజం కాదు, స్పేస్‌ తక్కువైతే కింద కట్‌ చేయడానికి. ప్రతి వాక్యమూ అమూల్యమైనదే’’ అంటారు రావు. ‘మాన్యుస్క్రిప్టుల మీద ఎర్ర ఇంకు అసలు వాడొద్దు. దాని బదులు మార్జిన్స్‌లో పెన్సిల్‌తో రాయాలి’ అనేది ఆయన సూచనల్లో ఒకటి. ‘‘రచయితలు చాలా సున్నితంగా ఉంటారు. వాళ్లు నొచ్చుకోకుండా వాళ్లకు మార్పులు సూచించాలి. ముందు అందులో ఉన్న సానుకూల అంశాలను ప్రశంసించాలి, నిజంగా నచ్చితే. తర్వాత ఫ్యాక్చువల్‌ ఎర్రర్స్‌ ఎత్తిచూపాలి. తరవాత పరస్పర విరుద్ధాంశాలను ప్రస్తావించాలి. నెమ్మదిగా వాక్యాల్లో లోపాలు, పలుకుబడుల్లో తేడాలు, కాపీ ఎలా మెరుగుపరుచుకోవచ్చు... ఇలా చెప్పాలి. అయితే ఒకటి. మనం నిజమైన తప్పుల్ని ఎత్తి చూపితే రచయితలు సంతోషిస్తారు. అది వాళ్లకే మంచిది కదా. పట్టించుకోనివాళ్లు కూడా ఉంటారు. ఫైన్‌. మనం చెప్పగలిగింది చెప్పకుండా ఉండకూడదు.’’

వేల్చేరు నారాయణరావు, డేవిడ్‌ షూల్మన్‌ ‘కళాపూర్ణోదయం’ అనువాదంలో కూడా ఆయన కొన్ని మార్పులు సూచించారు. ‘‘ముందుగా దాన్ని కొలంబియా ప్రెస్‌వాళ్లు ప్రచురించారు. ఆ కాపీ బానే ఉంది నాకు. తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ వాళ్లు వేయదలిచినప్పుడు అభిప్రాయం కోసం నాకు పంపారు. అప్పుడు నేను ఒరిజినల్‌ కళాపూర్ణోదయంతో ఈ అనువాదాన్ని పోల్చి చూశాను. కొన్ని లోపాలు కనిపించాయి. వాళ్లకు రాశాను.’’ మరి వాళ్లు అవి సవరించారా? ‘‘నాకు తెలీదు. చేశారనే అనుకుంటున్నా. వాళ్లు నాకు కాపీ పంపలేదు. నేను దిద్దారా లేదా అని చూసుకోలేదు’’. ఆక్స్‌ఫర్డ్‌ వాళ్లు మర్యాదకైనా కాపీ పంపాలి కదా? ‘‘పంపలేదు మరి. మనం చెప్పిన తప్పులు వాళ్లు ఒప్పుకున్నారంటే మనకు అహం పెరుగుతుంది, దిద్దలేదని తెలిస్తే బాధ కలుగుతుంది. చూడకపోవడమే మంచిది కదా’’ అని తేలిగ్గా తీసుకుంటారు.

అసమర్థుడి జీవయాత్ర అనువాదం 30 ఏళ్ల శ్రమ
సాహిత్యంతో ఏ పరిచయం లేకుండా అనువాదకుడిగా ఎలా మారారు? ‘‘దానిక్కారణం చైనా’’ అంటారాయన. 1962లో చైనాతో యుద్ధకాలంలో అకాడమీకి నిధులు తగ్గిపోయాయి. రచయితలతో సమావేశాలు లేవు. ‘‘మరి ఆ సమయంలో ఉద్యోగులుగా మేమేం చేయాలి? రాయగలిగేవాళ్లను రాయమనీ, అనువాదాలు చేయగలిగేవాళ్లను చేయమనీ చెప్పారు. అలా నేను అనువాదకుడినయ్యాను’’ అని చెబుతారు. రావు తొలుత తన అనువాదానికి ఎంచుకున్న నవల గోపీచంద్‌ ‘అసమర్థుడి జీవయాత్ర’. దాన్ని ‘ద బంగ్లర్‌’ పేరుతో ఆరు నెలల్లో పూర్తి(?) చేశారు. గోపీచంద్‌దే మరో నవల ‘మెరుపులు మరక’లను ‘ఉషారాణి: ఎ టేల్‌ ఆఫ్‌ సెన్స్‌ అండ్‌ సెన్సువాలిటీ’గా ఇంగ్లిష్‌ చేశారు. గోపీచంద్‌నే అనువదించడానికి ప్రత్యేక కారణం? ‘‘అప్పుడు అకాడమీకి ఉన్న తెలుగు సలహా సంఘం గోపీచంద్‌ పేరును సూచించడమే’’ అని ఒప్పుకుంటా రాయన. అంతకుముందు గోపీచంద్‌ రచనలేమీ చదవలేదని కూడా అంగీకరిస్తారు. మరి అనువాదం ఇట్టే ఎలా చేయగలి గారు? ‘‘నవల అనువాదానికి చాలా అవస్థ పడ్డాను. మొదట నేను చేసిన అనువాదం నాకే నచ్చలేదు. ఎన్నోసార్లు రివైజ్‌ చేశాను. 30 ఏళ్లు సవరిస్తూ వచ్చాను. తెలుగు, ఇంగ్లిష్‌ తెలిసిన సహృదయులకూ, తెలుగు రాని ఇంగ్లిష్‌ పాఠకులకూ చూపించి, ఎన్నో చర్చలు సాగించి, అనువాదాన్ని ఫైనలైజ్‌ చేశాను’’.

300 ఏళ్ల క్రితం Wentworth Dillon అనువాదకులకు ఇచ్చిన సలహా ఇప్పటికీ ప్రాసంగికమే అంటారాయన.
Take pains the genuine meaning to explore, There sweat, there strain, tug the laborious oar: Search every comment, that your care can find,Some here, some there, may hit the poet's mind... Then, seek a poet who your way does bend,And choose an author as you choose a friend. United by this sympathetic bond, You grow familiar, intimate and fond; Your thoughts, your words, your styles, your souls  agree, No longer his interpreter, but he.

‘ద బంగ్లర్‌’ 2003లో ప్రచురితమైంది. ‘‘ప్రొఫెసర్‌ శివరామకృష్ణ చదివారు. ఒక్క తప్పైనా దొరక్కపోతుందా అని చూశారుట. తెలుగు–ఇంగ్లిష్‌ అనువాదంలో ఇది ఒక మైల్‌స్టోన్‌ అని ప్రశంసించారు’’ అని మురిసిపోతారు రావు. అనువాదం తర్వాత గోపీచంద్‌ మీద అభిమానం పెరిగిందా? ‘‘భారతీయ సాహిత్యంలోని ఏ ఉత్తమ గ్రంథానికీ అసమర్థుడి జీవయాత్ర తీసిపోదు’’ అని చెబుతారు. అదే ఊపులో ‘ఉషారాణి’ 2013లో వచ్చింది.చివరగా– రచయితతో సంబంధం లేకుండా రచన మంచిచెడులు చూసి మెచ్చేవాళ్లు తగ్గిపోయారని బాధపడతారు రావు. ‘‘మన దగ్గర ముఠాలెక్కువ. వీడు మనవాడు, వీడు ఏం రాసినా మంచిదే. వీడు మనవాడు కాదు, వీడు ఏం రాసినా దోషపూరితమే. ఈ ధోరణి సాహిత్యానికి తీవ్రమైన చెడు చేస్తుంది’’ అని సాహిత్యలోకానికి సలహా ఇస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement