మరణించినా బతికున్నాడు!
స్ఫూర్తి
జీవితం విలువ తెలిసినవాళ్లెవరూ మరణాన్ని కోరుకోరు. మరణభయం ఎలా ఉంటుందో చవిచూసిన వాళ్లెవరూ దాన్ని తలచుకోవడానికి కూడా ఇష్టపడరు. డాన్ రిచీకి జీవితం విలువ తెలుసు. మరణభయం ఎలా ఉంటుందో కూడా తెలుసు. అతడు చావు అంచుల వరకూ వెళ్లి వచ్చాడు. జీవించాలన్న తపనతో చావుతో పోరాడాడు. అందుకే ఎవరైనా చనిపోతాను అని అంటే అతడికి నచ్చదు. అడ్డుపడతాడు. జీవితం ఎంత విలువైనదో చెబుతాడు. వాళ్ల మనసులోంచి మరణించాలన్న ఆలోచనను తీసేస్తాడు. మరో కొత్త జన్మని ప్రసాదిస్తాడు.
ఆస్ట్రేలియాకు చెందిన డాన్ రిచీ సైనికుడు. యుద్ధంలో శత్రువులతో తేలికగా పోరాడిన అతడికి, వ్యక్తిగత జీవితంలో క్యాన్సర్ అనే శత్రువుతో పోరాడాల్సి వస్తుందని తెలియదు. చాన్నాళ్లపాటు వైద్యం కోసమే సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. ఓ పక్క వ్యాధితో శరీరం బలహీన పడుతుంటే, మరోపక్క మనసును బలపర్చుకుని బతకడం అలవాటు చేసుకున్నాడు. ఎట్టకేలకు క్యాన్సర్‌ని జయించాడు. ఆ అనుభవం అతడికి జీవితం ఎంత విలువైనదో నేర్పింది. అది మరికొందరిని బతికించేందుకు తోడ్పడింది. ఓ నదీ తీరంలోని ఎత్తయిన ప్రదేశం మీద ఉన్న ఇంటిలో నివసిస్తుంటాడు రిచీ. అతడి నివాసానికి దగ్గర్లో ఓ సూసైడ్ స్పాట్ ఉంది. అక్కడ తరచుగా ఎవరో ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతుంటారు.
ఓసారి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోబోతుండగా చూసి అడ్డుకున్నాడు రిచీ. తన అనుభవాలను చెప్పి, అతడి ఆలోచనలను మార్చాడు. జీవితం మీద ఆశ కల్పించాడు. ఆ రోజున రిచీకి చాలా తృప్తి కలిగింది. అప్పట్నుంచీ ఆ సూసైడ్ స్పాట్ మీద ఓ కన్నేసి ఉంచసాగాడు. తాను మరణించే వరకూ మొత్తం నూట అరవై మందిని కాపాడాడు. ఈ నెల 13వ తేదీకి రిచీ చనిపోయి రెండేళ్లవుతోంది. ఆ రోజున ఆయన్ని గుర్తు చేసుకుంటూ రిచీ కాపాడిన వాళ్లంతా సదరు సూసైడ్ స్పాట్ వద్ద ప్రార్థనలు చేశారు. తమ రూపంలో అతడు బతికే ఉన్నాడంటూ కన్నీళ్లతో చెప్పారు!