తెలుపు.. స్వచ్ఛత | Donald Trump India Visit: Trump Wife And Daughter India Visit | Sakshi
Sakshi News home page

తెలుపు.. స్వచ్ఛత

Published Wed, Feb 26 2020 4:43 AM | Last Updated on Wed, Feb 26 2020 6:53 AM

Donald Trump India Visit: Trump Wife And Daughter India Visit - Sakshi

ఇండియా వచ్చిన ట్రంప్‌ ఫ్యామిలీ నిన్న రాత్రి యు.ఎస్‌. వెళ్లిపోయింది. ట్రంప్‌తో పాటు వచ్చిన ట్రంప్‌ సతీమణి మెలానియా, ట్రంప్‌ కూతురు ఇవాంక ఈ రెండు రోజుల్లోనూ తమ ముద్రల్ని భారతీయ మహిళల మదిపై వదిలి వెళ్లారు. సన్నగా, అందంగా, ఫ్యాషనబుల్‌గా..వీటన్నిటినీ మించి ధవళవర్ణ కాంతులతో స్వచ్ఛతకు ప్రతీకగా మెరిశారు ఈ ఇద్దరు మహిళలు.

మెలానియా వయసు 49. ఇవాంక వయసు 38. వయసులో పెద్దగా తేడా లేదు. అందుకే కావచ్చు ఇద్దరూ ఒకేలా ఉన్నారు. ఒకట్రెండు మార్కులైతే మెలానియాకే ఎక్కువ పడ్డాయేమో. సోమవారం ఆమె ఇండియాలో ఫ్లయిట్‌ దిగడమే.. సొగసుగా దిగారు. తెల్లటి జంప్‌సూట్‌తో ఉన్నారు. నడుముకు ఆకుపచ్చరంగు పట్టు శాష్‌ (కండువా లాంటిది) చుట్టుకున్నారు. ఆ శాష్‌లో బిగించి కట్టినట్లుగా భారతీయ ఉట్టిపడుతోంది. ఫ్రెంచి– అమెరికన్‌ డిజైనర్‌ హార్వే పియరీ సన్నటి బంగారు లోహపు దారలతో దానిని అల్లారు. పారిస్‌లో జరిగిన భారత సంప్రదాయ జౌళి కళల ప్రదర్శనలో ఆ వస్త్ర విశేషం గురించి చదివారట ఆయన. దాంతో ఇన్‌స్పైర్‌ అయి ఈ శాష్‌ను తయారు చేశారు. శాష్‌ బోర్డర్‌లోనే పనితనమంతా ఉంది అంటారు పియరీ.

పర్యటనలో రెండో రోజు రాజ్‌ఘాట్‌లో మహాత్ముని సమాధికి నివాళులు అర్పించినప్పుడు, ఆ పరిసరాలలో మొక్కను నాటినప్పుడు కూడా మెలానియా తెల్లని డ్రెస్‌నే ధరించారు. మోకాళ్ల కిందివరకూ పూల ఎంబ్రాయిడరీ ఉన్న బటన్‌ డౌన్‌ కాటన్‌ పాప్లిన్‌ లాంగ్‌ షర్ట్‌ వేసుకున్నారు. కాలర్‌ నెక్లెస్, ఫోల్డెడ్‌ స్లీవ్‌తో చూడచక్కగా ఉన్నారు. ఢిల్లీలోని సర్వోదయ పాఠశాలకు వెళ్లినప్పుడూ ఇదే డ్రెస్‌తో ఉన్నారు. ఒక విద్యార్థిని ఆమె నుదుటిపై తిలకం దిద్దినప్పుడు అచ్చు భారతీయ స్త్రీలా మారిపోయారు మెలానియా. ఈ డ్రెస్‌ను వెనిజులా ఫ్యాషన్‌ డిజైనర్‌ కరోలినా హెరేరా డిజైన్‌ చేశారు. కాటన్‌ ఫ్యాబ్రిక్‌ని లూజ్‌ ఫిట్‌తో భారతీయ వాతావరణానికి అనువుగా రూపొందించారు. మెలానియా వయసుకు తగినవిధంగా సౌకర్యానికి ప్రాముఖ్యం ఇస్తూ, క్యాజువల్‌ లుక్‌తో ఆకట్టుకునేలా డిజైన్‌ చేయడం విశేషం. ఈ షర్ట్‌ డ్రెస్‌కి ఫోల్డెడ్‌ స్లీవ్స్, కాలర్‌ నెక్‌ హుందాగా అమరాయి. ధర మన రూపాయలలో దాదాపు 1.1 లక్షలు. డ్రెస్‌లోని రెడ్‌ ప్రింట్‌ను మ్యానేజ్‌ చేస్తూ నడుముకు ఎర్రటి పెద్ద బెల్ట్‌ను వాడటంతో లుక్‌ రెట్రో స్టైల్‌ని తలపిస్తోంది. దీనికి వైట్‌ కలర్‌ పెన్సిల్‌ కట్‌ లెదర్‌ హీల్స్‌ అదనపు హంగుగా అమరాయి. స్మోకీ ఐ మేకప్, రోజ్‌ కలర్‌ లిప్‌స్టిక్‌తో పాటు భుజాల మీదుగా అలలుగా ఎగిసే శిరోజాల్లోనూ చర్మం రంగు పోటీ

పడుతున్నట్లుగా ఉన్నారు మెలానియా. 
ఇవాంక దుస్తులు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి కానీ, గత ఏడాది అర్జెంటీనా పర్యటనలో ధరించిన దుస్తులనే ఆమె ఈ పర్యటనలోనూ (తొలి రోజు) ధరించడం మరింత ప్రత్యేకం అయింది! లక్షా డెబ్భైవేల రూపాయల విలువైన బేబీ బ్లూ, రెడ్‌ ఫ్లోరల్‌ డ్రెస్‌ అది. కలవారి అమ్మాయి, పైగా ఒక ఫ్యాషన్‌ మోడల్‌... వేసిన దుస్తుల్నే మళ్లీ వేయడం సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురవడానికి కారణం అయింది. ‘‘డబ్బు మిగల్చడం అటుంచండి. ఒక డ్రెస్‌ తయారవడానికి ఖర్చయ్యే ప్రకృతి వనరుల్ని క్షయం కాకుండా ఆమె కాపాడారు’’ అని అభినందనలు వచ్చాయి. 

రెండో రోజు.. అగ్రదేశాధినేత కూతురుగానే కాదు వైట్‌ హౌస్‌ సీనియర్‌ సలహాదారుగా కూడా ఇవాంక తన డ్రెస్సింగ్‌ ద్వారా అంతే హుందాతనాన్ని ప్రదర్శించారు. సంప్రదాయ పద్ధతుల్లో చేత్తో రూపుదిద్దుకున్న లాంగ్‌ స్లీవ్స్, ఫ్రంట్‌ బటన్స్‌ సల్వార్‌ కమీజ్‌ను ధరించారు. దీనిని మన ఇండియన్‌ డిజైనర్‌ అనితా డోంగ్రే డిజైన్‌ చేశారు. మన దేశంలో తెలుపు రంగును శాంతికి, స్వచ్ఛతకు సూచికగా వాడతారని తెలిసిందే. అందుకే కావచ్చు.. మెలానియా, ఇవాంకల వస్త్రధారణ.. తెల్లని కాంతులు ప్రతిఫలింపజేసేలా ఉంది. ఇక ఇవాంక పాదాలకు ధరించిన వైట్‌ కిటెన్‌ మనోలో బ్లానిక్‌ మ్యూల్స్‌ ధర దాదాపు 40 వేలు. గ్లామర్‌ టచ్‌ కోసం మన బాలీవుడ్‌ స్టైల్‌ బంగారు షాండ్లియర్‌ ఇయర్‌ రింగ్స్‌ ఇవాంక ధరించడం మరో విశేషం.  
 
ఫిట్‌నెస్‌
డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారులుగా వైట్‌ హౌస్‌లోకి వచ్చాక,  ఇవాంక, ఆమె భర్త.. ఒకరి సమక్షంలో ఒకరు గడిపే అవకాశం ఉదయం పూట కొన్ని నిముషాలు మాత్రమే దొరుకుతోంది.  మ్యాచింగ్‌ అథ్లెటిక్‌ దుస్తులు వేసుకుని, లో బేస్‌బాల్‌ క్యాప్‌లు ధరించి, ఇద్దరూ పక్కపక్కనే వడివడిగా, వగరుస్తూ నడుస్తూ  మాట్లాడుకునే విషయాలు ఎక్కువగా ఫిట్‌నెస్‌ గురించే! ఇవాంకకు ఒకప్పుడు న్యూయార్క్‌ సిటీ హాఫ్‌–మారథాన్‌ను గెలవడం అన్నది లక్ష్యంగా ఉండేది. ఆ లక్ష్యాన్ని కొన్ని నెలల కఠోరమైన శిక్షణతో ఆమె నెరవేర్చుకున్నారు కూడా. 2015 ఏప్రిల్‌లో పదమూడు మైళ్ల మారథాన్‌ పరుగులో ఇవాంక విజయం సాధించారు!

ఫ్రాంక్‌నెస్‌
ఇవాంక.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ట్రంప్‌ అయినా తన కుమార్తె ఆదేశాలను పాటిస్తారేమో కానీ, ఇవాంక తన తండ్రిని గుడ్డిగా సమర్థించరు. ఒక ఉదా : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇవాంక.. తండ్రి తరఫున ప్రచారం చేసినప్పటికీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడంపై ఆమె తన అభిప్రాయలను ఏమాత్రం దాపరికం లేకుండా వెల్లడించడం ట్రంప్‌ ప్రత్యర్థుల్ని సైతం నివ్వెరపరచింది. ‘‘ఒక పౌరురాలిగా ఆయన చేస్తున్న పనిని నేను ఇష్టపడతాను. కానీ ఒక కూతురిగా ఇది ఆయనకు కష్టమైన విషయంగా భావిస్తాను’’ అని ఇవాంక అన్నారు! అదొకటేనా.. ‘‘నా తండ్రిలో ఉన్న అత్యంత గొప్పవైన నైపుణ్యాలలో ఒకటి ఏమిటంటే.. మనుషుల్లోని సామర్థ్యాలను ఇట్టే పట్టేస్తారు. ఆమెరికాను ఆయన మళ్లీ ఒక గొప్ప దేశంగా మార్చేగలరు’’ అని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థుల సమావేశంలో ఇవాంక అన్న మాటల్ని వాషింగ్టన్‌ పోస్ట్‌ ప్రముఖంగా ప్రచురించింది. ఇవాంక వైట్‌హౌస్‌లో ఉన్నంత వరకే అమెరికా గానీ, మిగతా దేశాలు గానీ ట్రంప్‌ చేతుల్లో సురక్షితంగా ఉంటాయని కూడా ఆ పత్రిక రాసింది. 

బిజినెస్‌
డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు కాకపోయుంటే ఈరోజు ఇవాంక పరిచయం వేరేలా ఉండేది. ప్రధానంగా వజ్రాలు, బంగారు ఆభరణాల వ్యాపారి ఆమె. అంతకన్నా ముందు ఫ్యాషన్‌ మోడల్‌. అయితే ఇప్పుడు ఆమె కెరీర్‌లో ఈ రెండిటికీ ఏమంత ప్రాధాన్యం లేదు! అమెరికా అధ్యక్షుడి కూతురిగా ఇవాంక ప్రస్తుతం తన తండ్రికి వైట్‌ హౌస్‌ ఆంతరంగికురాలిగా జీతం లేని ఉద్యోగం చేస్తున్నారు. అమె కన్నా ఏడాది మాత్రమే వయసులో పెద్దవాడైన భర్త జారెడ్‌ కుష్నర్‌ కూడా ఒక సీనియర్‌ సలహాదారుగా ట్రంప్‌ దగ్గరే ఉండిపోయారు. 

సాఫ్ట్‌నెస్‌ 
ఇవాంక చెయ్యిం ఎంత పెద్దదో, మనసూ అంతే పెద్దది. సున్నిత హృదయం. మంచి పనులు చేస్తున్న వారికి తరచు విరాళాలు ఇస్తుంటారు. న్యూయార్క్‌లో ‘చాయ్‌ లైఫ్‌లైన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఉంది. ఆ సంస్థ క్యాన్సర్‌ బారిన పడిన బాలలను సంరక్షిస్తుంటుంది. దానితో పాటు ఇంకా అనేక యూదు సంస్థలకు ఇవాంక క్రమం తప్పకుండా డబ్బు సహాయం చేస్తుంటారు. అలాగే ‘యునైటెడ్‌ హట్జాల్లా’ అనే సంస్థ ఉంది. జెరుసలేంలోని అత్యవసర వైద్య చికిత్సా సంస్థ ఇది. దానికి వేల డాలర్ల చెక్కులు పంపుతుంటారు. ఇవాంక రచయిత్రి కూడా! ‘ది ట్రంప్‌ కార్డ్‌ : ప్లేయింగ్‌ టు విన్‌ ఇన్‌ వర్క్‌ అండ్‌ లైఫ్‌’, ‘ఉమెన్‌ హు వర్క్‌ : రీరైటింగ్‌ ద రూల్స్‌ ఫర్‌ సక్సెస్‌’ అనే పుస్తకాలు రాశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement