దోస్తీ దావత్ | Dosti Dawat | Sakshi
Sakshi News home page

దోస్తీ దావత్

Published Fri, Jul 1 2016 11:55 PM | Last Updated on Thu, Jul 11 2019 6:18 PM

దోస్తీ దావత్ - Sakshi

దోస్తీ దావత్

స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం. ముస్లిం భాయ్ ఈద్ చేసుకుంటున్నాడంటే... చుట్టు పక్కలవాళ్లందరికీ పండగే! ఎంతో అభిమానంగా, ఇతర మతస్థులను కూడా ప్రేమగా పిలిచి మరీ పండుగ రోజు భోజనం పంచుకుంటారు. భారతదేశంలో ఉన్న ముస్లిం భాయ్ దిల్ పెద్దది. కంచం... ఇంకా పెద్దది.
 
కచ్చీ బిర్యానీ
కావల్సినవి: బాస్మతి బియ్యం - పావు కేజీ (250 గ్రా.ములు); మటన్ - కేజీ (ముక్కలు 2 అంగుళాల పరిమాణం); అల్లం- వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్; ఉల్లిపాయలు - 5 (నిలువుగా సన్నగా తరిగి, విడిగా వేయించి పక్కనుంచాలి); కారం - టేబుల్ స్పూన్; పసుపు - అర టీ స్పూన్; పచ్చి బొప్పాయి ముక్క - పేస్ట్ చేయాలి; చిలికిన పెరుగు - కప్పు; కుంకుమపువ్వు - కొన్ని రేకలు (గరిటెడు వేడి పాలలో కలిపి పక్కనుంచాలి)
 
మటన్ మసాలా కోసం... (దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 పచ్చ యాలకులు, 3 లవంగాలు, బిర్యానీ ఆకు, అర టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ సాజీర)
 రైస్ మసాలా కోసం... (యాలకులు 2, దాల్చిన చెక్క, పచ్చ యాలక్కాయ, 2 లవంగాలు, నెయ్యి లేదా నూనె 3 టేబుల్‌స్పూన్లు, పుదీనా, కొత్తిమీర గుప్పెడు, ఉప్పు తగినంత)
 తయారీ
     
బేసిన్‌లో మటన్ వేసి అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, బొప్పాయి ముద్ద, కారం, పసుపు, మసాలా, ఉప్పు, వేయించిన ఉల్లిపాయల తరుగు సగం వేసి కలిపి, 3 గంటల సేపు నానబెట్టాలి.
     కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల చొప్పున నీళ్లు, మసాలా, బియ్యం, తగినంత ఉప్పు వేసి ముప్పావు వంతు వరకు ఉడికించి, నీళ్లను వడకట్టాలి.
      తర్వాత అందులో నెయ్యి వేసి కలపాలి.
     మరో మందపాటి డేకిసా(గిన్నె) తీసుకొని నెయ్యి వేసి వేడ య్యాక నానిన మటన్ వేసి కలపాలి. పైన పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మరసం వేయాలి. సగం ఉడికిన బియ్యం పైన లేయర్‌గా వేయాలి. మిగిలిన నెయ్యి, కుంకుమపువ్వు కలిపిన పాలు, నిమ్మరసం వేయాలి. డేకిసా మీద మూత పెట్టి, గోధుమపిండి ముద్దతో చుట్టూ మూసేయాలి. పెద్ద మంట మీద 20-25 నిమిషాలసేపు ఉడకనివ్వాలి. సన్నని మంట మీద మరో 40 నిమిషాలు ఉంచాలి. తర్వాత దించి, రైతా/ఏదైనా గ్రేవీతో వేడి వేడిగా వడ్డించాలి.
 
షీర్ ఖుర్మా
 
కావల్సినవి: పాలు - అర లీటర్  (3 కప్పులు); నెయ్యి - టేబుల్‌స్పూన్; పంచదార - ఒకటిన్నర టేబుల్ స్పూన్ (డేట్స్ ఎక్కువ వాడితే తక్కువ పంచదార వేసుకోవాలి); సేవియాన్ (వెర్మిసెల్లి)- అర కప్పు; జీడిపప్పు - 8 (తరగాలి); బాదంపప్పు - 8 (సన్నగా తరగాలి); పిస్తాపప్పు - 8 (తరగాలి); ఖర్జూర - 9 (సన్నగా తరగాలి); యాలకులు - 4 (లోపలి గింజలను పొడి చేయాలి); బంగారు రంగులో ఉండే కిస్‌మిస్ - టేబుల్ స్పూన్; రోజ్‌వాటర్ - టీ స్పూన్
 
తయారీ:  సేవియాన్ ను కొద్దిగా నెయ్యి వేసి బంగారురంగు వచ్చేలా వేయించి తీసి పక్కన పెట్టాలి  అదె గిన్నె లేదా పాన్‌లో మరికాస్త నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీయాలి  విడిగా పాలు మరిగించి, సన్నని మంట కాగనివ్వాలి. పాలు కొద్దిగా చిక్కబడ్డాక దీంట్లో వేయించిన సేవియాన్, పంచదార వేసి ఉడికించాలి. సేవియాన్ ఉడికాక మంట తగ్గించి డ్రై ఫ్రూట్స్ మిశ్రమం, యాలకుల పొడి వేసి కలిపి, మంట తీసేయాలి. తీపిదనం ఎక్కువ కావాలనుకునేవారు మరికాస్త పంచదార కలపుకోవచ్చు  కుంకుమపువ్వు, గులాబీ రేకలు, మరిన్ని డ్రై ఫ్రూట్స్ చివరగా అలంకరించుకోవచ్చు.
 
నోట్: ఎండుఖర్జూరం ముక్కలు కలుపుకోవాలంటే వాటిని రాత్రిపూట నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉపయోగించాలి.
 
భేజా మసాలా
కావల్సినవి: మేక బ్రెయిన్ (భేజా)- 200 గ్రాములు; టొమాటో తరుగు - కప్పు ; ఉల్లిపాయ తరుగు - కప్పు; పచ్చిమిర్చి చీలికలు - 3; కొత్తిమీర తరుగు - టీ స్పూన్; మిరియాలు (కచ్చాపచ్చాగ దంచాలి) - 10; కారం - అర టీ స్పూన్; ధనియాల పొడి - అర టీ స్పూన్; జీలకర్ర - అర టీ స్పూన్; ఉప్పు - రుచికి తగినంత; నిమ్మరసం - తగినంత
 
తయారీ: మరుగుతున్న నీళ్లలో పసుపు, ఉప్పు వేసి భేజాను 2-3 నిమిషాలు ఉంచాలి. తరువాత నీళ్లను వడకట్టాలి. గట్టిపడిన భేజాను ముక్కలుగా కట్ చేయాలి. పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి కాగాక జీలకర్రను చిటపటలాడించాలి. దీంట్లో ఉల్లిపాయతరుగు వేసి ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. దీంట్లో టొమాటో తరుగు వేసి మరో 3-4 నిమిషాలు ఉడికించి, పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాల పొడి, ఉప్పు వేసి మరో అర నిమిషం కలపాలి.

దీంట్లో ఇతర మసాలా పొడులు వేసి, గరిటెడు నీళ్లు, ఉప్పు కలిపి ఉడికించాలి. మిశ్రమం చిక్కగా అయ్యాక కట్ చేసిన భేజాను వేయాలి. ఎక్కువ కలపకుండా నూనె కూరనుంచి వేరయ్యేదాక సన్నని మంట మీద ఉడికించాలి. చివరగా మంటతీసేసి కొత్తిమీర, నిమ్మరసం వేసి దించాలి.
 
పాయా షోర్బా
కావల్సినవి:  మటన్ ముక్కలు (పాయా/కండ ఉన్న ఎముకలు) - 10-15; వెల్లుల్లి - 8 రెబ్బలు; ఉల్లిపాయలు - 4; పసుపు - అర టీ స్పూన్; లవంగాలు - 5; పచ్చ యాలక్కాయలు - 4; లవంగాలు - 6; దాల్చిన చెక్క - చిన్న ముక్క; ఉప్పు - తగినంత; నెయ్యి - అర కప్పు; కారం - అర టీ స్పూన్; మిరియాల పొడి - అర టీ స్పూన్; కొత్తిమీర - చిన్న కట్ట; గరం మసాలా - టీ స్పూన్; నిమ్మరసం - టేబుల్ స్పూన్
 
తయారీ: మటన్‌ని శుభ్రపరుచుకొని పక్కనుంచాలి. 2 ఉల్లిపాయలను సన్నగా తరగాలి. మరో రెండింటిని వెల్లుల్లితో కలిపి ముద్దచేసి పక్క నుంచాలి. పెద్ద మందపాటి గిన్నె15-16 కప్పుల నీళ్లు, మటన్ ముక్కలు వేసి ఉడికించాలి. దీంట్లో ఉల్లిపాయ ముద్ద, పసుపు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, ఉప్పు వేసి సన్నని మంట మీద ఉడికించాలి. పాయా మిశ్రమం చిక్కపడుతుండగా మరో 3 కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి.

విడిగా ఒక పాన్‌ను స్టౌ మీద పెట్టి నెయ్యి వేసి, దాంట్లో ఉల్లిపాయలను గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత కారం, మిరియాల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పాయాలో వేసి కలపాలి. చాలా సన్నని మంట మీద దాదాపు 4 గంటల సేపు మరిగించాలి. పాయ నుంచి ముక్క విడిపోయేదాకా ఉడికించాలి. తర్వాత కొత్తిమీర, గరం మసాలా వేసి, పైన కొద్దిగా నెయ్యి వేసి మంట తీసేయాలి. నిమ్మరసం కలిపి వేడి వేడిగా రోటీ, పుల్కాలలోకి వడ్డించాలి.
 
పత్తర్ కా గోష్
కావల్సినవి : బోన్‌లెస్ మటన్ - కేజీ; అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టేబుల్ స్పూన్; దాల్చిన చెక్క పొడి - అర టీ స్పూన్; జాజికాయ పొడి - పావు టీ స్పూన్; లవంగాల పొడి - చిటికెడు; యాలకుల పొడి - పావు టీ స్పూన్; గరం మసాలా - పావు టీ స్పూన్; నెయ్యి - 100 గ్రాములు; ఆవనూనె - అర కప్పు; మిరియాల పొడి - చిటికెడు; బొప్పాయి కాయ గుజ్జు - టేబుల్ స్పూన్; కారం - టీ స్పూన్; అనాసపువ్వు పొడి  - చిటికెడు; నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు; చిలికిన పెరుగు - కప్పు; ఉప్పు - తగినంత; వెల్లుల్లి రసం - 2 టేబుల్ స్పూన్లు
 
తయారీ: మటన్‌ని శుభ్రం చేసి, నీళ్లన్నీ పోయేలా వార్చాలి. అందులో పై మసాలా, కారం... అన్నీ కలిపి 2 గంటలు నానబెట్టాలి. వెడల్పాటి రాయిని బొగ్గుల కుంపటి మీద పెట్టి వేడి చేయాలి. నెయ్యి వేసి, ఒక్కో ముక్కను అన్ని వైపులా బాగా కాల్చి తీయాలి. వేడి వేడిగా వడ్డించాలి.
నోట్: ఇలాగే చికెన్‌తోనూ తయారుచేసుకోవచ్చు.
- కర్టెసీ ప్రదీప్ ఖోస్లా
 హెడ్ షెఫ్ - సిఇఓ, హైదరాబాద్ హౌజ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement