సంధ్యావర్ణ సరిగమలు
క్రిస్‌మస్, న్యూ ఇయర్ వేడుకలు సాయంకాలాలకు కొత్త మెరుపులు అద్దుతుంటాయి. ఆ వేడుకల ఆనందాన్ని రెట్టింపు చేసేలా వస్త్రాలంకరణ ఉండాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. అందుకు తగినట్టుగానే మార్కెట్లో లెక్కకు మించి దుస్తులు రకరకాల డిజైన్లలో కనువిందు చేస్తున్నాయి. శాంటాక్లాజ్ కలర్స్ అయిన ఎరుపు, తెలుపుల్లో డ్రెస్ చేసుకుంటారా.. న్యూ ఇయర్‌కి నలుపు, తెలుపులో హుందాగా కనిపించడానికి సిద్ధమవుతున్నారా... ఈ సందర్భంగా వస్త్రాలంకరణ ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాం...
ఇవీ నేటి ట్రెండ్...
ముందు భాగంలో షార్ట్ లెంగ్త్, వెనక ఫుల్ లెంగ్త్ ఉండే గౌనులు ఆకర్షణీయంగా ఉంటాయి. పొట్ట భాగం కనిపించేలా క్రాప్ టాప్స్ యువతను మరింతగా ఆకర్షిస్తున్నాయి. నలుపు రంగు, వాల్ పెయింట్ ఆర్ట్, ప్లెయిన్ డ్రెస్సులు.. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాయి.
ప్రతి ఏడాది ఫ్యాషన్‌లో ఎన్నో మార్పులు వస్తుంటాయి. వాటిలో నుంచి ఎంచుకోవడంపైనే దృష్టి పెట్టడం సరైనది కాదు. మనదైన స్టైల్ కూడా ఆ ఎంపికకు జోడించాలి. అప్పుడే సందర్భానికి తగ్గట్టుగా వస్త్రాలంకరణ మేనికి నప్పుతుంది. సౌకర్యవంతంగా, ఆత్మవిశ్వాసంగా ఉండే ఆ వస్త్రాలంకరణ చూపరులను ఆకట్టుకుంటుంది.
రంగుల ఎంపిక ప్రధానం
కిందటేడాది పండగకు డిజైనర్స్ కూడా ఎరుపు, తెలుపు రంగుల డ్రెస్సులనే సూచించారు. కానీ, ఈ సంవత్సరం అలా కాదు. ఇప్పుడు కాంతిమంతంగా కనిపించే అన్ని రంగు దుస్తులను ధరించవచ్చు. అలాగే గతంలో క్రిస్‌మస్‌కు నలుపు-తెలుపు మిక్స్ అండ్ మ్యాచ్‌గా ఉండే డ్రెస్సులను ఎక్కువ ఉపయోగించేవారు. ఇప్పుడు డ్రెస్ పూర్తి నలుపు లేదా పూర్తి ఎరుపు ఉండేలా ధరించడం ఫ్యాషన్. బొద్దుగా ఉన్నవారు ఈ రంగుల్లో సన్నగా కనిపించే అవకాశమూ ఉంటుంది. ఈ రెండు రంగుల దుస్తులు క్రిస్‌మస్, న్యూ ఇయర్‌కు వేసుకోవచ్చు. ఎరుపు-తెలుపు కూడా వేషధారణలో బాగా ఉపయోగించవచ్చు. సాయంకాలం పార్టీ గనుక పేస్టల్ కలర్స్ ఉపయోగించవచ్చు.
సింపుల్‌గా.. స్మార్ట్‌గా..!
‘వేడుకలో గ్రాండ్‌గా కనిపించాలి, ఎక్కువ ఖర్చు కాకూడదు’ అనుకునేవారు సింపుల్‌గా ప్లెయిన్ లాంగ్ గౌన్ వేసుకున్నా అందంగా కనిపిస్తారు. ట్యూబ్ గౌన్స్, హై కాలర్ నెక్స్, డీప్ కట్ స్లీవ్స్ సాయంకాలం పార్టీలకు చాలా బాగుంటాయి. మేనికాంతిని ఇనుమడింపజేసే మంచి కాంతిమంతమైన రంగు, కట్స్.. ఉండే ఏ డ్రెస్ అయినా చక్కగా సరిపోతుంది.
ఆకర్షణీయంగా!
గౌను ధరించినప్పుడు సంప్రదాయ ఆభరణాలు ధరించకూడదు. ప్లెయిన్ డ్రెస్, చంకీ జ్యుయెలరీ సాయంకాలపు పార్టీలకు బాగా నప్పుతాయి. డ్రెస్‌లకు పూర్తిగా భిన్నమైన రంగు ఆభరణాలు, కొద్దిగా సిమిలర్ కలర్‌వి ధరించవచ్చు. పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు మెడలో ఎలాంటి హారాలను ధరించవద్దు.
ప్లెయిన్ లాంగ్ గౌన్ లేదా వెస్ట్రన్ డ్రెస్ ధరించినప్పుడు నడుముకు పెద్ద బెల్ట్ బాగా కనిపించేలా ధరించాలి. ఇంకే ఆభరణాలూ అవసరం ఉండదు. మనదైన స్టైల్‌తో లుక్ ఆకర్షణీయంగా కనబడుతుంది. ఫ్యాషన్ జువెల్రీలో భాగంగా చేతిపట్టీలు, ఇతర ఫంకీ జువెల్రీ వాడచ్చు.
ఆధునిక వస్త్రధారణలో సింపుల్‌గా కనిపించాలంటే ఒక చిన్న స్మార్ట్ క్లచ్ చేత పట్టుకుంటే చాలు. పెద్ద పెద్ద హ్యాండ్‌బ్యాగ్‌లను ధరించవద్దు. పార్టీని పూర్తిగా ఎంజాయ్ చేయడానికి పూర్తి ఆహార్యం ఫ్రీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.