వెయిట్ చేయకండి!
► స్థూలకాయం మీద వెంటనే యుద్ధం ప్రకటించండి.
► బరువు పెరిగితే జీవితం కరువే!
► లేటు చేస్తే... వేటు తప్పదు!
► ఆరోగ్యకరమైన జీవితానికి వెంటనే ఓటు వేయండి.
స్థూలకాయం అంటే...?
ఆరోగ్యకరమైన శరీరంలో జీవక్రియల కోసం నిత్యం అనేక పోషకాలు దహనం అవుతూ ఉంటాయి. ఇలా జీవక్రియల కోసం దహనం కాని పోషకాలు కొవ్వు రూపాన్ని సంతరించుకుని శరీరంలోని వేర్వేరు భాగాల్లో పోగుపడుతుంటాయి. ఇలా శరీరంలోని వేర్వేరు భాగాలు కొవ్వులను అనారోగ్యకరమైన రీతిలో నింపుకోవడం వల్ల శరీరం లావుగా మారడం, బరువు పెరగడం జరుగుతుంది. స్థూలకాయాన్ని కొలవడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎంఐ) అనే కొలత ప్రమాణంగా ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ అంటే... ఒకరి తాలూకు ఎత్తును మీటర్లలో తీసుకుని దాన్ని రెట్టింపు చేసి దానితో ఆ వ్యక్తి తాలూకు బరువును (కిలోల్లో) భాగించాలి. ఆ వచ్చినదే – బీఎంఐ. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 70 కిలోలై, అతడి ఎత్తు 1.7 మీటర్లు అనుకోండి. అప్పుడతడి బీఎంఐ = 70 కిలోలు / 1.7 మీ. ్ఠ 1.7 మీ. ఇలా వచ్చిన కొలతను బీఎంఐకు ఉన్న రకరకాల ప్రమాణాలతో పోల్చి చూసి, అతడు స్థూలకాయుడా, కాదా అన్నది నిర్ణయిస్తారు. ఈ ప్రమాణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించింది. పై విధంగా వేసిన లెక్కలో వచ్చిన విలువను బట్టి ఓ వ్యక్తి ఏ మేరకు స్థూలకాయుడు, స్థూలకాయం వల్ల కలిగే అనర్థం ఎలాంటిది అనే వివరాల పట్ల ఒక అంచనాకు వస్తారు నిపుణులు. ఆ వర్గీకరణ ఇలా...
స్థూలకాయానికి కారణాలు
జన్యుపరమైనవి: కొందరిలో జన్యుపరమైన కారణాలతోనే హార్మోన్ల పనితీరు అధికమై దేహం అవసరమైన దాని కంటే ఎక్కువ క్యాలరీలను తీసుకుంటుంది. ఇలా తీసుకున్న క్యాలరీలు మండించకపోవడం వల్ల కొవ్వు రూపంలో శరీరంలో పేరుకుపోతుంది.
తగినంత శారీరక శ్రమ లేకపోవడం: తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఆహారం ద్వారా దేహానికి అందిన క్యాలరీలు నిల్వ చేరిపోతాయి. కూర్చుని పని చేసే వృత్తుల్లోని వారికి క్యాలరీలు నిత్యం నిల్వ చేరుతూ ఉంటాయి. దీనివల్ల స్థూలకాయం పెరుగుతుంది.
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు: ఈ రోజుల్లో చాలామందిలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చోటుచేసుకుంటున్నాయి. ఉదాహరణకు అత్యధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని రాత్రి వేళల్లో తీసుకోవడం, అత్యధిక క్యాలరీలు ఉన్న పానీయాలను తాగడం... వంటివి.
గర్భధారణ: సాధారణంగా గర్భధారణ జరిగిన మహిళ కొద్దిగా బరువు పెరగడం సాధారణం. అయితే కొందరు మహిళలు బిడ్డ పుట్టాక కూడా పెరిగిన బరువును కోల్పోరు. ఈ బరువు శాశ్వతంగా ఉండిపోతుంటుంది. ఇది అనర్థాలకు కారణం కావచ్చు.
నిద్రలేమి: సాధారణంగా ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో హార్మోన్లలో మార్పులు వచ్చి వారి ఆకలి తీరుతెన్నుల్లోనూ మార్పులు వస్తాయి. దీనివల్ల వారు కార్బోహైడ్రేట్ ఆహారాలకు అలవాటు పడుతుంటారు. అది బరువు పెరగడానికి కారణమవుతుంటుంది.
కొన్ని రకాల మందులు: కొందరిలో మరేదో అనారోగ్యానికి వాడుతున్న మందులు స్థూలకాయానికి కారణమవుతుంటాయి. ఉదాహరణకు యాంటీ డిప్రెసెంట్ మందులు, ఫిట్స్ మందులు, డయాబెటిస్ మందులు, మానసిక వ్యాధులకు మందులు, స్టెరాయిడ్స్, బీటాబ్లాకర్స్ వాడేవారిలో స్థూలకాయం రావచ్చు.
కొన్ని రకాల వ్యాధులు: ప్రెడర్–విల్లీ సిండ్రోమ్, కుషింగ్స్ సిండ్రోమ్, పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ వంటి వ్యాధులు కూడా స్థూలకాయానికి కారణమవుతుంటాయి.
బరువు తగ్గడానికి ట్రీట్‌మెంట్: జీవనశైలి మార్పుతో చాలా మందిలో స్థూలకాయం అదుపులోకి వస్తుంది. కొందరిలో ఈ మార్పు సాధ్యం కాకపోవచ్చు. స్థూలకాయానికి కారణం మరేదైనా అనారోగ్యం, వాటికి వాడుతున్న మందులు అయినప్పుడు పేషెంట్ కండిషన్‌ను బట్టి మందులు, వైద్య ప్రక్రియల ద్వారా బరువును నియంత్రించాల్సి ఉంటుంది. అందులో...
⇒ ఆ సమస్యను అధిగమించే రీతిలో రోగి ఆహారంలో మార్పులు చేస్తూ, రోగికి తగినంత శారీరక శ్రమ ఉండేలా వ్యాయామాలను నిర్ణయించడం.
⇒ఈటింగ్ డిజార్డర్ ఉంటే దాన్ని తగ్గించడానికి అవసరమైన మందులు వాడటం. స్థూలకాయాన్ని తగ్గించడానికి శస్త్రచికిత్సే ఎప్పుడు తప్పదంటే... స్థూలకాయం ప్రాణాపాయానికి దారితీసే స్థాయికి చేరినప్పుడు... శస్త్రచికిత్స ద్వారా బరువు తగ్గించడమే ప్రత్యామ్నాయం అవుతుంటుంది. అయితే ఇది అందరి విషయంలో జరగదు.
⇒ రోగి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 40 కంటే ఎక్కువగా ఉండటం.
⇒ఒక వ్యక్తి ఉండాల్సిన ఆరోగ్యకరమైన బరువు కంటే... (పురుషుడైతే సాధారణంగా ఉండాల్సిన బరువు కంటే 45 కిలోలు ఎక్కువ ఉండటం / స్త్రీ అయితే సాధారణ బరువు కంటే 35 కిలోలు) అధికంగా ఉండటం.
⇒బీఎంఐ విలువ 35 – 40 మధ్యన ఉండి, స్థూలకాయం వల్ల వచ్చే టైప్–2 డయాబెటిస్, నిద్రలో గురకపెట్టడం (స్లీప్ ఆప్నియా), గుండెజబ్బులు వంటి ఇతర సమస్యలు కలిగి ఉండటం... ఇలాంటి పరిస్థితుల్లో శస్త్రచికిత్స కొంత ఉపశమనం కలగవచ్చు. బిఎంఐ 40 దాటితే ఇతర అనారోగ్యాలేవీ లేకపోయినా సరే స్థూలకాయం కారణంగా వచ్చే అనర్థాలను నివారించడానికి బేరియాట్రిక్ వంటి శస్త్రచికిత్సలు అవసరమవుతాయి.
మెడికల్ మేనేజ్‌మెంట్
బరువు తగ్గడానికి వ్యాయామం, ఆహార నియంత్రణతోపాటు మందులతో వైద్య చికిత్స చేయడమూ అవసరమే. ఇది స్థూలకాయం స్థాయిని బట్టి ఉంటుంది. మెడికల్ మేనేజ్‌మెంట్‌లో ఎంజైమ్ థెరపీ ద్వారా జీర్ణక్రియకు దోహదం చేసే ఎంజైమ్‌ల పని తీరును నియంత్రించడం, మెదడుకు అందే సంకేతాలను క్రమబద్ధీకరించడం వంటివి ఉంటాయి. స్థూలకాయంతో పాటు డయాబెటిస్ ఉన్న వారికి బరువు తగ్గడానికి కొన్ని ఇంజక్షన్‌లు కూడా మంచి ఫలితాన్నిస్తాయి.
బరువు తగ్గడానికి అనువైన మార్గాలు
ఆరోగ్యకరమైన జీవన శైలి: ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వేళ తప్పకుండా భోజనం చేయడం, వ్యాయామం వంటి మార్గాలతో సహజంగా బరువు తగ్గే ప్రణాళికలు రూపొందించుకోవడం. ఇందులో భాగంగా డాక్టర్ సూచనలు, సలహాలను తప్పక పాటిస్తుండటం చాలా అవసరం. దేహం మీద అవగాహనను పెంచుకుంటూ తమ గురించి తాము తెలుసుకుంటుండాలి. సామాజిక సంబంధాలను కొనసాగించడానికి విందు ఆహ్వానాలను మన్నించాల్సిందే. అయితే ఆహారం తీసుకునే మోతాదులో విచక్షణ పాటిస్తూ, మంచి ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, బరువు వివరాలను నమోదు చేసుకోవాలి.
అనర్థాలు
స్థూలకాయం పరిమితికి మించి పెరిగితే, దాని వల్ల వచ్చే అనర్థాలెన్నో. మొదటి ఇబ్బంది నడకతోనే మొదలు. నడుస్తున్నప్పుడుæదేహభారాన్ని మోయడం దేహానికే కష్టమవుతుంది. అధిక బరువు వల్ల శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవచ్చు. స్థూలకాయం దీర్ఘకాలంగా కొనసాగితే డయాబెటిస్, అధిక రక్తపోటు, స్లీప్ ఆప్నియా, గుండె జబ్బులు, గాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ), గాల్‌స్టోన్స్, ఆస్టియో ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు దారి తీయవచ్చు.
బరువు పెరగనివ్వని ఆహారం
తీసుకోవాల్సిన ఆహారం
బరువు తగ్గడం అంటే కడుపు మాడ్చుకోవడం కాదు... కడుపు నిండా తింటూనే లావెక్కకుండా చూసుకోవడం. బరువు తగ్గడం అంటే నోరు కట్టుకోవడం కాదు... నోటికి రుచికరమైన ఆహారం తింటూనే స్థూలకాయం రాకుండా చూసుకోవడం. ఈసారి కాస్త తెలివినీ... ఆ తర్వాత నోటినీ ఉపయోగించండి... మీరు ఊబకాయానికి దూరం. అదెలాగో తెలుసుకోండి!
శాకాహారం: ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే అన్ని రకాల ఆకుకూరలు, ఇతర కాయగూరల్లో పోషకాలూ ఎక్కువ పాళ్లలో ఉంటాయి. అలాగే కాయగూరల్లో నీటిపాళ్లు ఎక్కువగా ఉండేవి తింటే పోషకాలు భర్తీ అవడమే కాకుండా... వాటిలోని నీటి పాళ్లు త్వరగా కడుపు నింపేలా చేస్తుంది. అందుకే పోషకాలు పుష్కలంగా అందడంతో పాటు కడుపు త్వరగా నిండిపోవడం, దాంతో తృప్తి వెంటనే కలగడం జరుగుతాయి. అదే మసాలాలతో నిండి ఉండే మాంసాహారాల విషయంలో మసాలా రుచులతో మరింత ఆహారం కడుపులోకి వెళ్లేలా ఆ రుచులు ప్రేరేపిస్తాయి. అందుకే ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు, కూరగాయల వంటి శాకాహారం బరువు తగ్గడానికీ, ఒంటిని తేలిక పరచుకోడానికీ ఉపకరిస్తుంది.
కోడిగుడ్లు: ఉడికించిన కోడిగుడ్లు తినండి. మీకు తెలుసా... ఒకటి లేదా రెండు గుడ్లు తినగానే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. పొట్ట నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇది మొదటి ప్రయోజనం. ఇక రెండోది... గుడ్డులో ల్యూసిన్ అనే ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ఉంది. ఇది బరువు తగ్గడానికి నేరుగా ఉపయోగపడుతుంది. ఈ రెండు అంశాలనూ మీరు క్యాష్ చేసుకోవాలి. క్యాష్ బరువు మీ దగ్గరే. కొవ్వు బరువే పరార్. న్యూట్రిషనిస్టులు కోడిగుడ్డు అన్నారు కదా అని ఆమ్లెట్ జోలికి మాత్రం పోకండి.
వైట్ మీట్: మాంసాహారం మీకు ఇష్టమా? తింటే బరువు పెరుగుతారని భయమా? మాంసాహారం తినండి. బరువు తగ్గండి. దీనికి చేయాల్సిందల్లా చేపలు తినడమే. చేప మాంసంలో క్యాలరీలు తక్కువ. రుచి ఎక్కువ. కొవ్వులు దాదాపు జీరో. పరిశోధనలు చెబుతున్నదేమిటంటే... వైట్‌మీట్ అంటే చేపలు తినేవారు చాలాకాలం ఆరోగ్యంగా బతుకుతారు. అందుకే వారంలో కనీసం నాలుగుసార్లు చేపలు తినాలన్నది న్యూట్రిషనిస్టుల సిఫార్సు. అయితే చేపలను ఉడికించి తినాలి. వేపుడుగా కాదు.
ఆలివ్ నూనె: ఎవ్వరైనా ఆరోగ్య సూత్రాలు చెప్పేవారు సూచించేది ఒకటే. ఆయిల్ తక్కువగా తినమని. మీరు ఎలాగోలా ఆలివ్ ఆయిల్ అలవాటు చేసుకున్నారనుకోండి. ఇక ఆయిల్ గురించి బుర్ర స్పాయిల్ చేసుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇందులో మోనోశాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. అవి మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గించకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దాంతో గుండె పదిలం.
∙దానిమ్మ: దానిమ్మ గింజల వల్ల శరీరంలో కొవ్వును నిల్వ చేసుకునే సామర్థ్యం తగ్గుతుంది. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. దీనికి తోడు ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన రక్తనాళాల్లోని అడ్డును తొలగిస్తాయి. పండులో ఉన్న పీచు వల్ల కాసిన్ని గింజలు తినగానే కడుపు నిండిపోయిన ఫీలింగ్. ఈ అంశాలన్నీ కలిసి దీన్ని కాస్త ఎక్కువే తిన్నా బరువు పెరగనివ్వవు. గుండె ఆరోగ్యాన్ని తరగనివ్వవు. పెరిగేదల్లా ఆరోగ్యమే.
సూప్: సూప్ తాగే అలవాటు మనందరిలో ఇటీవల పెరిగింది. ఇటీవల పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే... ప్రధాన ఆహారం ముందుగా సూప్ తాగితే... వారు ఏడాదిలో పెరగాల్సిన బరువులో ఏడు కిలోలు కోల్పోతారట. అందుకే సూప్ తాగండి. అయితే టొమాటో లాంటి వెజిటబుల్ సూప్ అయితే బెటర్ అంటున్నారు న్యూట్రిషనిస్టులు.
డైలీ రొటీన్ ఇలా!
ఏ టైమ్‌లో ఏం చేయాలంటే..?
అగ్రస్థానం భాగ్యనగరానిదే!! హైదరాబాద్ నగరంలో మహిళల్లో పెరుగుతున్న బరువు మీద ఒక సర్వే నిర్వహించారు. ఇందుకోసం 830 మంది మహిళలను ఒక శాంపిల్‌గా స్వీకరించారు. ఇందులో 47.9% మంది మహిళలు స్థూలకాయులని తేలింది. భారతదేశంలోని మెట్రోమహానగరాలన్నింటిలోనూ స్థూలకాయం ఉన్న మహిళల సంఖ్యలో హైదరాబాద్ మొదటిది. దాదాపు సగం మంది మహిళలు స్థూలకాయంతో ఉండటం ఆందోళన కలిగిస్తున్న మరో అంశం.
స్థూలకాయాన్ని నియంత్రించి సాధారణ బరువుకు రావాలంటే రోజుకు 800 కిలో కేలరీలు అందే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. డైటీషియన్లు సూచిస్తున్న ఈ డైట్ ప్లాన్‌ను ఇతర అనారోగ్యాలేవీ లేకుండా స్థూలకాయం మాత్రమే ఉన్నవాళ్లు పాటించవచ్చు. అయితే హై బీపీ, డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యలు ఉన్న వాళ్లు డాక్టర్ సూచన మేరకు ఎవరికి తగిన డైట్ ప్లాన్‌ను వాళ్లు అనుసరించాల్సి ఉంటుంది. ఈ డైట్ ప్లాన్‌ను పాటించినప్పటికీ దేహానికి వ్యాయామం లేకపోతే స్థూలకాయం అదుపులోకి రావడం కష్టమేనంటారు వ్యాయామ నిపుణులు. కాబట్టి నడకతోపాటు వెయిట్‌లిఫ్ట్ వంటి వ్యాయామాలు చేసినప్పుడే దేహం బరువూ తగ్గుతుంది. కండరాలూ శక్తిమంతంగా ఉంటాయి.
డా.ఎమ్. గోవర్థన్
సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్,
కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్