ఈ రీడింగ్ ఈజీ రీడింగ్
గెస్ట్ కాలమ్
కారా మాస్టారిని అడిగాను, ‘చదవగలుగుతున్నారా’ అని. ‘ఇది వరకటిలాగా ఏకధాటిగా చదవలేకపోతున్నాను. మధ్య మధ్య ఆపి కళ్లకు కాస్త విశ్రాంతినిస్తూ చదువుతూనే ఉన్నాను’ అన్నారు. అప్పటికి ఆయనకు 86 ఏళ్లు! చదవడం మీదున్న ప్రేమ అది.
‘నా దస్తూరి అర్థం కాక పొరపాటున మరో పదం కంపోజ్ అయి అదే ప్రింటవుతోంది. ఇక నా రచనలను నేనే తెలుగులో టైప్ చేసుకోవాలి’ షాడో సృష్టికర్త మధుబాబు అభిప్రాయం. ఆ మధ్య అమెరికాలో తెలుగు పుస్తకావిష్కరణ కార్యక్రమం. ఆవిష్కరణ తేదీ దగ్గర పడుతున్నప్పటికీ హైదరాబాద్‌లో అచ్చు అయి అమెరికా చేరాల్సిన పుస్తకాలు చేరనేలేదు. వెంటనే ‘ప్రింట్ ఆన్ డిమాండ్’ సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడే తెలుగుపుస్తకాలను అచ్చు వేయించి ఆవిష్కరణ సభని నిర్విఘ్నంగా, విజయవంతంగా నిర్వహించుకున్నారు.
కేంద్ర సాహిత్య అకాడమి వంటి ప్రచురణ సంస్థలు కూడా రచయితలు తమకు పంపే రచనలను సాఫ్ట్ కాపీలుగా పంపమని కోరుతున్నాయి. ఆదిలాబాదులో ఈ రోజు రాసిన కథని ఆన్‌లైన్‌లో తన లాప్‌టాప్ నుంచి ఈ- పబ్లిష్ చేసుకుంటున్నారు తెలుగు రచయిత. ఇది ఈ రోజు రచనావ్యాసంగంలో తెలుగు రచయితలుయ వారి రచనలు, ప్రచురణల పురోగతి.
ఒకప్పుడు ప్రవాసాంధ్ర పాఠకులు కోఠీ, కాచిగూడ, వైజాగ్ గుప్తా బ్రదర్స్, విజయవాడ ఏలూరు రోడ్డు, చెన్నై పాండిబజార్‌లోని రాణి బుక్ సెంటర్‌లలో తెలుగు పుస్తకాలు కొనుక్కుని విమానం ఎక్కేవారు. ఇల్లినాయిస్‌లో ఉంటున్న అన్నయ్య... తమ్ముడికి కావల్సిన పుస్తకాన్ని ఆన్‌లైన్‌లో కొని ఈమెయిల్ చేస్తున్నాడు. ఆదిలాబాద్‌లోని తమ్ముడు డౌన్‌లోడ్ చేసుకుంటున్నాడు. ఇంటర్నెట్ పుణ్యమా అని పుస్తకాల కోసం ఇది వరకటిలాగ గంటలసేపు ప్రయాణాలు, రోజుల తరబడి నిరీక్షణలు లేవు. సాంకేతిక ప్రగతి విద్యుత్ స్తంభాల చెయ్యిపట్టుకుని గ్రామాలకు వ్యాపిస్తోంది. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్, టెలివిజన్ పరస్పర కరచాలనం చేసుకుంటూ చదువుని ఒక అద్భుతమైన దృష్ణికోణం నుంచి ఆవిష్కరిస్తున్నాయి. పుస్తకాన్ని చేతిలో పట్టుకుని చదివితే చదివినట్లు అనే ధోరణిలో మార్పు వచ్చేసింది.
- అనిల్ అట్లూరి, కినిగె డాట్‌కామ్ నిర్వహకులు
వేనవేల ఘనపు చదరపు అడుగులలో నిర్మించిన పుస్తకభాండాగారాలలోని లక్షల పుస్తకాలు ఈ రోజు పాఠకుడి డెస్క్‌టాప్‌లోకి వచ్చేశాయి. పురాణాలు, ఇతిహాసాల నుంచి నేటి తెలుగు హైకూల వరకు... చదువుకున్న వారికి చదువుకున్నంత. అయితే పాఠకుడు చదవడం కోసం వెచ్చించే సమయం తగ్గింది. వెయ్యి పేజీల నవల రెండు వందల పేజీలకు కుచించుకుపోయింది. నవలికలు, కథలు పెరిగాయి.