
లండన్ : రోజూ గుప్పెడు బాదం, వాల్‌నట్స్ వంటి గింజలతో పురుషుల్లో వీర్యకణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. రోజుకు 60 గ్రాముల పలు రకాల నట్స్ తీసుకుంటే పురుషుల్లో వీర్య కణాల సంఖ్య 16 శాతం పెరుగుతుందని ఈ అథ్యయనం పేర్కొంది. వీటితో వీర్య కణాల కదలికలు సైతం ఆరు శాతం మేర మెరుగవుతాయని ఫలితంగా పురుషుల్లో సంతాన సాఫల్యతకు ఉపకరిస్తాయని పరిశోధన తెలిపింది.
నట్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లతో వీర్యకణాల వృద్ధి జరుగుతుందని పేర్కొంది. కాలుష్యం, పొగతాగడం, పాశ్చాత్య సంస్కృతి పెచ్చుమీరడంతో స్ర్తీ, పురుషుల్లో సంతాన సాఫల్యత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తాజా అథ్యయన వివరాలు వెలుగుచూశాయి. 18 నుంచి 34 ఏళ్ల వయసున్న 119 మందిని 14 వారాల పాటు పరిశీలించిన అనంతరం అథ్యయనం చేపట్టిన స్పెయిన్‌కు చెందిన యూనివర్సిటీ రొవిర విర్గిల్ పరిశోధకులు ఈ అంశాలను గుర్తించారు.
మరోవైపు రోజూ గుప్పెడు నట్స్ తీసుకోవడం ద్వారా వీర్యకణాల డీఎన్‌ఏ దెబ్బతిని పురుషుల్లో సంతాన సాఫల్యత తగ్గడాన్ని నివారించవచ్చని వెల్లడైందని అథ్యయన రచయిత డాక్టర్ అల్బర్ట్ సలాస్ హ్యుటోస్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment