వయసు ఎనిమిదేళ్లు..సంపాదన ఎనిమిది కోట్లు! | eight crore rupees earned in eight years old | Sakshi
Sakshi News home page

వయసు ఎనిమిదేళ్లు..సంపాదన ఎనిమిది కోట్లు!

Published Wed, Sep 24 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

వయసు ఎనిమిదేళ్లు..సంపాదన  ఎనిమిది కోట్లు!

వయసు ఎనిమిదేళ్లు..సంపాదన ఎనిమిది కోట్లు!

ఇంటర్నెట్  విస్తృతం అయ్యాక ప్రతిభ, దాన్ని ఉపయోగించుకొనే తెలివితేటలు ఉంటే చాలు.. డబ్బు, పేరు ప్రఖ్యాతులు తేలిగ్గా సంపాదించవచ్చు... ఈ మాటకు నిలువెత్తు నిదర్శనంలా ఉంటాడు ఇవాన్. పేరు చూస్తే రష్యావాడనిపిస్తుంది కానీ.. ఇతడి వివరాలు తెలిసింది తక్కువమందికే. కానీ వీడియోలు వీక్షించిన వారు మాత్రం కోట్ల మంది ఉన్నారు. యూట్యూబ్‌లో ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయాడు ఈ బుడ్డోడు. ఇతడి వీడియోలకు కోట్ల కొద్దీ వీక్షణలున్నాయి. సొంతంగా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టి వీడియోలను అప్‌లోడ్ చేస్తున్న ఇవాన్ కేవలం ఏడాదిలోనే  ఎనిమిది కోట్ల రూపాయలు సంపాదించాడు.ఇవాన్ చేసేదల్లా ఏమీలేదు... రకరకాల, కొత్త కొత్త ఆటబొమ్మలతో ఆడి చూపించడమే. వాటి గురించి తన అభిప్రాయాలను రివ్యూలుగా చెప్పడమే.
 
అలా ఇవాన్ చెప్పే రివ్యూలను తండ్రి వీడియోలుగా చిత్రీకరించి యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌చేయసాగాడు. దాదాపు ఏడాది క్రితం ఈ పని మొదలు పెట్టాడాయన. బహుశా ఇలాంటి ఐడియాలు మరెవరికీ రాకపోవడం వల్లనేమో కానీ ఇవాన్ యూట్యూబ్ ఛానల్ సూపర్ హిట్ అయ్యింది. వీక్షించే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. వీక్షకుల సంఖ్య పెరగడంతో యాడ్స్ వచ్చాయి. ఏడాది కాలంలో ఆ యాడ్స్ ద్వారా సమకూరిన ఆదాయమే ఎనిమిది కోట్లు! ఎనిమిదేళ్ల వయసు వచ్చేసరికి ఇవాన్ సంపాదించిన మొత్తం అది.
 
వీక్షకుల సంఖ్య పరంగా చూసుకొంటే ఇవాన్ ఛానల్ అతిరథ మహారథుల యూట్యూబ్ ఛానళ్లతో పోటీ పడుతోంది. ఇఎస్‌పీఎన్ నెట్‌వర్క్ వారు యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసే వీడియోలను చూస్తున్న వారి సంఖ్య ఏడాదికి 328 మిలియన్లు.. 280 మిలియన్ల వ్యూస్‌తో ఆ తర్వాతి స్థానాల్లో ఉంది ఇవాన్ యూట్యూబ్ ఛానల్. కెటీపెర్రీ యూట్యూబ్ ఛానల్‌కు 272 మిలియన్ల మంది వ్యూయర్లు ఉన్నారు. ఆమె ఛానల్ కన్నా ఎక్కువ ఆదరణ ఉండటం ఈ బుడ్డోడి ప్రతిభా స్థాయికి రుజువు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement