
నేను గాని అబ్రకదబ్ర గాని అంటే...
ఆయన గానీ... అబ్రకదబ్ర అంటే కంటి ముందు ఉన్నవి కనిపించకుండా పోతాయి. లేనివి రంగురంగుల్లో ముందుకు వస్తాయి. అతడే... మహేంద్రజాలికుడు సామల వేణు. ఇటీవల ‘ఛూ..మంతర్’ పేరుతో సికింద్రాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ మెజీషియన్స్ సమ్మేళనం- 2014లో అంతర్జాతీయ మెజీషియన్స్ సొసైటీ అధ్యక్షుడు టోనీ హస్సినీ చేతుల మీదుగా మ్యాజిక్ ఆస్కార్‌గా పిలుచుకునే మెర్లిన్ అవార్డ్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా వేణు చెప్పిన కొన్ని విషయాలు...
నాన్న సామల శ్రీనివాస్ రోడ్లు, భవనాల శాఖలో ఇంజినీర్. ‘‘బాగా చదువుకొని అమెరికాకు వెళ్లవచ్చు కదా!’’ అన్నారు నాన్న. అమ్మ సుగుణ కూడా నాన్నకు కోరస్ పలికింది. ‘‘అమెరికా ఏమిటి...ఎన్నో దేశాలకు వెళతాను’’ అన్నాను. ఎలా మాట నిలబెట్టుకోవాలని ఆలోచించా. ఇంద్రజాలం వైపు మనస్సు వెళ్లింది. తొలి రోజుల్లో తొలి ట్రిక్‌ను బి.వి.పట్టాభిరాం దగ్గర నేర్చుకున్నాను. కలకత్తా వెళ్లి ప్రసిద్ధ మెజీషియన్‌లు పీసీ సర్కార్, కేలాల్‌ల దగ్గర శిక్షణ తీసుకున్నాను. 2003లో హైదరాబాద్‌లో మెజీషియన్స్ అకాడమీ పెట్టాను. ఇప్పటి వరకు 30 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. 1993లో కెనడాలో తొలి అంతర్జాతీయ ఇంద్రజాల పోటీలో పాల్గొన్న అనుభవం జీవితంలో మరువలేనిది. అందులో నాలుగో స్థానం సాధించాను. అదే ఈ రంగంలో రాణించాలనేందుకు స్ఫూర్తిని ఇచ్చింది. ఇంటర్నేషనల్ మ్యాజిక్ స్టార్ డేవిడ్ కాపర్‌ఫీల్డ్‌ను కలుసుకోవడం మధురానుభూతి. ఆయన అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని మాయం చేసిన తీరు ఆశ్చర్యపరిచింది. నేను కూడా అంతర్జాతీయ స్థాయిలో అలాంటి ప్రదర్శన చేసే ప్రయత్నంలో ఉన్నాను.
డేవిడ్ కాపర్‌ఫీల్డ్‌తో పాటు కె.లాల్, పీసీ సర్కార్, ముతుకాడ్, ఫ్రాంజ్ హారీలాంటి మెజీషియన్లను అభిమానిస్తాను.జాతీయ స్థాయిలో మ్యాజిక్ అకాడమీని స్థాపించి మెజీషియన్లకు ఒక వేదిక కల్పించి వారి సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కరించే దిశగా గత దశాబ్దకాలంగా కృషి చేస్తున్నాను. ప్రతియేటా జాతీయ స్థాయిలో ఇంద్రజాల ఉత్సవాలు నిర్వహిస్తున్నాను.
- కోన సుధాకర్‌రెడ్డి