పిడుగులు పెళ్లి ఆపేశారు... | Eliminate the use of child marriage | Sakshi
Sakshi News home page

పిడుగులు పెళ్లి ఆపేశారు...

Published Mon, Sep 14 2015 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM

పిడుగులు  పెళ్లి ఆపేశారు...

పిడుగులు పెళ్లి ఆపేశారు...

వారధి కట్టడానికి వానర సైన్యం కావాల్సివచ్చింది.
మరి తాళి కట్టకుండా ఆపడానికి ఎలాంటి సైన్యం కావాలి?
పిడుగుల సైన్యం కావాలి.
పదో తరగతి చదువుతున్న పిల్లలందరూ
తమ క్లాస్‌మేట్ పెళ్లి ఆపడానికి పిడుగుల్లా బయల్దేరారు.  
బాల్య వివాహ వ్యవస్థను నిర్మూలించడానికి పోరాడిన
రాజారామ్మోహన్‌రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు,
గురజాడ అప్పారావుల వారసులై కదం తొక్కారు.
ఒక గర్జనలా ఉరిమారు.
పెద్దలకి పిల్లలే పాఠం చెప్పారు...
‘ఇది పెళ్లి, జీవితాలపై ప్రభావం చూపే పెళ్లి. బొమ్మల పెళ్లి కాదు. వెంటనే ఆపేయండి’ అని గర్జించారు.
ఈ పెళ్లయితే ఆగింది కానీ...
బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని
మనం సిగ్గుతో తలదించుకోవాలా...
లేదా, పిడుగుల్లాంటి ఈ వారసులను చూసి గర్వపడాలా!
ఈ పిల్లల్ని చూసి ఉద్యమస్ఫూర్తితో
బాల్య వివాహాలను ఆపాలి.

 
బాల్య వివాహాలు, సతీ సహగమనాలు అనాగరిక దురాచారాలు. రెండు శతాబ్దాల కిందటే మన దేశంలో వీటిపై వ్యతిరేకత మొదలైంది. ఎందరో మహనీయులు సాంఘిక వ్యతిరేకతకు ఎదురొడ్డి మరీ బాల్య వివాహాలను అడ్డుకున్నారు. వారి ఉద్యమ ఫలితంగా బాల్య వివాహాలను నిషేధిస్తూ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1929లో శారదా చట్టాన్ని అమలులోకి తెచ్చింది. స్వతంత్ర భారత చట్టాలు కూడా బాల్య వివాహాలను నిషేధిస్తున్నాయి. చట్టాల మానాన చట్టాలు ఉన్నాయి... అవేవీ పట్టని తల్లిదండ్రులు తమ చిన్నారులకు పెళ్లిళ్లు చేస్తూనే ఉన్నారు. అలాంటి ఒక పెళ్లిపై పిల్లలు పిడుగుల్లా విరుచుకుపడిన ఉదంతం ఇది.
 
తేది: 10-9-2015
స్థలం: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మదనపల్లె. చిత్తూరు జిల్లా.
ఉదయం 10 గం.లు.
పదో తరగతి ‘ఎ’ సెక్షన్.
విద్యార్థుల సంఖ్య 52.

తరగతి గదిలో టీచర్ పాఠం చెబుతున్నారు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. క్లాసు పూర్తయ్యాక కొందరు విద్యార్థులు టీచర్ దగ్గరకు వెళ్లారు. ఫ్రెండ్ పెళ్లి నిశ్చితార్థానికి వెళ్లి  రావడానికి పర్మిషన్ కావాలని అడిగారు. టీచర్ ఒప్పుకోలేదు. కాసేపటికి మరికొందరు విద్యార్థినులు టీచర్‌ను కలుసుకున్నారు. ‘సార్! మన క్లాసులోని రుక్సానా (పేరు మార్చాము) పెళ్లి నిశ్చితార్థం జరుగుతోంది. మమ్మల్ని రమ్మని పిలిచింది. వెళ్లి వస్తాం సార్’ అని చెప్పారు. టీచర్ ఆశ్చర్యపోయారు.

‘ఆ అమ్మాయి వారం రోజులుగా స్కూల్‌కి రావడం లేదంటే ఆరోగ్యం బాగోలేదనుకున్నాను. ఇంకా హైస్కూల్ చదువు కూడా పూర్తి కాని అమ్మాయికి అప్పుడే పెళ్లేంటి? ఈ వయసులో పెళ్లి చేయడం నేరం. శారీరకంగా, మానసికంగా ఎదుగుతున్న వయసులో పెళ్లి చేసుకుంటే వయస్సుకు మించిన భారాన్ని తట్టుకోలేక అనేక రుగ్మతలకు గురవుతారు. కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటివి జరగడం నిజంగా బాధాకరం’ అన్నారు. మైనారిటీ తీరకుండా పెళ్లి చేస్తే ఆ తర్వాత వచ్చే సమస్యల గురించివిపులంగా వివరించారు.

 పిల్లలందరూ ఆలోచనల్లో పడ్డారు. వారిలో వారే తర్జనభర్జన పడ్డారు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. మళ్లీ టీచర్‌ని కలుసుకున్నారు. ‘సార్! రుక్సానా పెళ్లి ఆపుదాం. మాతోపాటు వస్తారా?’ అని అడిగారు. వారి నిర్ణయానికి టీచర్ అండ కూడా తోడైంది. 50 మంది విద్యార్థినీ విద్యార్థులు... టీచర్లు కలిసి రుక్సానా ఇంటికి చేరుకున్నారు. అప్పటికే బంధువుల మధ్య వివాహ నిశ్చితార్థం జరుగుతోంది. ‘ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. రుక్సానాను స్కూల్‌కి పంపించండి’ అని విద్యార్థులంతా ముక్తకంఠంతో ఆమె తల్లిదండ్రులను నిలదీశారు. తొలుత రుక్సానా తల్లిదండ్రులు ఆవేశపడ్డారు. ‘మా కూతురు మా ఇష్టం. వద్దనడానికి మీరెవరు? పిల్లలు పిల్లల్లా ఉండండి. పెద్దల విషయాల్లో తలదూర్చకండి’ అంటూ గొడవకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, షీటీమ్ సభ్యులు, స్కూల్ టీచర్లు, ఇతర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.కొంతసేపు వాదోపవాదాలు జరిగాయి.

 షీ టీమ్ సభ్యులు, టీచర్లు... అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ‘చిన్నవయసులో పెళ్లిళ్లు చేస్తే పిల్లలు తమ జీవితంలో సాధించాలనే కోరికలను మధ్యలోనే వదిలేస్తారు. సంసార సాగరంలో మునిగిపోవడంతో వయసుకు సహజమైన ఆటపాటలను దూరమై, జీవితంపై విరక్తి చెంది, నిరాసక్తంగా, నిస్తేజంగా బతుకు వెళ్లదీస్తారు. అందువల్ల చిన్న వయసులోనే పిల్లలకు పెళ్లిళ్లు చేయడం తగదు’ అని హితవు చెప్పారు.

 విద్యార్థులంతా.. ‘రుక్సానా ఇప్పుడు వెళ్ళాల్సింది అత్తారింటికి కాదు బడికి’ అంటూ ముక్తకంఠంతోనినదించారు. రుక్సానాకు భరోసాగా తాముంటామని ప్రధానోపాధ్యాయురాలు, ఇతర ఉపాధ్యాయులు ఆమె తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఇంత జరగడంతో రుక్సానా పెళ్లిని ఆమె తల్లిదండ్రులు విరమించుకున్నారు. విద్యార్థినీ విద్యార్థులంతా హర్షం వ్యక్తం చేశారు.
 - మాడా చంద్రమోహన్, సాక్షి,
 మదనపల్లె సిటీ, చిత్తూరు
 
మా స్కూలు పిల్లలకు అభినందనలు
 బాల్యవివాహాలు చట్ట విరుద్ధమే అయినా చాలా పల్లెటూళ్లలో నేటికీ జరుగుతున్నాయి. బాల్య వివాహాల వల్ల చిన్న వయసులోనే పిల్లలు కలిగి, ఆ తర్వాత రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిని చూస్తేనే ఉంటాం. చదువుకునే వయసులో పెళ్లిళ్లు చేసి అమ్మాయిల మానసిక ఎదుగుదలకు ఆటంకంగా నిలవరాదని పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చిన్నవాళ్లయినా మా స్కూలు పిల్లలు తీసుకున్న ఈ నిర్ణయానికి నా అభినందనలు.
 - ఆర్.సి.తిరుమల, ప్రధానోపాధ్యాయురాలు,
 జడ్పీ హైస్కూల్, మదనపల్లె
 
పౌరులుగా మనం ఏం చేయాలి?
బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల గురించి మనకు స్వాతంత్య్రం పూర్వం నుంచి పెద్దలు చెబుతూనే ఉన్నారు. ఆ తర్వాత చట్టాలు వచ్చాయి. అయినా, నేటికీ బాల్యవివాహాలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.హిందూ వివాహచట్టం 1955 ప్రకారం అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండితేనే పెళ్లికి చట్టబద్ధత లభిస్తుంది.  మీ ప్రాంతంలో ఎవరైనా బాల్య వివాహం చేస్తున్నట్టు తెలిస్తే మీ పరిధిలోని పోలీసులకు సమాచారం చేరవేయండి. లేదా 100 నెంబర్‌కి ఫోన్ చేసి సమాచారం అందించండి.  షీటీమ్, పోలీసుల సాయంతో బాధిత వ్యక్తుల శ్రేయస్సుకు తోడ్పాటును అందించండి. సమాజ బాధ్యతలో మీరూ పాలుపంచుకోండి.
 
అవగాహనే ముఖ్యం
తరగతి గదిలో విద్యార్థులకు ఎన్నో అంశాలను బోధిస్తుంటాం. పరీక్షలు నిర్వహిస్తుంటాం. అయితే, మార్కులు కాదు ప్రామాణికం, అవగాహనే ముఖ్యం. బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాలను తెలుసుకున్న
 విద్యార్థులు స్నేహితురాలి భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగినది.
 - విష్ణువర్ధన్‌రెడ్డి,  క్లాస్ టీచర్
 
మనందరి బాధ్యత
బాల్య వివాహాలను అడ్డుకోవడం మనందరి బాధ్యత. చదువుకునే వయస్సుల్లో పెళ్లిళ్లు చేయడం నేరం. అమ్మాయిలు అన్ని
 రంగాల్లోనూ రాణిస్తున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వారిని చదువుల్లో ప్రోత్సహించాలి.
 - చంద్రశేఖరరాజు, ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు
 
కౌన్సెలింగ్‌తో మార్పు
బాల్యవివాహం అడ్డుకోవడానికి స్కూల్ విద్యార్థులు తీసుకున్న నిర్ణయం చాలా మెచ్చుకోదగినది. విద్యార్థులకు అన్ని చట్టాలపై అవగాహన కల్పించాలి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి విద్యార్థులు ముందుకొస్తే బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుంది.
 - రమాదేవి, షీ టీమ్ కోఆర్డినేటర్,
 మహిళా పోలీసుస్టేషన్, మదనపల్లె
 
 చట్ట విరుద్ధం..

 బాల్యవివాహాలు చట్టవిరుద్దం. అమ్మాయి మేజర్ అయ్యే వరకు పెళ్లి చేయబోమని తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వకంగా వాగ్దానం తీసుకున్నాం. బాల్యవివాహాలు జరగకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది.
 - కె.దస్తగిరి, వన్‌టౌన్ సబ్ ఇన్‌స్పెక్టర్,
 మదనపల్లె.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement