రక్తమాంసాలతో పాటు మనుషుల్లో భావోద్వేగాలు కూడా కలిసిపోయి ఉంటాయి. అవి లేబొరేటరీలలో బయటపడవు. మాటల్లోనే బయట పడతాయి.
మాట జారితే వెనక్కు తీసుకోలేం. అలాగని మౌనంగా ఉండిపోతే.. మాట జారినప్పుడు జరిగే నష్టం కన్నా కొన్నిసార్లు మాటను బిగబట్టి ఉంచడమే ఎక్కువ చేటు చేస్తుంది. మరి ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనం వహించాలి? విజ్ఞులు, స్థితప్రజ్ఞులు అనుకుంటాం కానీ.. వారి దగ్గర కూడా ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. రక్తమాంసాలతో పాటు మనుషుల్లో భావోద్వేగాలు కూడా కలిసిపోయి ఉంటాయి. అవి లేబొరేటరీలలో బయటపడవు. మాటల్లోనే బయట పడతాయి. ఇక మౌనం అనేది రక్తమూ కాదు. మాంసమూ కాదు. ఉద్వేగమూ కాదు. ఊహించిన ఉపద్రవాన్నో, ఊహించని ఉత్పాతాన్నో తప్పించుకోవడానికి మనిషి ఆశ్రయించే స్థితి. అది కొన్నిచోట్లే పనిచేస్తుంది. మిగతాచోట్ల మనిషిని అనామకం చేస్తుంది. ‘నిరర్థక మౌనం’ అవుతుంది. దాని కన్నా మాటే నయం. ప్రాణి అన్నాక యాక్షనో, రియాక్షనో ఉండకపోతే ఎలా! ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఈ మధ్య పెద్దగా మాట్లాడ్డం లేదు. ఏవో ఆరోగ్య కారణాలు. ఆయనకు బదులుగా ‘లా’ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతున్నారు. మంత్రులకూ వాళ్లకూ ఎలా మాట్లాడాలో కూడా ప్రసాద్ చెబుతున్నారు. ‘కుఠువా’ మీద అలా మాట్లాడకండి, ‘ఉన్నావ్’ మీద అలా మాట్లాడండి అని ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు.
మోదీ అయితే.. ‘ఆచితూచి మాట్లాడండి’ అనే ఆదేశం కూడా జారీ చేశారు. అలా ఆదేశం జారీ అయిన కొద్ది గంటలకే కేంద్రమంత్రి సంతోష్ కుమార్ మాట జారారు. ‘ఇంత పెద్ద దేశంలో ఒకటీ అరా రేపులు జరగవా?!’ అన్నారు. తర్వాత.. ‘నా ఉద్దేశం అది కాదు’ అన్నారు. ఉద్దేశాలు ఏవైనా ఒకసారి జారిపోయాక మళ్లీ లేవలేం. ఒక్కోసారి ఉద్దేశం లేకుండా మాట వచ్చేస్తుందని మనోవైజ్ఞానిక నిపుణులు అంటారు. ‘ఫ్రాయిడియన్ స్లిప్’ అంటారు అలా జారడాన్ని. మనసులో లేనిది మాటగా బయటికి రావడం! సరే, వచ్చింది. నష్ట నివారణ ఏమిటి? రవిశంకర్ ప్రసాద్ అయితే ఒక మార్గం చెబుతున్నారు. ‘ట్విట్టర్ ఉంది కదా. అక్కడ మీ మాటలకు కరెక్షన్ చేసుకోండి’ అని. మాట గాయానికి ట్విట్టర్ కట్టు!
– మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment