
దూరపుచుట్టం
టూకీగా ప్రపంచ చరిత్ర 24
అయితే, కనీసం ఒక్క విషయంలో అతని ప్రవర్తన మిగతా జంతువులకు భిన్నంగా లేకపోయిండొచ్చు. అది సంతానం పట్ల పోతు జంతువుకుండే నిరాసక్తత. జంతువుల్లో పిల్లల పోషణా రక్షణా సంపూర్ణంగా పెంటి జంతువు నిర్వహించే బాధ్యతలు. బహుశా అందుకు కారణం సంతానోత్పత్తిలో తనకు భాగస్వామ్యం ఉందని పోతుకు తెలియకపోవడం కావచ్చు. సంతానోత్పత్తి విధానాన్ని తెలుసుకునేంత ఆలోచన నియాండర్‌తల్ మానవునికి ఉండేదని మనం ఊహించలేం. స్త్రీ పురుష సంపర్కం వాళ్ళకొక ఆహ్లాదం మాత్రమే.
ఇక చెప్పేందుకు మిగిలిపోయింది చరిత్రలో ఏర్పడిన గండి గురించి. హోమో ఎరెక్టస్ కాలం దాదాపు ఐదులక్షల ఏళ్ళనాటిది. నియాండర్‌తలెన్సిస్ కాలం ఒకటిన్నర లక్ష ఏళ్ళనాడు మొదలౌతుంది. ఈ మధ్యలో మిగిలిన మూడున్నర లక్షల ఏళ్ళు పరిణామక్రమం ఏమైపోయిందో ఇటీవలికాలం దాకా శాస్త్రజ్ఞులకు అంతుపట్టలేదు. 1933లో జర్మనీలోనూ, 1935లో ఇంగ్లండులోనూ దొరికిన అవశేషాలు రెండులక్షలూ యాభైవేల సంవత్సరాలనాటివిగా నిర్ధారణ కావడంతోనూ, లక్షణాలతో అవి నియాండర్‌తల్ నరుని పూర్వీకులవిగా నిరూపణ కావడంతోనూ కాసింత ఉపశమనం దొరికినా, ఆ నడిమికాలం అవశేషాలు ఎందుకు అంత అరుదయ్యాయనే సవాలు ఇప్పటికీ మనను వెంటాడుతూనేవుంది.
నియాండర్‌తల్ మానవులు నాలుగవ హిమానీశకం అవాంతరాలను అధిగమించి లక్ష సంవత్సరాలకు పైగా యూరప్‌ను ఆక్రమించి జీవించారు. నేలమీద ఇంత సుదీర్ఘంగా నిలిచిన జాతి మరొకటి లేదు. కానీ, ముప్ఫైవేల సంవత్సరాలకు ముందు ఈ జాతి సర్వస్వం వారసత్వం లేకుండా అంతరించింది. దానికి కారణంగా ఆ తరువాత తెరముందుకు వచ్చిన ‘క్రోమాన్యాన్’ మానవుణ్ణి కొందరు నిందిస్తున్నారుగానీ, అది సమంజసంగా కనిపించదు. ఒక జాతిని సమూలంగా తుడిచిపెట్టే అవసరం ఆ రోజుల్లో మరొక జాతికి లేనేలేదు. అదీగాక నియాండల్‌తల్ నరుని శరీరం తరువాతి కాలంలో మరింత మోటుగా పరిణమించి, ఎదుగుదలకు అవరోధంగా మారిపోయింది. బహుశా హిమానీశకంలో చలి ప్రభావానికి అతని శరీరం అలాంటి ఆకారం తీసుకోనుండొచ్చు. మంచు పేరుకుపోయిన దశలో ఆహారానికి ఏర్పడిన కొరత మూలంగా ఆ నరునికి స్వజాతిమాంసం తినే అలవాటు (కెన్నెబాలిజం) గూడా అబ్బిందని కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. దాన్నిబట్టి ఆ జాతి రానురాను అంతరించే మార్గంలో పయనించిందేగానీ, తరువాతి దశకు ఎదిగిందిగాదు.
అయితే, కొత్తగా వచ్చిన మానవునితో నియాండర్‌తలెన్సిస్‌కు నివాసం కోసం, వేట కోసం పోటీ ఏర్పడడం అనివార్యం. పోటీకి నిలువలేక అతడు ఆరుబయటి జీవితానికి తిరోగమించి, మారిన వాతావరణంలో సమూలంగా అంతరించిపోయిన దురదృష్టాన్ని అసంభవంగా మనం భావించలేము. ఈ నేలమీద వారసుణ్ణి నిలుపుకోకుండా అంతరించిన నియాండర్‌తల్ జాతికి సానుభూతి ప్రకటించడం మినహా మనం చేయగలిగింది ఈ సందర్భంలో మరొకటి లేదు.
నియాండర్‌తల్ మానవులు మొత్తంగా అంతరించలేదనే వాదనలు గూడా ఉన్నాయి కొన్ని. యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో దొరికిన నియాండర్‌తల్ అవశేషాల్లో కొంత నాజూకుదనం కనిపించిన కారణంగా, అవి ‘ప్రోగ్రెసివ్’ నియాండర్‌తలెన్సిస్‌కు చెందినవనీ, వాళ్ళు ఆధునిక మానవునిగా పరిణించారనీ, అంతరించిపోయింది కేవలం ‘క్లాసికల్’ నియాండర్‌తల్స్ మాత్రమేననీ కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. కానీ, సెంట్రల్ యూరప్‌లో ఆధునిక మానవుని పరిణామం జరగలేదనీ, పరిణామం చెందిన మానవుడు దక్షిణం నుండి సెంట్రల్ యూరప్ చేరుకుని క్రమంగా విస్తరించాడనీ ఎక్కువమంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం.
రచన: ఎం.వి.రమణారెడ్డి