వెనుక తరాలు | Encapsulate the history of the world | Sakshi
Sakshi News home page

వెనుక తరాలు

Published Thu, Feb 5 2015 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

వెనుక తరాలు

వెనుక తరాలు

టూకీగా  ప్రపంచ చరిత్ర
 
అది నాలుగవ హిమానీశకం బలహీనపడుతున్న సమయం. యూరప్‌లో ఆల్ప్స్‌పర్వత శ్రేణి వరకూ, ఆసియాలో కజకిస్థాన్, మంగోలియాల వరకూ, అమెరికాలో కెనడా దక్షిణ సరిహద్దు వరకూ ఉత్తరార్థగోళం చుట్టూరా కప్పుకున్న మంచుపొర అంచులు కొద్దికొద్దిగా కరిగిపోతూ, పొడినేలల బయటికి తేలుతున్నాయి. మంచుపరుపు ఉత్తరధ్రువానికి తిరోగమిస్తుండగా, మంచును వదిలించుకున్న నేలల్లో చెట్టూ చేమా మొలకెత్తి, నింపాదిగా ఉత్తరానికి ఎగబాకుతున్నాయి. వాటితోపాటు జంతువులు ఉత్తరార్థగోళానికి విస్తరించడంతో, వాటిని వెన్నంటి సరికొత్త మానవుడు యూరప్‌లో ప్రవేశించాడు. అతడే ‘క్రోమాన్యాన్’ మానవుడు.

శారీరక లక్షణాల్లో క్రోమాన్యాన్ మానవుడు అచ్చం మనలాటి మనిషే. ఆరడుగుల ఎత్తుండే భారీకాయం, వెడల్పాటి ముఖం, విశాలమైన కళ్ళు, నిటారుగా వుండే నుదురు, కింది దవడలో చుబుకం - అంతా మనపోలికే. ఒంటిమీద బొచ్చుగూడా పలుచబడింది. అన్నికంటే ఆశ్చర్యం కలిగించేది అతని మెదడు పరిమాణం. అది మనదానికంటే కూడా కాస్త పెద్దది. కేవలం సైజేగాదు, మనకులాగే అతనిలో ఆలోచనకు సంబంధించిన మెదడుభాగం బాగా పెరిగింది. ఈ కారణాల వల్ల అతన్ని మనం కులం (స్పీసీస్)లోనే చేర్చి ‘హోమో సెపియన్’గా గుర్తించారు. అంటే, అతనితో మన సొంత చరిత్రకు తెర లేచిందన్నమాట.

ఫ్రాన్సు దేశంలోని ‘క్రోమాన్యాన్’ గుహలో మొదటిసారిగా ఈ మనిషికి సంబంధించిన అవశేషాలు దొరకడంతో ఇతనికి ఆ పేరొచ్చింది. ఆ తరువాత యూపర్‌లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి అస్థికలు విశేషంగా లభించాయి. వాటిల్లో అత్యంత పురాతనమైనవి సుమారు 30వేల సంవత్సరాలవికాగా, చివరివి కనీసం 10వేల సంవత్సరాలనాటివి. పరిశోధనలు యూపర్‌లోనే ఎక్కువగా జరగడంతో అవశేషాలు విస్తారంగా అక్కడ దొరికుండొచ్చుగానీ, అతని జన్మస్థానం మాత్రం యూపర్ కాదు. ఉత్తర ఆఫ్రికాలోనో, దక్షిణ ఆసియాలోనో హోమో ఎరెక్టస్ నుండి అనేక సోపానాల్లో పరిణమించి, పరిపూర్ణమైన మనిషిగా ఎదిగిన తరువాత అతడు యూపర్‌లో ప్రవేశించాడు. అది ఒక దారిని ఎన్నుకుని పథకం ప్రకారం జరిగిన వలసగాదు; తనకు అలవాటైన వృక్షాలనూ, తనకి ఇష్టమైన జంతువులనూ అనుసరిస్తూ చెల్లాచెదురుగా జరిగిన విస్తరణ. ఆ ఇరవై వేల సంవత్సరాల్లో జరిగినంత మానవ విస్తరణ ఆ తరువాత ఈ భూమిమీద ఏ దశలోనూ జరుగలేదు.

అలాంటి విస్తరణకు అప్పటి భౌగోళిక పరిస్థితులు బాగా అనుకూలించాయి. ఇప్పుడు మనం ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలుగా చెప్పుకుంటున్న భూభాగాలు దేనికదిగా అప్పట్లో విడిపోలేదు. రష్యాలోని సైబీరియాతో ఉత్తర అమెరికాలోని అలాస్కా నిరాటంకంగా కలిసి పోయుండేది. వీటిని కలిపివుంచిన భూభాగం ఆ తరువాత పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయి బేరింగ్ జలసంధిగా ఏర్పడింది. మధ్యధరాసముద్రం అప్పట్లో రెండు పెద్ద సరస్సులుగా మాత్రమే ఉండేది. దానికి పడమటిదిశగా అట్లాంటిక్ మహాసముద్రంతోగాని, తూర్పుదిశగా నల్లసముద్రంతోగాని సంధి ఏర్పడలేదు. అందువల్ల ఆఫ్రికా ఉత్తర ప్రాంతం, ఆసియా పడమటి ప్రాంతాలు యూరప్‌తో కలిసిపోయి ఒకే అట్టగా ఉండేవి. అప్పట్లో ఎడారులుగూడా ఉండేవిగావు. ఆఫ్రికాలోని సహారా ఎడారి ఒక విశాలమైన పచ్చికబయలు. అలాగే రష్యాలోని సైబీరియా మైదానం మరింత విశాలమైన పచ్చికబయలు. పచ్చిక మేసే జంతువులను వెదుక్కుంటూ, గుంపులు గుంపులుగా క్రోమాన్యాన్ మానవుడు యూరప్‌లో ప్రవేశించాడు. అప్పుడింత అప్పుడింతగా లోపలికి చొచ్చుకుపోయాడు. మరోవైపు ఇండోనేషియా, చైనా, కొరియాలను అనుసరించి మొదట ఉత్తర అమెరికాకు చేరుకుని, అక్కడి నుండి దక్షిణ అమెరికాకు విస్తరించాడు. క్రోమాన్యాన్ మానవుడు చేరుకోకముందు అమెరికాలో మనిషీ లేడు, మనిషి పరిణామమూ లేదు. కానీ, అమెరికాలో స్వతంత్రంగా మానవ పరిణామం జరిగినట్టు నిరూపించాలని కొందరు అమెరికన్ శాస్త్రజ్ఞులు పనిగట్టుకుని ప్రయత్నాలు సాగించారు. చివరకు వాళ్ళ ప్రయత్నం జాతీయ దురహంకారానికి ఎల్లలుండవనే వాస్తవాన్ని మాత్రమే నిరూపించింది.
 
రచన: ఎం.వి.రమణారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement