కొత్త దొంతర
టూకీగా ప్రపంచ చరిత్ర 30
సుమారు పది పన్నెండు వేల సంవత్సరాలకు ముందు మరో కొత్త మానవుడు యూరప్‌లో ప్రవేశించడం మొదలెట్టాడు. ఇక్కడ ‘కొత్త’ అనే విశేషణం అతని శరీర నిర్మాణానికి సంబంధించిగాదు; శరీర నిర్మాణంలో పరిణామం క్రోమాన్యాన్ మానవుని దశ దగ్గర ఆగిపోయింది. ఆ తరువాత మానవుని ఆకారంలో వచ్చిన వ్యత్యాసాలన్నీ కవళికలకూ, చర్మం రంగుకూ సంబంధించినవి మాత్రమే. ఇప్పుడు ప్రవేశించిన మానవుని కొత్తదనం అతని చేతికి చిక్కిన రెండు సాధనాలవల్ల కలిగింది. వాటిల్లో మొదటిది ‘విల్లు-బాణం’. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో తుపాకి ఆవిష్కరించబడేవరకు ‘ధనుర్బాణాలు’ ఈ భూ మండలంలో తిరుగులేని ఆయుధాలు.
విల్లు మినహా, అతని మిగతా పనిముట్లు ఎప్పటిలాగా రాతివే; కాకపోతే, గతుకులు లేకుండా నున్నగా ‘పాలిష్’ పట్టిన పనిముట్లు. అదనంగా చెప్పుకోవలసింది రంధ్రం తొలిచిన రాతిగొడ్డలి. కర్రను తొడిగి జారిపోకుండా పురినారతో బంధిస్తే, గొడ్డలి పనితనం పెరుగుతుంది, చేత్తో పట్టుకుపోయేందుకు వసతిగానూ ఉంటుంది. ఆ రోజుల్లో నారకు పురిబెట్టడం వరకే తెలుసుగానీ ముప్పిరిబెట్టి మోకును పేనడం ఇంకా తెలుసుకోలేదు. అలవోకగా చేతిలో ఇమిడే గొడ్డలి ఇప్పుడు పనిముట్టు మాత్రమే కాదు, అవసరమైతే ఆయుధంగా గూడా మారుతుంది. లోహం గురించి అప్పటికి కూడా అతనికి తెలియకపోవడంతో ఈ మానవుని హయాంను రాతియుగం కిందే జమగట్టినా, అతని ప్రత్యేకతకు గుర్తింపుగా దాన్ని ‘కొత్త రాతియుగం’ అన్నారు.
అతని రెండవ సాధనం ‘సంస్కృతి’. అవయవ నిర్మాణంలో మనం క్రోమాన్యాన్ మానవునికి వారసులం కాగా, సంస్కృతిలో మన వారసత్వం కొత్త రాతియుగం మనిషి నుండి సంక్రమించింది. ఐతే, ఆ సంస్కృతి అతడు విల్లనమ్ములు చేతికి తీసుకున్న తొలిరోజే ఏర్పడిందిగాదు. తొలిదశలో కొత్త రాతియుగం మనిషి గూడా కేవలం వేటగాడే. కొత్త ఆయుధం వల్ల వేటలో అతనికి సౌలభ్యం పెరిగుండొచ్చు; ఏ పొద మాటునుండో చెట్టు మీది నుండో జంతువుని చంపగలిగే సదుపాయం వల్ల భద్రత పెరిగిండొచ్చు; ఐనా, వేట మీద ఆధారపడిన జీవితం మునుపటిలాగే కొనసాగింది. రెండు వేల సంవత్సరాల తదుపరి, జంతువులను మచ్చికజేసే ఒడుపు ఏనాడు తెలిసిందో అప్పుడు అది ‘పశువుల కాపరి’ జీవితంగా మారిపోయింది. ఆ తరువాత మరో రెండు వేల సంవత్సరాలకు అతని జీవితం ‘వ్యవసాయం’ లో అడుగెట్టింది. క్రీస్తుశకం 16వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం మరో తరహా సంస్కృతిని ప్రవేశ పెట్టిందకా, కొత్త రాతి యుగం మానవుడు నెలకొల్పిన సంస్కృతి మానవ సమాజాన్ని అవిచ్ఛిన్నంగా నడిపించింది.
ఉత్తరార్ధగోళంలో కొత్తగా ప్రవేశించిన ఈ విల్లమ్ముల మానవుడు ఎక్కడివాడు? ఎక్కడివాడైనా కావచ్చు. ఇదివరకటిలాగే ఉత్తర ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతాల నుండి బయలుదేరిన వాళ్ళు కొందరైతే, పశ్చిమ ఆసియా, మధ్య ఆసియాల నుంచి వచ్చినవాళ్ళు మరికొందరు. వచ్చింది ఎక్కడినుండైనా వాళ్ళ వలసలు ఉద్దేశపూర్వకరమైన ఆక్రమణలు కావు. ప్రీతికరమైన వేట కోసం పచ్చిక మైదానాలు గాలిస్తూ, ఎంతదూరం వస్తున్నామనే చింతలేక జరిగిన ప్రయాణాలు వాళ్ళవి. పుట్టిన చోట వదిలివచ్చిన ఆస్తులు లేవు; ఫలానిది సొంత ఊరనే మమకారం ఏర్పడలేదు. సౌకర్యం ఎక్కడ కుదిరితే అదే అప్పటి నివాసస్థానం. రుతుచక్రంలో రెండేళ్ళు గడ్డుకాలం సంభవిస్తే చాలు, ఆ మనుషులను వందలాదిమైళ్ళు ఎక్కడెక్కడికో అది నడిపిస్తుంది.
ఈ వలసలకు కారణం రెండు రకాలు. ఒకే తావులో పదేపదే కొనసాగే వేట వల్ల వనరులు తరిగిపోవడం మొదటిది. అలాంటి సందర్భంలో మూకుమ్మడిగా వాళ్లు అన్వేషిస్తూ, ఏ గుంపుకాగుంపు విడిపోవడం తప్పనిసరి. వనవాసంలో ఉన్నప్పుడు పాండవులకు కూడా ఈ పరిస్థితి తటస్థించడం మహాభారతంలో కనిపిస్తుంది. దరిమిలా ద్వైతవనం నుండి కామ్యకవనానికీ, తిరిగి కామ్యకవనం నుండి ద్వైతవనానికీ వ్యాసమహర్షి సలహా మీద నివాసం మార్చుకుంటారు.
రచన: ఎం.వి.రమణారెడ్డి