టూకీగా ప్రపంచ చరిత్ర - 41 | Encapsulate the history of the world - 41 | Sakshi
Sakshi News home page

టూకీగా ప్రపంచ చరిత్ర - 41

Published Sat, Feb 21 2015 11:28 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

టూకీగా  ప్రపంచ చరిత్ర - 41 - Sakshi

టూకీగా ప్రపంచ చరిత్ర - 41

నేరం
 
వీటన్నింటికంటే మనం ముఖ్యంగా ఆలోచించవలసింది వాళ్ళ గుడిసెల్లో కనిపించిన మట్టి పొయ్యిల గురించి, గుడిసె గుడిసెకు వేరువేరుగా సాగిన వంటావార్పులకు అవి సంకేతంగా నిలుస్తున్నాయి. అంటే, అగ్నిగుండం చుట్టూరా కూర్చుని, కలసిమెలసి భోంచేస్తూ, విడివిడి హోదాలకు తావులేని ‘సామూహిక జీవితం’ అంతరించింది అనేందుకు అవి ఆధారాలు. ఇప్పుడు ప్రతి కుటుంబానికీ ‘నాది’ అని చెప్పుకునే ఒక గుడిసె, కొన్ని పనిముట్లు, కొన్ని పశువులు - వాటాలుగా పంపకమై, అదివరకటి మానవుని ఊహకే అందని ‘సొంత ఆస్తి’కి స్వరూపం ఏర్పడింది. తద్వారా, హెచ్చుతగ్గులు లేని ఆదిమ సమాజపు గర్భంలో స్వార్థం (స్వ - అర్థం - సొంత సంపాదన), అవినీతి వంటి అనర్థాలకు హేతుభూతమైన రాక్షస పిండానికి బీజం ఏర్పడింది. ఇక ఉమ్మడి వ్యవహారంగా మిగిలినవి వ్యవసాయం, వేటామార్గం, యక్షగానాల వంటి వినోద కార్యక్రమాలు మాత్రమే.

ఎవరి కుటుంబం వాళ్ళది, ఎవరి ఆస్తి వాళ్ళది అయిన తరువాత, జనపథంలో నివసించే వ్యక్తుల మధ్య సమన్వయం ఉండేలా చూసేందుకు ఒక యంత్రాంగంతో అవసరం తన్నుకొచ్చింది. కొత్త జీవనవిధానంలో పుట్టుకొచ్చే సమస్యలకు పరిష్కారం, ఇకమీదట అలాంటివి ఉత్పన్నం కాకుండా ఉండేందుకు తగిన విధంగా చట్టాలు రూపొందించడం ఆ యంత్రాంగం నిర్వహించే కార్యక్రమం. అంటే, సంప్రదాయాల స్థానంలో వ్యవస్థీకృతమైన రాజ్యాంగానికి బీజం పడింది. సమస్యలనూ చట్టాలనూ చర్చించేందుకు పౌరగణమంతా పాల్గొనే
 సమావేశానికి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించే వృద్ధుడు ‘గణనాయకుడు’. అది కేవలం పెద్దరికం ద్వారా సంపాదించుకునే హోదా. గౌరవం మినహా గణనాయకునికి ప్రత్యేక సౌకర్యాలు అనుమతించే అలవాటు తొలిరోజుల్లో ఉండేదిగాదు. అధికారం ఎంత చిన్నపాటిదైనా మోతాదుకు తగిన ఆదాయం అందులో ఉండే వుంటుందన్న కనువిప్పుతో మానవుడు మరో మూడువేల సంవత్సరాలు తీసుకున్నాడు.
 స్థిరనివాసాలకు ఎంపిక చేసుకునే ప్రాంతాలు సహజంగా సారవంతమైనవి కావడంతో, ‘ఆత్మరక్షణ’ అనేది జనావాసాలకు ఎదురైన మరో ప్రధాన సమస్య. పంటలకూ పశుగ్రాసానికీ అనువైన నేలల మూలంగా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న సంపదను కొల్లగొట్టేందుకు నలుదిశలుగా శత్రువులు తయారయ్యారు. ఉమ్మడి జీవితం, ఉమ్మడి ఆస్తి అంతరించి, ఎవరి వ్యాపకం వాళ్ళదిగా మారిన దశలో, జనావాసం రక్షణ సమర్థులైన సభ్యులకు అప్పగించక తప్పిందిగాదు. ఇలా ఏర్పాటైన సైనిక బృందానికి నాయకుడు ‘సేనాని.’ జనపథం తీర్మానాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ సేనానిని ఆదేశించే అధికారం గణనాయకుడైన  వృద్ధునిది. సొంత వ్యాపకాలను వదిలేసి మందికోసం రక్షణ బాధ్యతలు తీసుకున్న వ్యక్తులకు పరిహారం ఏర్పాటుజేసే విషయంగా కొంత తర్జనభర్జన జరిగుంటే జరిగుండొచ్చుగానీ, ఎట్టకేలకు సర్దుబాటై, సరుకుల రూపంలో పారితోషికం ఏర్పాటైంది. ఋగ్వేదంలో కనిపించే ఇంద్రుడు, బృహస్పతులు బహుశా ఈ నాయకద్వయానికి ప్రతీకలే అయ్యుండొచ్చు.

వైదిక వాఙ్మయంలో మరో తరహా గణతంత్ర వ్యవస్థ కూడా కనిపిస్తుంది. అది కండబలం కలిగిన ఏకైక నాయకుని మీద ఆధారపడి ఏర్పడిన జనపథం. శత్రువును స్వశక్తితో మట్టిగరిపించి, ఆ నాయకుడు చుట్టుపక్కల జనాన్ని పోగుచేసుకుని ఒక వ్యవస్థను నిర్మిస్తాడు. అలాంటి జనపథానికి శాసనమూ అతడే, శాసకుడూ అతడే. ఈ తరహా పాలెగాళ్ళను ‘మనువులు’గా హిందూ మతగ్రంథాలు కీర్తించాయి. ‘మనువు’ స్వయంగా విష్ణుస్వరూపుడని హిందువుల విశ్వాసం. ఆ కారణంగానే తదుపరి పృధివీపతులుందరూ దైవాంశ సంభూతులుగా చలామణి అయ్యారు.

రచన: ఎం.వి.రమణారెడ్డి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement