జాతులు-నుడికారాలు
చిలుక వేరు పావురం వేరు. చూసీ చూడగానే చిలకేదో పావురమేదో చిన్నపిల్లలైనా చెప్పేస్తారు. అలాగే ఏది కుక్కో ఏది ఏనుగో తేలిగ్గా పోల్చుకుంటారు. అన్నీ ఒకేలా ఒకే జాతి పక్షులగుంపులోగానీ, పశువుల గుంపులోగానీ ఒకదాన్నుండి మరొకదాన్ని విడివిడిగా గుర్తించడం ఎంతో పరిచయంతో తప్ప పెద్దలకైనా సాధ్యపడదు. ఉదాహరణకు, మందంగావున్న గొర్రెలన్నీ మొదటమొదట ఒకేలా కనిపిస్తాయి. కొట్టొచ్చినట్టు కనిపించే తేడాలు ఉంటే తప్ప, దేనికి దాన్ని విడివిడిగా గుర్తించడం మనకు చేతగాదు. వాటి కాపరి మాత్రం నిత్యసాంగత్యం కారణంగా, దేనికిదాన్ని వేరువేరుగా పోల్చుకోగలడు.
మనుషుల విషయంలోనూ కొన్ని సందర్భాల్లో ఇదే తరహా అయోమయం ఏర్పడటం కద్దు. ఎంత గుంపులోనైనా ఎవరు భారతీయులో, ఎవరు యూరోపియన్లో, ఎవరు నీగ్రోలో గుర్తించడం పెద్ద కష్టంగా తోచదుగానీ, ఒకే జాతీయులైన పదిమంది విదేశీయుల్లో - వాళ్ళు నీగ్రోలే కావచ్చు, ఆంగ్లేయులే కావచ్చు, మరేజాతైనా కావచ్చు - ఏ మనిషికామనిషి విడివిడిగా పోల్చుకునేందుకు పరిచయం పెరిగిందాకా మనకు వీలుపడదు. అదే సొంతజాతి మనుషులైతే ఒకటిరెండు చూపులతో తేలిగ్గా గుర్తుండిపోతారు. దీన్నిబట్టి మనకు తెలిసొచ్చేదేమంటే - మనుషుల మధ్య పోలికల్లో వున్న తేడాల్లో కొన్ని తాటికాయంతవి కాగా, మరికొన్ని ఆవగింజ పరిమాణంలో కూడా ఉండొచ్చునని! మొత్తంమీద, వెలుపలి ఆకారంలో ఎంత వైవిధ్యం ఏర్పడినా మౌలికమైన శారీరక నిర్మాణంలో మనిషికీ మనిషికీ తేడాలు ఏర్పడకుండా ఆగిపోయిన కారణంగా, లక్షలాది సంవత్సరాల నుండి మానవజాతి ఒకే ‘స్పీసీస్’గా నిలబడిపోయింది.
‘స్పీసీస్’ అనేది జీవశాస్త్రపరమైన సాంకేతిక పదం. దీన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు పరిచితమైన జంతుజాతుల్లోకి ఒక్కసారి తొంగిచూద్దాం. కుక్కలు పెంచుకునే అలవాటు మనందరికీ లేకపోవచ్చుగానీ, ఆ అలవాటున్న స్నేహితులు ఉండేవుంటారు. సాధారణంగా ముచ్చటకోసం ఆడవాళ్ళు పెంచుకునేది ‘పొమేరియన్’ జాతి కుక్కలైవుంటాయి. వీటి శరీరం చంకలో ఇమిడేంత చిన్నదిగా ఉంటుంది. ఒళ్లంతా పొడవాటి వెంట్రుకలు ఉండడం వల్ల ముతకభాషలో వీటిని ‘బొచ్చుకుక్కలు’ అంటుంటాం. తోడేలుకుమల్లే కనిపించే మరోజాతి పెంపుడుకుక్క ‘అల్సేషన్.’ ఇలాంటి పెంపుడు కుక్కలు ఎదకొచ్చిన సమయంలో వాటి యజమానులు బెంబేలెత్తి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తుంటారు. ఈ జాగ్రత్తలు ఎందుకంటే, తమది ఎంత ఉన్నతమైన జాతికుక్కైనా, దాటేందుకు నాటుకుక్కలకు అవకాశం దొరికితే దానికి కడుపు రావడమూ తప్పదు, సంకరసంతానం కలుగకా తప్పదు. దానికి కారణం ఖరీదైన జాతికుక్కలూ, ఏమాత్రం విలువజేయని వీధికుక్కలు ఒకటే ‘స్పీసీస్’కు చెందినవి కావడం.
కుక్కను నక్కతో దాటిస్తే సంతానం కలగదు; చిరుతను పెద్దపులితో దాటిస్తే సంతానం కలుగదు. జన్యుపరమైన తేడాల మూలంగా ఇతరేతర ‘స్పీసీస్’కు చెందిన బీజంతో సంయోగాన్ని ఆడజంతువులో ఏర్పడిన అండం తిరస్కరిస్తుంది. అందువల్ల సంతానానికి ఆస్కారం లేకుండాపోయింది. అండబీజాల సంయోగానికి ఆస్కారం కలిగిన జీవులన్నీ, చూపులకు కనిపించే తేడాలకు అతీతంగా, జన్యుతారతమ్యంలేని ఒకే సమూహానికి చెందినవిగా, అంటే ఒకే ‘స్పీసీస్’గా, శాస్త్రం పరిగణిస్తుంది.ఒకే ‘స్పీసీస్’కు చెందిన వాళ్ళు కావడం మూలంగానే తెల్లటి అమెరికన్ యువతికి నల్లటి నీగ్రో పురుషునివల్ల సంతానం కలిగేందుకు జన్యుపరమైన అవరోధం లేకపోవడం.
ఒకే ‘స్పీసీస్’కు చెందిన పక్షులైతేనేమి పశువులైతేనేమి మనుషులైతేనేమి - మొత్తం ఒకే పోలికలో ఉండకుండా ఇన్ని తేడాలు ఎందుకు ఏర్పడ్డాయి? ఎందుకంటే - ఏర్పడక తప్పదుగాబట్టి. ఇంత పెద్ద భూగోళం మీద పలురకాల పరిసరాల్లో, పలుపలు వాతావరణాల్లో, పొంతనలేని పరిస్థితుల్లో, ఏ తావున నివసించే జీవి ఆ తావుకు అనుకూలంగా తన స్వరూపాన్ని మార్చుకోగలిగితేనే అది పదికాలాలు మనగలుగుతుంది. ఈ పద్ధతిని శాస్త్రంలో ‘అడాప్షన్’ అంటారు. అందుకు తిరస్కరించిన జీవి స్పీసీస్‌గా నిలబడలేక భూగోళం మీద ఉనికిని కోల్పోతుంది.
ఇంత పెద్ద భూగోళం మీద పలురకాల పరిసరాల్లో, పలుపలు వాతావరణాల్లో, పొంతనలేని పరిస్థితుల్లో, ఏ తావున నివసించే జీవి ఆ తావుకు అనుకూలంగా తన స్వరూపాన్ని మార్చుకోగలిగితేనే అది పదికాలాలు మనగలుగుతుంది. ఈ పద్ధతిని శాస్త్రంలో ‘అడాప్షన్’ అంటారు. అందుకు తిరస్కరించిన జీవి స్పీసీస్‌గా నిలబడలేక భూగోళం మీద ఉనికిని కోల్పోతుంది.
రచన: ఎం.వి.రమణారెడ్డి
టూకీగా ప్రపంచ చరిత్ర 59
Published Thu, Mar 12 2015 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM
Advertisement
Advertisement