టూకీగా ప్రపంచ చరిత్ర 75 | Encapsulate the history of the world 75 | Sakshi
Sakshi News home page

టూకీగా ప్రపంచ చరిత్ర 75

Published Mon, Mar 30 2015 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM

టూకీగా  ప్రపంచ చరిత్ర 75

టూకీగా ప్రపంచ చరిత్ర 75

ఏలుబడి కూకట్లు
 
వృత్తులవారీగా పౌరజీవితం విడిపోయి, ఏ వర్గానికావర్గం కూటమిగా ఏర్పడింది. వృత్తిపరమైన నైపుణ్యాలు ఆయా కుటుంబాలనూ, కూటములనూ దాటిపోకుండా వృత్తిరహస్యాలయ్యాయి. పరిశ్రమ ఏదైనా, నిర్వహణలో కుటుంబానికంతా భాగస్వామ్యం ఉండడం వల్ల, ఇంటికి కొత్తగా వచ్చే కోడలు కూడా ఆ వృత్తికి అలవాటుపడినదై ఉండవలసిన అవసరం వల్ల, చివరకు పెళ్లి సంబంధాలు సైతం వృత్తుల పరిధిలోకి కుదించుకున్నాయి. మారిన సామాజిక పరిస్థితులనూ, పౌరసంబంధాలనూ సమన్వయించగల కేంద్రం దేవాలయం. ఆ అర్చకుడు ఆ నగరానికి పాలకుడు. అది సహజమైన పరిణామం. ఎందుకంటే, మానవుణ్ణి సేద్యానికీ, స్థిరనివాసానికీ పురిగొల్పిన అంశాలు - సహజీవనం, సమృద్ధి, దేవుణ్ణి గురించి తలెత్తిన ఆలోచన.

 ఈ రూపంగా సంచార జీవితం నాటి ఆనవాయితీలకూ, సమిష్టి ఆలోచనలకూ శాశ్వతంగా తెర పడిపోయింది. నగరమూ, దానికి అనుబంధంగా ఉన్న కుగ్రామాలూ కలిసి ఒక ప్రామాణిక రాసి (యూనిట్). అర్చకుల నాయకత్వంలో ‘నగరపాలన’ ఏర్పడింది. మెసొపొటేమియా పీఠభూమి నిలువునా ఉనికిలోకి వచ్చిన వందలాది నగరాలన్నీ ఇదే మార్గాన్ని అనుసరించాయి. ఆ ఒక్క చోటునే కాదు, అనాది నాగరికతల్లోని అన్ని ప్రాంతాల్లోనూ ‘నగర పాలికల’తోనే ఏలుబడి ప్రారంభమయింది.

 విడిగా బ్రతికే జంతువుకున్న స్వేచ్ఛ, ఉమ్మడిలో భాగంగా బ్రతికే జంతువుకు ఉండదు. కొన్ని నిబంధనలకు అలవాటు పడితే తప్ప సహజీవనం సాధ్యపడదు. అంటే, తన స్వేచ్ఛలో కొంతభాగాన్ని వదులుకునేందుకు సిద్ధపడితే తప్ప సాంఘిక జీవనం ప్రశాంతంగా సాగదు. సమాజం పెరిగేకొద్దీ నిబంధనల సంఖ్య అనివార్యంగా పెరుగుతుంది. హక్కులతోపాటు మోపెడన్ని బాధ్యతలు కూడా ప్రవేశిస్తాయి. అర్చకుల పాలనలో స్వేచ్ఛ ఎంత కుదించుకున్నా, హక్కులకు మాత్రం భంగం కలుగలేదు. ఎవరి ఇల్లు వాళ్లకు సొంతం; ఎవరి భూమి వాళ్లకు సొంతం; ఎవరి వ్యాపారం వాళ్లకు సొంతం. కాకపోతే, పాలనకయ్యే ఖర్చుకోసం చిన్న మోతాదులో శిస్తు చెల్లించాలి. ‘శిస్తు’ అనే విధానం పరిపాలనకు తోబుట్టువు.

 మెసొపొటేమియన్ పీఠభూమిలో నివసించిన నాగరికులను ‘సుమేరియన్’ జాతిగా పేరొచ్చింది. క్రీ.పూ.40వ శతాబ్దంలో మొలకెత్తిన ఆలయ పాలన దాదాపు 1000 సంవత్సరాలు సుమేరియన్లను నడిపించింది. అంతకుమించి నిలువలేక రాచరికాలకు తలుపులు తెరిచింది. విజ్ఞానం, దేవుని మీద ప్రజలకున్న విశ్వాసం అర్చకులకుండే బలం. ఆత్మరక్షణకు యుద్ధం ఆవశ్యకమైనప్పుడు ఒక్క పిలుపుతో పౌరులందరిని అర్చకులు కూడేయగలరు. కానీ, యుద్ధతంత్రంలో ప్రావీణ్యతలేని అర్చకుల నాయకత్వంలో జరిగే పోరాటం సారంలేని చెరుకుపిప్పి.

 పరిసరాల్లోని సంచారతెగలతో చేసుకున్న ఒప్పందాల కారణంగా, యుద్ధంతో అవసరం తీరిపోయిన తరువాతి కాలం అర్చకుడు ఆలయానికే అంకితమైన వ్యక్తిగా మారిపోయాడు. కౌమారంలో అర్చకుడిగా తన జీవితాన్ని ఆలయానికి చేర్చి, దానికి సంబంధించిన తర్ఫీదుమీదనే దృష్ట కేంద్రీకరించడంతో యుద్ధతంత్ర అతని పిడికిలినుండి జారిపోయింది. దేవతలూ, దేవాలయాల సంఖ్య పెరగడంతో, ప్రజల విశ్వాసం మరో దేవునివైపు మరలకుండా, సంపూర్ణంగా అది తన దేవునికే ఉండేలా చేసుకునే తహతహవల్ల అర్చక వర్గంలో విభేదాలు తలెత్తి, ఆ వర్గాన్ని ముక్కలకింద చీల్చేసింది. అర్చకుల ఈ బలహీనతను ఆధారం చేసుకుని కండబలం కలిగిన యోధులు పరిపాలనను హస్తగతం చేసుకున్నారు. దేవుళ్ళందరికీ సమాన గౌరవం ప్రకటించి, ఏయే అర్చకుణ్ణి ఆయా దేవాలయాలకు పరిమితం చేశారు.
 
రచన: ఎం.వి.రమణారెడ్డి
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement