ఈ ఫొటోలోని వారు 11 కుటుంబాలకు చెందిన వారు. వీరికి ప్రభుత్వం 12 కిలోల చొప్పున బియ్యం అందజేసింది. అయితే ఆర్థిక సాయం ఇంకా అందలేదు. ఒక్కో కుటుంబం వద్ద కనీసం రెండు రోజులకు కూడా సరిపడా సరుకులు లేవు. అవసరమైన ఆహార పదార్థాలు లేకపోవడంతో 11 కుటుంబాలకు చెందిన సుమారు 45 మంది ఇలా ఒకే చోట వంట చేసుకుంటున్నారు. ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని అందరూ పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమ జీవనాధారమైన పెంపుడు జంతువులకు తిండి పెట్టలేని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు.
సాక్షి, జగిత్యాల: లాక్‌డౌన్ నేపథ్యంలో బుక్కెడు బువ్వ కోసం వలసజీవుల ఆకలి పోరాటం తప్పడం లేదు. చేసేందుకు పనిలేక, తినేందుకు తిండిలేక యాచకులు, సంచారజాతుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఊరూరా తిరిగి ఇంటింటికీ వెళ్లి తిండిగింజల కోసం వీరు చేసే పోరాటం లాక్‌డౌన్ నేపథ్యంలో ఆగిపోయింది. నెలరోజులుగా వీరంతా అర్ధాకలితో అలమటిస్తున్నారు.
తిండి కోసం తిప్పలు
లాక్‌డౌన్‌లో సంజారజాతులు, యాచకుల బతుకులు భారంగా మారాయి. సరిపడా తిండిగింజలు లేక నిత్యం ఆకలితో పోరాడుతున్నారు. కుటుంబం మొత్తానికి కావల్సిన బియ్యం ఇతర వంటసామగ్రి కోసం వారంతా సతమతమవుతున్నారు.
ఈ ఫొటోలోని వారు కొడిమ్యాల మండలం నర్సింహునిపల్లెకు చెందిన రాయమల్లు, సమ్మవ్వ తమ పిల్లలతో కలసి గొల్లపెల్లి మండలం చిల్వాకో డూరు శివారులోని గుడారాల్లో ఉంటున్నారు. గంగిరెద్దులు ఆడించి జీవనం గడిపే ఈ కుటుంబానికి లాక్‌డౌన్ నేపథ్యంలో నెల రోజులుగా గడ్డు పరిస్థితి నెలకొంది. నెలరోజుల కిందట అ ధికారులు పంపిణీ చేసిన బియ్యం అయిపోవడంతో మిగతా 10 కుటుంబాలతో కలసి ఒకే చోట వండుకుంటున్నారు. రోజూ ఒకే పూట తింటున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఊల్లోకి రానిస్తలేరు
నేను ఊరూరా తిరుగుతూ అద్దాలు, దువ్వెనలు అమ్ముకుంట. ఏ రోజుకారోజు తిండికి సరిపోయేది. నెలరోజుల నుంచి ఊళ్లోకి ఎవరూ రానిస్తలేరు. బియ్యం అయిపోయినయి. ఒక్క పూటనే తింటున్నం.– రాజమ్మ
Comments
Please login to add a commentAdd a comment