ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే పప్పులు, నూనెలు, ఇంధన ధరలు ఆకాశాన్నంటగా.. రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యుడికి గుదిబండగా మారుతున్నాయి. ఏ రకం కూరగాయ అయినా.. రూ.60కి తక్కువ పలకడం లేదు. దీంతో కూరగాయలు కొనాలంటే కొట్టుమిట్టాడాల్సిన దుస్థితి నెలకొంది. కరోనా సెకండ్‌వేవ్ లాక్‌డౌన్‌కు ముందు, లాక్‌డౌన్‌లోనూ అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు వారం, పదిరోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. మార్కెట్‌కు వెళ్లి వారానికి సరిపడేలా కూరగాయలు కొనుగోలు చేసేవారు.. పెరిగిన ధరలతో ఏరోజుకారోజు కొంటున్నారు. ఇంట్లో ఉన్న వాటితోనే సరిపెట్టుకుని పూటగడిపే పరిస్థితి రాగా.. వర్షాకాలం నేపథ్యంలో ఈ ధరలు మరింత పేరిగే అవకాశం ఉందని విక్రయదారులు అంటున్నారు.
తగ్గిన దిగుబడితో తంటాలు
ఉమ్మడి జిల్లాలో బోయినపల్లి, సిరిసిల్ల, వేములవాడ, కోహెడ, హుస్నాబాద్, హుజూరా బాద్, చిగురుమామిడి, తిమ్మాపూర్, చొప్పదండి, గంగాధర, జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, పెద్దపల్లి, మంథని ప్రాంతాల్లో కూరగాయలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. జిల్లాలో సగటున ఏడాదికి 75వేల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతాయి. ప్రస్తుతం స్థానికంగా దిగుబడి తగ్గడంతో హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కర్నూలు నుంచి కూరగాయులు వస్తున్నాయి. దీంతో ధరలు మండిపోతున్నాయి.
వర్షాకాలం ప్రారంభం కావడతో రైతులు పంటభూములను దుక్కిదున్నుతుంటారు. దీంతో పాతపంటను దాదాపు తీసివేస్తారు. ఈ క్రమంలో దిగుబడిపై ప్రభావం చూపుతుంది. అదే విధంగా లాక్‌డౌన్‌లో కూరగాయలు సాగుచేసిన రైతులకు నష్టాలు రావడంతో ఇప్పుడు వేరే పంటలు వేస్తున్నారు. ఇదికూడా ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేక ధరలు పెరిగాయని విక్రయదారులు, కొనుగోలుదారులు అంటున్నారు.
పక్షం రోజుల్లో రెట్టింపు ధరలు
పదిహేను రోజుల కిత్రం ఉన్న కూరగాయల ప్రస్తుతం ధరలు రెండింతలు అయ్యాయి. ప్రధానంగా పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, బీర, చిక్కుడు, గోరుచిక్కుడు, క్యాప్సికం రూ.100కు చేరువలో ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు రూ.5 పలికిన టమాట ప్రస్తుతం రూ.30కి కిలో అమ్ముడవుతోంది. వారంకిత్రం కిలో పచ్చిమిర్చి రూ.30 ఉండగా ఇప్పుడు రూ.80 పలుకుతోంది. కాకరకాయ రూ.60కి చేరింది. బెండ, చిక్కుడు, బీన్స్, వంకాయ, క్యారెట్ ఏదీ కొనేటట్టు లేదు.
ఏ కూరగాయలు కొనాలన్నా కిలో రూ.50, అంతకంటే ఎక్కువే. ఉల్లిగడ్డ మొన్నటి వరకు కిలో రూ.14, 15 ఉండగా.. ఇప్పుడు 30 అయ్యింది. ఎండకాలంలో వేసిన పంట ఉత్పత్తుల దిగుబడులు తగ్గడం, వర్షాకాలానికి ముందు వేసిన దిగుబడులు రావడానికి మరో పదిహేను రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో ఇప్పట్లో కూరగాయల ధరలు దిగి వచ్చే పరిస్థితి లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు కూడా పొదుపుగా కూరగాయలు కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment