vigitables
-
వామ్మో.. ఠారేత్తిస్తున్న ధరలు.. పక్షం రోజుల్లో డబుల్..
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే పప్పులు, నూనెలు, ఇంధన ధరలు ఆకాశాన్నంటగా.. రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యుడికి గుదిబండగా మారుతున్నాయి. ఏ రకం కూరగాయ అయినా.. రూ.60కి తక్కువ పలకడం లేదు. దీంతో కూరగాయలు కొనాలంటే కొట్టుమిట్టాడాల్సిన దుస్థితి నెలకొంది. కరోనా సెకండ్‌వేవ్ లాక్‌డౌన్‌కు ముందు, లాక్‌డౌన్‌లోనూ అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు వారం, పదిరోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. మార్కెట్‌కు వెళ్లి వారానికి సరిపడేలా కూరగాయలు కొనుగోలు చేసేవారు.. పెరిగిన ధరలతో ఏరోజుకారోజు కొంటున్నారు. ఇంట్లో ఉన్న వాటితోనే సరిపెట్టుకుని పూటగడిపే పరిస్థితి రాగా.. వర్షాకాలం నేపథ్యంలో ఈ ధరలు మరింత పేరిగే అవకాశం ఉందని విక్రయదారులు అంటున్నారు. తగ్గిన దిగుబడితో తంటాలు ఉమ్మడి జిల్లాలో బోయినపల్లి, సిరిసిల్ల, వేములవాడ, కోహెడ, హుస్నాబాద్, హుజూరా బాద్, చిగురుమామిడి, తిమ్మాపూర్, చొప్పదండి, గంగాధర, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, పెద్దపల్లి, మంథని ప్రాంతాల్లో కూరగాయలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. జిల్లాలో సగటున ఏడాదికి 75వేల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతాయి. ప్రస్తుతం స్థానికంగా దిగుబడి తగ్గడంతో హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కర్నూలు నుంచి కూరగాయులు వస్తున్నాయి. దీంతో ధరలు మండిపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభం కావడతో రైతులు పంటభూములను దుక్కిదున్నుతుంటారు. దీంతో పాతపంటను దాదాపు తీసివేస్తారు. ఈ క్రమంలో దిగుబడిపై ప్రభావం చూపుతుంది. అదే విధంగా లాక్డౌన్లో కూరగాయలు సాగుచేసిన రైతులకు నష్టాలు రావడంతో ఇప్పుడు వేరే పంటలు వేస్తున్నారు. ఇదికూడా ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేక ధరలు పెరిగాయని విక్రయదారులు, కొనుగోలుదారులు అంటున్నారు. పక్షం రోజుల్లో రెట్టింపు ధరలు పదిహేను రోజుల కిత్రం ఉన్న కూరగాయల ప్రస్తుతం ధరలు రెండింతలు అయ్యాయి. ప్రధానంగా పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, బీర, చిక్కుడు, గోరుచిక్కుడు, క్యాప్సికం రూ.100కు చేరువలో ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు రూ.5 పలికిన టమాట ప్రస్తుతం రూ.30కి కిలో అమ్ముడవుతోంది. వారంకిత్రం కిలో పచ్చిమిర్చి రూ.30 ఉండగా ఇప్పుడు రూ.80 పలుకుతోంది. కాకరకాయ రూ.60కి చేరింది. బెండ, చిక్కుడు, బీన్స్, వంకాయ, క్యారెట్ ఏదీ కొనేటట్టు లేదు. ఏ కూరగాయలు కొనాలన్నా కిలో రూ.50, అంతకంటే ఎక్కువే. ఉల్లిగడ్డ మొన్నటి వరకు కిలో రూ.14, 15 ఉండగా.. ఇప్పుడు 30 అయ్యింది. ఎండకాలంలో వేసిన పంట ఉత్పత్తుల దిగుబడులు తగ్గడం, వర్షాకాలానికి ముందు వేసిన దిగుబడులు రావడానికి మరో పదిహేను రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో ఇప్పట్లో కూరగాయల ధరలు దిగి వచ్చే పరిస్థితి లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు కూడా పొదుపుగా కూరగాయలు కొంటున్నారు. చదవండి: సూది గుచ్చడంలో తేడాతో రక్తంలో గడ్డలు! -
వరల్డ్‌కప్ విన్నర్.. నేడు కూరగాయల వ్యాపారి
అహ్మదాబాద్ : ప్రాణాంతక కరోనా వైరస్ పౌరుల జీవితాలను అతలాకుతలం చేసింది. ప్రతి ఒక్కరిపై ఏదో ఒక విధంగా తన ప్రభావాన్ని, ప్రతాపాన్ని చూపిస్తోంది. వైరస్ ధాటికి ఎంతో మంది జీవితాలు తలకిందులు అయ్యాయి. బడా వ్యాపారుల నుంచి బడ్డీ కొట్టు చిరు వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరు తీవ్ర నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితిని కరోనా కల్పించింది. ఈ క్రమంలోనే భారత అందుల క్రికెట్ జాతీయ జట్టుకుప్రాతినిధ్యం వహించిన ఓ క్రికెటర్‌ను సైతం కోవిడ్ తన ప్రతాపానికి లొంగదీసుకుంది. కోవిడ్ ధాటికి క్రికెటర్ కాస్తా.. కూరగాయల వ్యాపారిగా అవతారం ఎత్తాడు. ఓ జాతీయ మీడియా శుక్రవారం ప్రచురించిన కథనం ప్రకారం.. నరేష్ తుంబ్డా (29) అంధుల క్రికెట్ జట్టులో సభ్యుడు. 2018లో షార్జా వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లో నరేష్ కీలక పాత్ర పోషించాడు. లీగ్‌లో ప్రధానంగా పాకిస్తాన్‌తో జరిగిన కీలక ఫైనల్ పోరులో భారత్ విజయం సాధించి ప్రపంచ కప్ గెలవడంలో ముఖ్యభూమిక పోషించాడు. దీంతో అతని పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. అంతా బాగానే సాగుతున్న క్రమంలో కరోనా అతని జీవితంలోకి అనుకోని అతిథిలా వచ్చింది. కరోనా విపత్తు కారణంగా క్రికెట్‌కు తాత్కాలిక బ్రేక్ పడటంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఇక చేసేదేం లేక కుటుంబ సభ్యుల సహకారంతో కూరగాయల వ్యాపారం ప్రారంభించాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో గల జమల్పూర్ మార్కెట్ అతని వ్యాపారానికి వేదికైంది. అతని ధీన పరిస్థితిని చూసి అనేక మంది చలించిపోతున్నారు. భారత క్రికెట్ యాజమాన్యం నరేష్‌ను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
నిలకడగా కూరగాయల ధరలు
తాడేపల్లిగూడెం : ఉల్లిపాయలు మార్కెట్లో కాస్త ఘాటెక్కించినా, కూరగాయలు ధరల విషయంలో వినియోగదారుల పక్షాన నిలిచాయి. నగదులావాదేవీలపై కొనుగోళ్లు, అమ్మకాలు ప్రభావం పడినా సరుకులు భారీగానే మార్కెట్‌కు వచ్చాయి. తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్లో ఆదివారం ధరలు ఇలా ఉన్నాయి. కర్నూలు రకం ఉల్లిపాయలు 80 లారీల సరుకు మార్కెట్‌కు వచ్చింది.క్వింటాల్ రూ.900 వరకు అమ్మారు. మహారాష్ట్ర ఉల్లిపాయలు కేవలం మూడు లారీలు మాత్రమే వచ్చాయి. వీటి ధర క్వింటాల్ రూ.1,200 పలికింది. విడిగా కిలో రూ.15 నుంచి రూ.20 వరకు విక్రయించారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లిపాయల లావాదేవీలకు బ్రేక్ పడింది.నాలుగు రోజుల పాటు అక్కడ యార్డులకు సెలవులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా వ్యాపారులు చెబుతున్నారు. అందుబాటులో కూరగాయల ధరలు కూరగాయల ధరలు ఈ వారం అందుబాటులోనే ఉన్నాయి. వంకాయలు కిలో రూ.30, నల్లవంకాయలు రూ.24, బెండకాయలు రూ.24, బీరకాయలు రూ.30, దోసకాయలు రూ.20, దొండకాయలు రూ.12, కంద రూ.30, కాకరకాయలు రూ.20 విక్రయించారు. ఆకాకరకాయలు రూ.32లకు అమ్మారు. క్యారట్ రూ.40, బీట్రూట్ రూ.30, క్యాప్సికం, బీన్స్ రూ.60, కీరా రూ.30, చిలకడదుంపలు కిలో రూ.24కు విక్రయించారు. క్యాబేజీ రూ.20, టమాటాలు కిలో రూ.15 నుంచి రూ. 20 చేసి అమ్మారు. -
మార్కెట్‌ను ముంచెత్తిన బీరకాయలు
తాడేపల్లిగూడెం : బీరకాయలు మార్కెట్‌ను ముంచెత్తాయి. దీంతో ధర బాగా తగ్గింది. ఆదివారం తాడేపల్లిగూడెం మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. వారం రోజుల క్రితం కిలో రూ.40 పలికిన బీరకాయలు కిలో రూ.20కి పడిపోయింది. నాసిరకం బీరకాయలు కిలో రూ.8కే లభించాయి. బెండకాయలు కిలో రూ. 12 , దొండకాయలు రూ.24కి అమ్మారు. క్యాబేజీ, దోసకాయలు కిలో రూ.12, కంద కిలో రూ.24కి అమ్మారు. టమాటాలు కిలో రూ.12, బీట్రూట్ కిలో రూ.24కు లభించింది. క్యాప్సికం కిలో రూ.120, బీన్స్ కిలో రూ.80కి విక్రయించారు. కీరా కిలో రూ.32, నాటురకం చిక్కుడుకాయలు కిలో రూ.80, ఇతర రకం చిక్కుడుకాయలు కిలో రూ.16కు లభించాయి. గోరు చిక్కుళ్లు రూ.24, క్యారట్ రూ.40కి విక్రయించారు. తెల్ల వంకాయలు రూ.40, నల్ల వంకాయలు రూ.30కి లభ్యమయ్యాయి. ఉల్లిపాయలు నాలుగు కిలోలు రూ.50కే అమ్మారు. కర్నూలు నుంచి కొత్త ఉల్లిపాయలు వచ్చాయి. 40 లారీల సరుకు వచ్చింది. గుత్తగా క్వింటాలు రూ.400 నుంచి రూ.850 చేసి అమ్మకాలు సాగించారు. పాతరకం మహారాష్ట్ర ఉల్లిపాయలు కిలో రూ.16 చేసి విక్రయించారు. గుత్తగా క్వింటాల్ ఈ రకం ఉల్లిపాయలు రూ. 600 నుంచి రూ.1,200 విక్రయించారు. బంగాళాదుంపలు కిలో రూ.24 పలికాయి.