టూకీగా ప్రపంచ చరిత్ర 80
ఏలుబడి కూకట్లు
పర్షియా సువిశాలమైన ప్రదేశమేగానీ, రాతిగుట్టల మూలంగా పచ్చిక బయళ్లు తక్కువ. ఇక్కడి నుండి పడమటికి సాగాలంటే, జాగ్రోస్ పర్వతపంక్తి అడ్డగిస్తుంది. దాన్ని దాటుకున్నా అప్పటికే బలమైన రాజ్యాధికారంగా ఎదిగిన సుమేరియన్లను అక్కడ ఎదుర్కోవాలి. దానికంటే, తూర్పు దిశగా ఉన్న సింధుస్థాన్ (ఇప్పటి ఆఫ్గనిస్థాన్, పడమటి పాకిస్థాన్‌లు) అనువైనదిగా ఆర్యులు ఎంచుకున్నారు. క్రీ.పూ. 1500 ప్రాంతంలో ఆ దిశగా సాగిన ఆర్యులు, స్థానిక ప్రజలతో యధేచ్ఛగా మమేకమౌతూ సింధూనదిని చేరుకున్నారు. నడుమ నడుమ నాగరికతకు ఎదగని ఆటవికులతో అక్కడక్కడ ఇబ్బందులు ఎదురైవుండొచ్చు. మహాభారతంలో భీమసేనుడు రాక్షసకన్య హిండిబిని పెళ్లాడిన రీతిలో కయ్యము, వియ్యాలతో ఆర్యులు ఆ సమస్యలు ఎదుర్కొంటూ సింధూనది వరకు వేగంగా విస్తరించారు. ఈ పరిణామం గమనిస్తే, సింధూనాగరికత అంతరించిపోయేందుకు కారణం వాతావరణంలో వచ్చిన మార్పువల్ల భూములు బీడుపడటంగా కొందరు చేస్తున్న వాదనగూడా వాస్తవం కాదని తెలుస్తుంది. అదే నిజమైతే, పచ్చికబయళ్లకోసం పాకులాడే ఆర్యులు ఇటువైపుగా విస్తరించే అవసరమే ఉండేదిగాదు.
వేదంలో తొలుత సూచనప్రాయంగా కనిపించే వ్యవసాయానికి తరువాతి కాలంలో ప్రాముఖ్యత పెరగడం గమనిస్తే, సింధూపీఠభూమికి చేరిన ఆర్యులు వ్యవసాయంలో దిగినట్టు అర్థమౌతుంది. అప్పుడుగాని వాళ్లకు సేవకులతోనూ బానిసలతోనూ అవసరం ఏర్పడలేదు. పరిమితమైన వ్యాపారం, వ్యవసాయాలతో ఆర్యన్ భారతీయుల్లో వర్ణవ్యవస్థ సంపూర్ణంగా చోటుచేసుకుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు గోత్రాలుగా విభజించబడిన ఆర్యులుగానూ, సేవకులుగా వినియోగించుకునే శూద్రులు కులాలవారీగా విభజింపబడిన అనార్యులుగానూ కాలక్రమంలో స్థిరపడినట్టు అర్థమౌతుంది.
వ్యవసాయం అనగానే స్థిరనివాసం తప్పనిసరి. ఆ అవసరం ఏర్పడినప్పుడు కూడా ఆర్యులు అదివరకటి వాళ్లు వదిలిపోయిన గృహాలను ఆక్రమించలేదు. వాళ్లు ఏ కారణంగా వాటిని బహిష్కరించారో ఊహించడం కష్టం. గ్రామాలుగా స్థిరపడిన ఆర్యులు మట్టిగుడిసెలతోనే గడుపుకున్నారు. యమునా, గంగా తీరాలకు విస్తరించిన తరువాత కూడా, పౌరాణిక గాథల్లో వినిపించే నగరాలూ, చక్రవర్తులు మినహా, ఆర్యులకు నగరాలున్నట్టు నిరూపించే ఆధారాలు కనిపించవు.
ఒకప్పుడు సింధూనదికి తూర్పున మొదలై, ఉత్తరావర్తమంతా విస్తరించిన ‘ద్రవిడ నాగరికత’ ఒకటుండేదనీ, ఆర్యులు వాళ్లను దక్షిణాదికి తరిమేసి ఉత్తరాపథం ఆక్రమించారనీ, ఒక కొత్త వాదన ఇటీవల ముమ్మరంగా ప్రచారమైంది. క్రీ.పూ. 8వ శతాబ్దం దాకా ఉత్తరావర్తంలో నగరాల ఆనవాళ్లే చరిత్రకు అందనప్పుడు, ఏదో నాగరికత అక్కడ గొప్పదశలో ఉండేదని వాదించడం ఊహకు అతీతమైన తర్కం. పురాణాల్లో కనిపించే ‘హస్తినాపురం’, ‘ఇంద్రప్రస్థం’ వంటి పట్టణాలను వదిలేస్తే, క్రీ.పూ. 6వ శతాబ్దంలో అక్కడ మగధ, కోసల, కాశీ, వత్స, అంగ, పాంచాల, అవంతి, విదర్భ, గాంధార, కాంభోజ వంటి కొన్ని రాజ్యాలూ, శాక్య, మల్ల, వృజి, లిచ్ఛవి వంటి కొన్ని గణతంత్రాలూ ఏర్పడివున్నట్టు సమకాలీన సాహిత్యం ద్వారా తెలుస్తూంది.
పేరుకు రాజ్యాలేగానీ, చెప్పుకోదగ్గ వైశాల్యం కలిగినవిగా ఇవి కనిపించవు. ఆ శతాబ్దం చివరిలో (బహువా క్రీ.పూ. 580 ప్రాంతంలో) కాశీ, కోసల రాజ్యాలనూ, వృజి గణతంత్రాన్నీ హస్తగతం చేసుకుని, విశాలంగా విస్తరించిన మొట్టమొదటి సామ్రాజ్యం మగధ. కట్టుకథలను దాటిన వాస్తవచరిత్ర భారతదేశానికి ఇక్కడ మొదలౌతుంది. ‘రాజగృహ’ పట్టణం రాజధానిగా, ‘హర్యాంక’ వంశానికి చెందిన ‘బింబిసారుడు’ మొదటి చక్రవర్తిగా మగధ సింహాసనం అధిరోహించాడు.
చైనా చరిత్ర గూడా మనదానికి మల్లే పురాణ చక్రవర్తులతో మొదలౌతుంది. ఆధారాలులేని ఐదుగురు చక్రవర్తులూ, గ్జియా వంశాలను వదిలేస్తే, ‘షాంగ్’ వంశంతో వాస్తవ చరిత్ర మొదలౌతుంది. క్రీ.పూ. 1750 ప్రాంతంలో వీళ్ల పాలన మొదలైన తరువాత, పోగు తెగకుండా చైనా రాచరికచరిత్ర ఆనవాళ్లతో కొనసాగుతుంది. కనీసం క్రీ.పూ. 200 వరకూ ఆ రాజులు పాలించినవి ఒక మోస్తరు భూ భాగాలే తప్ప, సామ్రాజ్యాలని పిలిచేందుకు వీలుపడేది కాదు.
ఒకప్పుడు సింధూనదికి తూర్పున మొదలై, ఉత్తరావర్తమంతా విస్తరించిన ‘ద్రవిడ నాగరికత’ ఒకటుండేదనీ, ఆర్యులు వాళ్లను దక్షిణాదికి తరిమేసి ఉత్తరాపథం ఆక్రమించారనీ, ఒక కొత్త వాదన ఇటీవల ముమ్మరంగా ప్రచారమైంది. క్రీ.పూ. 8వ శతాబ్దం దాకా ఉత్తరావర్తంలో నగరాల ఆనవాళ్లే చరిత్రకు అందనప్పుడు, ఏదో నాగరికత అక్కడ గొప్పదశలో ఉండేదని వాదించడం ఊహకు అతీతమైన తర్కం.
రచన: ఎం.వి.రమణారెడ్డి