ఇంజినీరు - ఇంగ్లిషు పంచాంగం | Engineer - English.The calendar | Sakshi
Sakshi News home page

ఇంజినీరు - ఇంగ్లిషు పంచాంగం

Published Mon, Aug 25 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM

ఇంజినీరు - ఇంగ్లిషు పంచాంగం

ఇంజినీరు - ఇంగ్లిషు పంచాంగం

 తిథి వార నక్షత్రాలు... రాశి ఫలాలు...
 ముహూర్తాలు... రాహు కాలాలు...
 వర్జ్యాలు... యమగండాలు...
 తెలుగు, సంస్కృత భాషల అక్షరాలకు
 అంకెలు జత చేరడం...
 ఇదీ స్థూలంగా పంచాంగం...
 మరి ఇందులో తెలుగు, సంస్కృతాల స్థానంలో
 ఆంగ్ల అక్షరాలు ప్రవేశిస్తే ఎలా ఉంటుంది..?
ఈ ఆలోచనే ఆంగ్ల పంచాంగ రూపకల్పనకు నాంది పలికింది. దీనిని రూపొందించినది ఇంజనీరింగ్ చదివిన యువకుడు కావడం విశేషం...

 
భారతీయ సంప్రదాయ, శాస్త్రీయ విద్యా విషయ విజ్ఞానం పట్ల విదేశీయులకు అవగాహన కలిగించాలనే లక్ష్యంతో 25వ ఏటనే ఆంగ్ల పంచాంగాన్ని రూపొందించడం ప్రారం భించారు శర్మ. సంస్కారానికి పర్యాయ పదాలైన మంచిచెడులను నిర్థారించే పంచాంగాన్ని విశ్వమంతటికీ అర్థ మయ్యేలా తయారుచేసి ‘ఔరా’ అనిపించుకున్నారు రాజమండ్రికి చెందిన ఈ 28 ఏళ్ల  యువ ఇంజనీర్ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.
 
ఈ ఆలోచన వెనుక...

భద్రాచలంలో బీటెక్ పూర్తిచేసిన శర్మ, ఎంటెక్ చేసేందుకు 2007లో డెహ్రాడూన్ పెట్రోలియం యూని వర్శిటీలో ఆయిల్ అండ్ గ్యాస్, పైప్‌లైనింగ్ కోర్సు పూర్తి చేశారు. చదువుకుంటూనే, వీలు చిక్కినప్పుడల్లా, దేశ సంస్కృతిని అధ్యయనం చేసేందుకు యాత్రలు చేశారు. అలా బదరీనాథ్, కేదారనాథ్‌లను సందర్శించినప్పుడు ఏదో మధురానుభూతిని పొందారు. సరిగా ఆ సమయం లోనే పలువురు విదేశీయులతో పరిచయం ఏర్పడింది.

‘‘నేను కలిసిన ఎందరో విదేశీయులు... మన పంచాగం, ముహూర్తాలు, వాస్తు ఇవన్నీ మూఢ నమ్మకాలంటూ చులకనగా మాట్లాడారు. వారి మాటలకు నా మనసు బాధపడింది. మన దేశ గొప్పదనం గురించి వాళ్లకు ఏదో ఒక విధంగా తెలియచెప్పాలనుకున్నాను. అందుకు నేను ఎంచుకున్న మార్గం పంచాంగం. అందరికీ చేరువ కావాలంటే పంచాంగం ఆంగ్లంలో ఉండాలని భావించి, ఆ భాషలో రచనకు పూనుకున్నాను’’ అంటూ తన ఆలోచన వెనుక ఉన్న విషయాన్ని వివరించారు శర్మ.
 
ప్రారంభంలో...
 
2008లో ఆంగ్లంలో పంచాంగ రచనకు పూనుకొన్న ప్పుడు శర్మ ఎందరో పెద్దల నుంచి విమర్శలు ఎదుర్కొ న్నారు. పంచాంగం అనేది చాలా మంది రాస్తున్నారు కదా! ‘అందులో నుంచి కాపీ చేసి ఇందులో పేస్ట్ చేయడమే కదా!’ అని చులకనగానూ మాట్లాడారు. అయినప్పటికీ పట్టువదలని దీక్షతో తన రచన కొనసాగించి, 2011 నాటికి పంచాంగాన్ని పూర్తి చేశారు. ‘‘నన్ను ఎందరో విమర్శిస్తున్న తరుణంలో నా తల్లి భానుమతి, (ర్యాలి ప్రభుత్వ పాఠశాలలో సంస్కృతం టీచర్), భార్య పూర్ణిమ (బీటెక్ కంప్యూటర్స్) మా అత్తగారు కృష్ణప్రియ ముగ్గురూ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వారి వల్లే నేను పంచాంగం నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగాను.

మా అమ్మగారి ఆశీస్సులతో... నేను ఆరాధించే శ్రీరాముని సన్నిధి భద్రాచలంలో ఈ పంచాంగాన్ని ఆవిష్కరించాను. నాటి నుంచి ఏటేటా ఆంగ్ల పంచాంగాన్ని విడుదల చేస్తూ వస్తున్నాను. ప్రతి సంవత్సరం కొత్త అంశాలు జోడిస్తున్నాను. తాజా పంచాంగంలో సామాన్యులు సైతం వారికి వారు ముహూర్తాలు ఎలా పెట్టుకోవచ్చో తెలుసు కునేలా విపులీకరించాను. ఇంకా గోచారరీత్యా ఎవరు ఏ దేవుని ప్రార్థించాలో సూచించడమే కాకుండా, చేయాల్సిన ప్రార్థన వివరాలు కూడా పొందుపరిచాను’’ అని తన పంచాంగం గురించి వివరించారు శర్మ.
 
యువత కోసం...
 
నేటి యువత మన సంస్కృతి సంప్రదాయాలను మరచి పోతోంది. వారికి వాటి గురించి చెప్పాలను కున్నాను. ఆంగ్లం అయితే యువత తొందరగా చదువు తారు కనుక, వారికోసం సరళమైన భాషలో పంచాంగాన్ని రాయాలనుకున్నాను. ‘‘కొన్ని సంస్కృత పదాలకు ఆంగ్ల పదాలు ఉండవు. అలా లేని పదాలను, కొన్ని సంస్కృత శ్లోకాలను యథాతథంగా ఉంచేశాను. అవసరమైన చోట సైంటిఫిక్‌గా కూడా చెప్పాను’’ అని చెబుతున్న శర్మ, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా వాస్తు విషయాంశాలపై ఆంగ్లంలో ఒక పుస్తకాన్ని అచ్చు వేసేందుకు సిద్ధమవుతున్నారు. భద్రాచలం తిరుమల పీఠం ద్వారా ‘జ్యోతిష మార్తాండ’ పురస్కారాన్ని అందు కున్నారు ఈ యువ ఇంజినీరు. శర్మ రూపొందించిన ఆంగ్ల పంచాంగం తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడం విశేషం.
 
- డి.సూర్యనారాయణమూర్తి, సాక్షి, రాజమండ్రి
 ఫొటో: టి.కె.ధనంజయ, సాక్షి, బెంగళూరు

 
సంస్కృత నేపథ్యం...

భద్రాచలంలో బీటెక్ చదువుతున్న రోజుల్లో అక్కడే సంస్కృతం చదువుకున్నాను. సిద్ధాంత భాగంలో విద్యాభూషణ్  చేశాను. ప్రస్తుతం ‘వాస్తు ఫర్ కామన్ మ్యాన్’ అని పుస్తకం రాస్తున్నాను. మా గురువులు శ్రీమన్నారాయణాచార్యుల దగ్గర వాస్తు, పంచాంగం తదితర అంశాలపై కూలంకషంగా అధ్యయనం చేశాను. పంచాంగ రచనకు అవసరమైన సలహాలు తీసుకున్నాను. అలాగే వచ్చే సంవత్సరం ప్రచురించనున్న ఆంగ్ల పంచాంగంలో మరిన్ని కొత్త అంశాలను చేర్చే ఆలోచనలో ఉన్నాను. ఆన్‌లైన్‌లో ఆంగ్ల పంచాంగం కోసం http:// chilakamarthi.com/(చిలకమర్తి.కామ్) వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
 
- చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement