హోమియో కౌన్సెలింగ్
మా పాపకు ఆరేళ్లు. తనకు తరచు ముక్కునుంచి రక్తం వస్తుంటుంది. ఇటీవల కొంతకాలంగా మలంలో కూడా ర క్తం పడుతోంది. డాక్టర్‌కు చూపించి, మందులు వాడుతున్నాము కానీ పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు.
- ఎన్.పుష్పకుమారి, ఆదోని
పిల్లలలో ముక్కు నుంచి రక్తం పడటమనేది తరచు కనిపించేదే. ఈ సమస్య ముఖ్యంగా వేసవి, చలికాలాలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని ఎపిస్టారిస్ అంటారు. ఇంటి వాతావరణం వేడిగా లేదా చల్లగా పొడిగా తయారైనప్పుడు ముక్కురంధ్రాలు పొడిబారి చర్మం చిట్లుతుంది. చిన్నపిల్లలు ముక్కులో వేళ్లుపెట్టి కెలుక్కుంటూ ఉంటారు. దీనివల్ల ముక్కురంధ్రాలలో ఉన్న సున్నితమైన రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం జరగవచ్చు. అదేవిధంగా అలర్జీలు వచ్చినప్పుడు లేదా జలుబు చేసినప్పుడు గట్టిగా తుమ్మటం, ముక్కు చీదటం, ముక్కుకు బలమైన దెబ్బ తగలటం, ముక్కులో బలపాలు, పెన్సిళ్లు వంటివి పెట్టుకోవడం వల్ల కూడా ఇలా జరగవచ్చు.
నివారణ: ఇటువంటప్పుడు కంగారు పడి, ముక్కులో గుడ్డలు అవీ పెట్టడం, కదలకుండా పడుకోబెట్టడం వల్ల సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది. మాడు మీద చెయ్యి పెట్టి గట్టిగా ఒత్తిపట్టుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. ముక్కులో వేళ్లు పెట్టుకోనివ్వకూడదు. గోళ్లు పెరగకుండా చూడాలి. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు కొబ్బరినూనె రాయడం మంచిది.
మలంలో రక్తం పడటానికి కారణాలు
మలద్వారం వద్ద చీలిక (ఫిషర్): ముఖ్యంగా చిన్నపిల్లల్లోనూ, పెద్దవాళ్లలోనూ ఇలా జరగడానికి కారణం మలబద్ధకం. గట్టిగా ముక్కడం వల్ల కింది భాగంలోని పేగుల నుంచి రక్తస్రావం జరగవచ్చు. అలాగే పిండదశలో ఉన్నప్పుడు తల్లి బొడ్డునుంచి గర్భస్థ శిశువు పేగుల్లోకి వెళ్లే నాళ్ల మూసుకు పోవడం వల్ల పేగుల్లో తిత్తులు ఏర్పడవచ్చు. చిన్నపేగుల్లో అల్సర్స్, పేగు చొచ్చుకురావడం, ఒక పేగులోని కొంత భాగం మరో పేగులోకి చొచ్చుకుపోతుంది. జువైనల్ పాలిప్స్: పేగుల్లో పిలకలు; రక్తనాళాల్ల లోపాలు, పేగుల్లో వాపు.
హోమియోవైద్యం: చిన్నపిల్లల్లో రక్తస్రావ సమస్యలకు హోమియోలో అద్భుతమైన మందులున్నాయి. వ్యాధి కారణాలు, లక్షణాలు, పిల్లల మానసిక, శారీరక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని కాన్‌స్టిట్యూషనల్ విధానం ద్వారా వైద్యం చేస్తారు. దీనివల్ల ఎటువంటి దుష్ఫలితాలూ తలెత్తకుండా ఎలాంటి శస్త్రచికిత్సలూ అవసరం లేకుండా వ్యాధి సమూలంగా తగ్గిపోతుంది. సమీపంలో ఉన్న మంచి అనుభవజ్ఞుడైన హోమియో వైద్యుని సంప్రదించండి.
-డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్,
హైదరాబాద్
న్యూరో కౌన్సెలింగ్
మా అబ్బాయికి 15 ఏళ్లు. వాడికి చిన్నప్పట్నుంచీ మూర్ఛ వ్యాధి ఉంది. చికిత్స చేయిస్తున్నాం. అయితే గత ఆరు నెలలుగా మూర్ఛ రావడం ఆగిపోయింది. దాంతో మందులు నిలిపివేశాం. ఇటీవల మా బాబుకు స్కూల్లో మళ్లీ మూర్ఛ వచ్చింది. ఒకసారి తగ్గిన తర్వాత కూడా మూర్ఛ వ్యాధి మళ్లీ వస్తుందా? మా బాబుకు సరైన, శాశ్వతమైన పరిష్కారం చూపించగలరు.
- లక్ష్మి, విజయవాడ
మీ బాబుకు మూర్ఛ తగ్గిందనుకొని మీరు మందులు వాడటం ఆపివేశారు. కానీ మీ బాబుకు మూర్ఛ వ్యాధి పూర్తిగా నయం కాలేదు. వ్యాధి కొద్దిగా తగ్గినట్లు అనిపించగానే చాలామంది మందులు వాడటం ఆపేస్తుంటారు. కానీ అది మంచిది కాదు. మూర్ఛవ్యాధికి దీర్ఘకాలిక చికిత్స అవసరం. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ మందులు వాడటం ద్వారా మూర్ఛను అదుపులో ఉంచుకోవచ్చు. మూర్ఛలో చాలా రకాలు ఉంటాయి. వ్యాధి తత్వం, రోగి వయసు, ఇతర పరిస్థితులపై... దానికి అందించాల్సిన చికిత్స ఆధారపడి ఉంటుంది.
మూర్ఛ ఉన్నవారు వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ, క్రమం తప్పకుండా మందులు వాడాలి. మీ బాబుకు మూర్ఛవ్యాధి ఎందుకు వస్తుందో తెలుసుకొని, అందుకు అనుగుణంగా చికిత్స పొందడం ఎంతో ముఖ్యం. ఒకవేళ మీ బాబుకు ఉన్న మూర్ఛ రకానికి సర్జరీ అవసరమని వైద్యులు సూచిస్తే, అప్పుడు శస్త్రచికిత్సతో దానికి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. సర్జరీ అవసరం లేకుండా మందులు వాడమని సలహా ఇస్తే, వారు సూచించిన విధంగా, మందులు మానేయకుండా, డాక్టర్లు చెప్పేవరకు వాటిని వేసుకోవాలి.
ఒకవేళ ఒకపూట మందులు వేసుకోవడం మరచిపోయినా, ఏదైనా కారణాలతో వేసుకోలేకపోయినా, గుర్తుకు రాగానే రెట్టింపు మందులు (ఇది డాక్టర్ సూచన మేరకు మాత్రమే) వేసుకోవాలి. వైద్యులను సంప్రదించకుండా మీ అంతట మీరు మందులను ఎట్టిపరిస్థితులలోనూ నిలిపివేయవద్దు. మూర్ఛ అనేది అదుపులో ఉంచుకోదగిన వ్యాధి. క్రమం తప్పకుండా మందులు వాడితే మూర్ఛ ఉన్నవారు కూడా అందరిలాగే సాధారణ జీవితం గడపగలుగుతారు.
మూర్ఛ వ్యాధి ఉన్నవారు కాంతిమంతమైన వెలుగు ఉన్న చోట ఉండకూడదు. కంప్యూటర్, ల్యాప్‌టాప్ ముందు ఎక్కువ సమయం గడపడం మంచిది కాదు. ధ్వనులకు దూరంగా ఉండాలి. కార్లు, ద్విచక్రవాహనాలు నడపకూడదు. స్విమ్మింగ్ చేయకూడదు. ఎత్తులకు ఎక్కడం అంత మంచిది కాదు.
-డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం
సీనియర్ న్యూరో సర్జన్
యశోద హాస్పిటల్స్,సికింద్రాబాద్
యాండ్రాలజీ కౌన్సెలింగ్
నాకు 20 ఏళ్లు. నేను ఏడేళ్ల నుంచి హస్తప్రయోగం చేస్తున్నాను. రోజుకు కనీసం ఒకసారైనా హస్తప్రయోగం చేసుకుంటాను. ఈమధ్య ఎంతగా ప్రయత్నించినా నాకు అంగస్తంభన కలగడం లేదు. సెక్స్ మూడ్ కూడా రావడం లేదు. పైగా పురుషాంగం మీద నరాలు పైకి తేలి కనిపిస్తున్నాయి. సెక్స్‌కు, పెళ్లికి పనికిరానేమో అని ఆందోళనగా ఉంది. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు.
- ఆర్.వి.కె.ఎమ్., చిట్యాల
పురుషాంగం మీద నరాలు కనిపించడానికీ, అంగస్తంభనకూ ఎలాంటి సంబంధం లేదు. వాస్తవానికి పురుషాంగం లోపల ఉండే కండరాల్లోకి రక్తం ప్రవహించడం వల్ల అంగస్తంభన జరుగుతుంది. ఆ ప్రక్రియకూ, పురుషాంగం పైన కనిపించే నరాలకు అస్సలు సంబంధం లేదు. మీలాగే దాదాపు యువకులందరూ యుక్తవయసుకు రాగానే హస్తప్రయోగం మొదలుపెడతారు. అది చాలా స్వాభావికమైన చర్య. అయితే పోనుపోనూ అది యాంత్రికం అవుతుంది.
అలా అవుతున్న కొద్దీ మొదట్లో ఉన్నంత థ్రిల్ కనిపించకపోవచ్చు. మీరు కెరియర్‌పై దృష్టి పెట్టండి. ఏదో ఒక సమయంలో మీకు మూడ్ వచ్చినప్పుడు మీది కేవలం అపోహ అన్న విషయం మీకే అర్థమవుతుంది. మీరు వివాహానికి పూర్తిగా అర్హులు. సంతృప్తికరమైన సెక్స్ జీవితాన్ని అనుభవించగలరు.
నాకు 60 ఏళ్లు. రెండేళ్ల క్రితం వరకు బాగానే సెక్స్ చేస్తుండేవాణ్ణి. ప్రస్తుతం సెక్స్ చేయాలనే కోరిక ఉన్నా అంగస్తంభన సరిగా లేకపోవడంతో సెక్స్ చేయలేకపోతున్నాను. దీనికి తోడు రాత్రిళ్లు మూత్రానికి ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తోంది. నిద్రసరిగా పట్టడం లేదు. నాకు తగిన సలహా ఇవ్వండి.
- డి.కె.ఎమ్., కొత్తగూడెం
అరవై ఏళ్లు పైబడ్డ వాళ్లలో సెక్స్ సంబంధిత, మూత్ర సంబంధిత సమస్యలు కనిపించవచ్చు. వయసు పెరుగుతుండటంతో చాలా మందిలో కనిపించే సాధారణమైన సమస్యలే ఇవి. ప్రోస్టేట్ గ్లాండ్ పెరగడం వల్ల మూత్ర సంబంధిత సమస్య, రక్తనాళాలు కొంత బలహీనం కావడం వల్ల అంగస్తంభన సమస్యలు వచ్చి ఉండవచ్చు.
ఈ రెండింటినీ మందులతో కొంత నయం చేయవచ్చు. దాంతోపాటు శారీరక, మానసిక దారుఢ్యం (ఫిట్‌నెస్) కోసం కృషి చేయడం ద్వారా మరికొంత సెక్సువల్ పెర్‌ఫార్మెన్స్‌ను పెంచుకోవచ్చు. షుగర్, కొలెస్ట్రాల్ వంటి పరీక్షలు చేయించుకుని అవి ఉంటే వాటిని నియంత్రించుకునేందుకు అవసరమైన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకసారి మీ యూరాలజిస్ట్/యాండ్రాలజిస్ట్‌ను కలవండి.
- డాక్టర్ వి. చంద్రమోహన్
యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్
ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి
హైదరాబాద్
మూర్ఛ వ్యాధిని అదుపులో ఉంచవచ్చు
Published Mon, Jan 18 2016 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM
Advertisement
Advertisement