అల్ట్రా సౌండ్ ద్వారా మూర్ఛకు కారణాలపై పరిశోధనలు.. అమెరికాలో సఫలీకృతం
మెదడు సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించాలి
ఇదే ప్రపంచం ముందున్న అతి పెద్ద సవాల్
న్యూరో సమస్యలు పరిష్కరించడంలో ఇంకా వందేళ్లు వెనుకబడే ఉన్నాం
‘సాక్షి’తో అంతర్జాతీయ మూర్ఛ రోగ నిపుణుడు, క్లీవ్‌ల్యాండ్ న్యూరో డైరెక్టర్ ఇమద్
సాక్షి, విశాఖపట్నం: వైద్య రంగాన్ని కలవరపెడుతున్న మూర్ఛ (ఎపిలెప్సీ) రోగానికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని అంతర్జాతీయ మూర్ఛరోగ నిపుణుడు, క్లీవ్‌ల్యాండ్ ఎపిలెప్సీ సెంటర్ న్యూరో డైరెక్టర్ డాక్టర్ ఇమద్ ఎం నజ్మ్ చెప్పారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ (ఐయాన్‌కాన్)–2024 సదస్సులో కీలకోపన్యాసం చేసేందుకు విశాఖ వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు.
కొన్ని దేశాల్లో మూర్ఛ రోగానికి శస్త్రచికిత్సలు చేసినా.. ఫలితాలు మాత్రం రాబట్టుకోలేకపోతున్నామన్నారు. నాడీ సంబంధిత వ్యాధులు పరిష్కరించడంలో ఇంకా వందేళ్లు వెనకబడే ఉన్నామన్నారు. ఎపిలెప్సీపై పరిశోధనలు వేగవంతమవుతున్నాయని తెలిపారు. ఆయన ఏమన్నారంటే..
ప్రతి ఆరుగురిలో ఒకరికి నరాల సమస్య
ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు నరాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతుండటం కలవరపెట్టే అంశం. ప్రపంచవ్యాప్తంగా 65 మిలియన్ల మంది మూర్ఛతో జీవిస్తున్నారు. 10 లక్షల మంది మెసియల్ టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీతో బాధపడుతున్నారు. మెదడులో వైకల్యాలు అని పిలిచే మూర్ఛ రోగం వైద్య రంగంలో క్లిష్టంగా మారుతోంది.
మెదడు అధ్యయనం అంటే.. అది మూర్ఛ కావచ్చు, అల్జీమర్స్ కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, పార్కిన్సన్ కావచ్చు. నాడీ సంబంధిత వ్యాధులు ఇటీవల ఎక్కువయ్యాయి. వయసుతో పాటు ఈ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. 75 ఏళ్లు పైబడిన ప్రతి 100 మందిలో 15 మందికి మూర్ఛ రోగం ప్రమాదకరంగా మారే అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకే మూర్ఛ వంటి నాడీ సంబంధిత వ్యాధులపై పరిశోధనలు విస్తృతం చేస్తున్నాం.
శస్త్ర చికిత్సల్లో మూడొంతులు విఫలం
మూర్ఛకు శస్త్రచికిత్స అంటూ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చాయని చెబుతున్నారు. అంటే మెదడులోని టెంపోరల్ లోబ్‌కు సంబంధించిన భాగాన్ని తొలగించడం మూర్ఛకు ఉన్న ఏకైక శస్త్రచికిత్స. ఇది అంత విజయవంతం కాదు.
ఇప్పటివరకు చేసిన ఈ తరహా చికిత్సల్లో మూడొంతులు విఫలమవుతున్నాయి. మందుల ద్వారా కూడా అంత ఫలితాలు రావడం లేదు. మూర్ఛ రోగం వచ్చిన ప్రతి 100 మందిలో 90 శాతం రోగులు మందులు వాడుతున్నారు. వీరిలో కేవలం 44 శాతం మందికే ఫలితాలు దక్కుతున్నాయి.
అమెరికా పరిశోధనలు సఫలీకృతం
అమెరికాలో ఎపిలెప్సీపై 2007 నుంచి పరిశోధనలు కొనసాగుతున్నాయి. 2007లో లేజర్ థెరపీకి అనుమతి లభించింది. 2013లో న్యూరో స్టిమ్యులేషన్, 2018లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్), 2019లో హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అ్రల్టాసౌండ్ ద్వారా మూర్ఛకు కారణాలపై పరిశోధనలు చేసేందుకు అనుమతి లభించింది. ఇది విజయవంతమయ్యే దిశగానే పరిశోధనలు ముందుకు సాగుతున్నాయి. అయితే.. నాడీ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించి, రోగ నిర్ధారణ చేయడంఅనేది వైద్య ప్రపంచానికి పెద్ద సవాల్‌గా మారింది.
హృద్రోగాల్ని ఎలాగైతే ముందుగానే పసిగట్టే వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందో.. అదేవిధంగా నాడీ వ్యవస్థకు సంబంధించిన వైద్య పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. 2050 నాటికి న్యూరో సంబంధిత వ్యాధులకు సంబంధించి సంపూర్ణ చికిత్స వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment