కష్టం ఒకటే. పని గంటలూ అవే. కానీ చేతికి అందేది మాత్రం ఒకేలా ఉండదు. కింది నుంచి పై వరకు భారతదేశంలో మహిళా కార్మికులు, మహిళా ఉద్యోగుల పరిస్థితి ఇది. బ్రిటన్‌లోని ‘ఆక్స్‌ఫామ్’ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషుల వేతనాల్లోని వ్యత్యాసాలపై అధ్యయనం చేసినప్పుడు ఈ ‘అసమానత్వం’ బయట పడింది. ఇదేమీ కొత్తగా బయటపడింది కాదు కానీ, ఓ కొత్త విషయాన్ని కూడా ఆక్స్‌ఫామ్ వెల్లడించింది. భారతదేశంలో ప్రభుత్వం ఏ రంగంలోనైనా ఖర్చు తగ్గించుకున్న ప్రతిసారీ వెంటనే ఆ దుష్ప్రభావం మహిళల జీవితాలపై పడుతోంది. ఉదా : విద్యపై పెట్టే ఖర్చును ప్రభుత్వం తగ్గించుకుంది. లేదా ఆరోగ్యంపై ఖర్చు తగ్గించుకుంది. ఆ వరుసలోనే ప్రజలకు అందవలసిన సేవలూ తగ్గుతాయి.
ఆ తగ్గిన సేవలు, సదుపాయాల వినియోగంలో సహజంగానే బాలికలకు, మహిళలకు తొలి ప్రాధాన్యం తగ్గుతుంది. ఇద్దరు పిల్లల్ని చదివించలేనప్పుడు అబ్బాయిని మాత్రమే బడికి పంపడం, డాక్టరు దగ్గరికి వెళ్లవలసిన పరిస్థితిని ఇంట్లో ఆడవాళ్ల విషయంలో నిర్లక్ష్యం చేయడం.. ఇలా ఉంటాయి పర్యవసానాలు. స్త్రీలు, బాలికల కోసం అంటూ ప్రత్యేకంగా కేటాయించిన ప్రణాళికలు, పథకాలు వారికి చేరేలోపు దారి మారుతున్న వివక్షాపూరిత వాతావరణంలో ఇలాంటి ప్రభుత్వ తగ్గింపులు మహిళల్ని మరింత దైన్యంలోకి నెట్టడంలో ఆశ్చర్యం ఏముంది? ఆక్స్‌ఫామ్ లెక్కల ప్రకారం ఇండియాలో ఏటా 2 కోట్ల 30 లక్షల మందికి పైగా బాలికలు బడి మానేస్తున్నారు.
బడిలో మరుగుదొడ్లు లేకపోవడం, రుతుస్రావ శుభ్రత వసతులు లేకపోవడం ఇందుకు తొలి కారణాలు కాగా, పనికి వెళుతున్న తల్లికి ఆమె శ్రమకు తగ్గ ఫలితం అందకపోవడం ఇంకో కారణం. స్త్రీకి ఆర్థిక స్వావలంబన ఉంటే, మెరుగైన పాఠశాలలో చేర్పించే అవకాశం ఉంటుంది కదా. ఇవన్నీ అలా ఉంచండి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందలేని కారణంగా పోషించే శక్తి తగ్గి తన ఇంట్లో తనే స్త్రీ వివక్షకు, వివక్ష నుంచి హింసకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నట్లు ఆక్స్‌ఫామ్ గమనించింది.
ఇంట్లో మగాళ్ల మాటను తు.చ.తప్పకుండా పాటించకపోవడం, వారికి చెప్పకుండా రూపాయి ఖర్చు పెట్టడం, పిల్లల సంరక్షణకు సమయాన్ని కేటాయించలేకపోవడం, ఇంట్లో పెద్దవాళ్లకు సేవలు చేయలేకపోవడం, వేళకు వండి వడ్డించకపోవడం, నీళ్ల బిందెలు ఖాళీగా ఉండడం, వంట చెరకును తీసుకు రాలేకపోవడం, చెప్పకుండా బయటికి వెళ్లడం.. ఇవన్నీ కూడా ఇంట్లో ఆర్థికబలం లేని మహిళలను వేధించడానికో, వారిపై చెయ్యి చేసుకోవడానికో నెపాలు అవుతున్నాయని ఆక్స్‌ఫామ్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment