
విషం సైతం ఔషధంగా...
బోటులినమ్ టాక్సిన్
విషాన్ని సమర్థంగా వాడితే అది ఔషధంలా పనిచేస్తుంది. బోటులినమ్ అనేది కూడా అంతే. నిజానికి బోటులినమ్ అనేది ఒక విషం. కొన్ని నరాల సమస్యలకు ఆ విషాన్ని ఒక మందులా ఉపయోగించవచ్చు. ఈ విషం గురించి కొన్ని విషయాలు... బోటులినమ్ టాక్సిన్ అంటే... ఈ విషాన్ని క్లాస్ట్రీడియమ్ బోటులినమ్ అనే బ్యాక్టీరియా నుంచి తయారు చేస్తారు. మనం ఒక్కోసారి కింద పడినప్పుడు కాళ్లు, చేతులకు దోక్కుపోవడం లాంటి గాయాలు అయినప్పుడు అక్కడ చీము పట్టడం, పుండు కావడం జరుగుతుంది. దీనికి కారణం మట్టిలో ఉండే కొన్ని బ్యాక్టీరియా గుడ్లు. టెటనిక్ స్పోర్స్ అనే బ్యాక్టీరియా గుడ్లు దెబ్బతగిలిన ప్రదేశంలో 2-3 రోజులు ఉంటాయి. అవి గుడ్డు నుంచి పూర్తిస్థాయి బ్యాక్టీరియాగా మారి పుండులా మారేందుకు కారణమవుతాయి. ఈ బ్యాక్టీరియా నుంచి వచ్చే విషాలు (బోటులినమ్ టాక్సిన్) రక్తంలో కలిసిపోయి శరీరమంతా పాకుతాయి. అవి శరీరంలో ఉండే కండరాలు చచ్చు పడిపోయేలా చేస్తాయి. దీన్ని వూండ్ బోటులిజం అంటారు. (దాన్ని నివారించడానికే కింద పడినప్పుడు దెబ్బ తగిలిన ప్రదేశంలో సబ్బుతో బాగా శుభ్రం చేసుకుని టెటనస్ ఇంజెక్షన్ తీసుకోవాలి). ఇలాంటి ప్రమాదకరమైన బోటులినమ్ టాక్సిన్‌ను గత కొంతకాలం నుంచి అనేక నరాల సమస్యలకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు.
బోటులినమ్ టాక్సిన్ ఉపయోగాలు
పెరాలసిస్ వచ్చాక చేతులు, కాళ్లు గట్టిగా బిగుసుకుపోతాయి. ఆ బిగుతు (మజిల్ స్పాస్టిసిటీ)ని తగ్గించడానికి. రైటర్స్ క్రాంప్ : మునుపు రాత సామర్థ్యం ఉన్న వారు ఆ తర్వాత అంతగా రాయలేకపోతున్నప్పుడు. మెడ ఒక పక్కగా ఒంపు తిరిగినవారికి... (సర్వైకల్ డిస్టోనియా) మూతి వంకర పోయినవారికి (హెమీ ఫేషియల్ స్పాజమ్) కనురెప్పలు మూసుకుపోవడం (బ్లెఫరోస్పాజమ్): కనురెప్ప మూసుకుపోయేవారికి. మెల్లకన్ను (స్ట్రాబిస్మస్) ఉన్నవారికి. మైగ్రేన్ తలనొప్పి కి: మందులు వాడినా మైగ్రేన్ వల్ల వచ్చే నొప్పి తగ్గకపోతే. అరచేతులు, అరికాళ్లలో / బాహుమూలాల్లో అతిగా చెమటలు పట్టేవారికి. ముఖంలోని ముడుతలను పోగొట్టేందుకు.
మరికొన్ని సమస్యలకు...
పైన పేర్కొన్న వాటికేగాక మరికొన్ని సమస్యలకు సైతం బోటులినమ్ ఇవ్వవచ్చు. అన్నవాహికకు వచ్చే అకలేషియా అనే జబ్బుకు, మూత్రాశయానికి వచ్చే డెట్రూసర్ హైపర్ యాక్టివిటీ, న్యూరోజెనిక్ బ్లాడర్‌కూ, యానల్ ఫిషర్‌కు, వెజినస్‌మస్‌కు, ఫోకల్ డిస్టోనియాస్ , ఎక్కువగా చొల్లు కారడం, దవడ కండరాలు బిగుసుకుపోవడం వంటి సమస్యలను తగ్గించడానికి ఇస్తారు.
ఎలా ఇస్తారు...
కండకు (ఇంట్రా మస్కులార్) చర్మం కింద (సబ్‌క్యుటేనియస్) చర్మంలోకి (ఇంట్రా డర్మల్) {Vంథులలోకి (ఇంట్రాగ్లాండ్యులార్) జబ్బును బట్టి బోటులినమ్ టాక్సిన్ ఎలా ఇవ్వాలో డాక్టర్లు నిర్ణయిస్తారు.
ఎంత మోతాదు?
సమస్యను బట్టి ఎంత మోతాదు ఇవ్వాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఇచ్చిన తర్వాత దీని ప్రభావం 3 - 7 రోజుల్లో కనిపిస్తుంది. ఇది సాధారణంగా ఆరు నెలలు పనిచేస్తుంది. దాని ప్రభావం తగ్గాక మళ్లీ ఇవ్వాల్సి ఉంటుంది. దీని చాలావరకు సురక్షితం.
డా. బి. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరాలజిస్ట్
సిటీ న్యూరో సెంటర్ రోడ్ నెం.12
బంజారాహిల్స్, హైదరాబాద్