హోమియో కౌన్సెలింగ్
మా బాబుకు ఆరేళ్లు. ఎప్పుడూ నోటితో గాలి పీలుస్తుంటాడు. రాత్రి నిద్రలో గురకపెడుతుంటాడు. డాక్టర్లు అడినాయిడ్స్ వాపు ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. హోమియోపతిలో దీనికి పరిష్కారం ఉందా?
- శంకరరావు, రాజమండ్రి
అడినాయిడ్స్ అనేది రకరకాల బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకునే ముఖ్యమైన శరీర వ్యవస్థ. ఇది పుట్టుకతో కూడా రావచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల, అలర్జీల వల్ల, సిస్టిక్ కార్సినోమా వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంది.
లక్షణాలు: ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కనిపించే ప్రథమ లక్షణం గొంతునొప్పి అయితే ఇన్ఫెక్షన్‌ను నియంత్రించే ప్రక్రియలో దీని పరిమాణం పెరిగే అవకాశం ఉంది. జలుబుతో ముక్కు మూసుకుపోవడం, గొంతు, మెడలో ఉండే గ్రంథులలో వాపు, నిద్రలేమి, గురక, చెవి సమస్యలు, గొంతు బొంగురు పోవడం, నోటి దుర్వాసన, మింగడానికి ఇబ్బంది కలగడం, పెదవులు పగలడం, నోరు పొడిబారినట్లుగా ఉండటం, నోటి ద్వారా గాలి పీల్చాల్సి రావడం, ఏకాగ్రత లోపించడం, ఆకలి మందగించడం, జ్ఞాపకశక్తి తగ్గడం
దుష్ర్పభావాలు: చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే కీళ్లవాతం, సైనసైటిస్, చెవి సంబంధ ఇన్ఫెక్షన్, న్యూమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులు రావడం, శారీరక ఎదుగుదలపై ప్రభావం వంటివి.
నిర్థారణ: రక్తపరీక్షలు, ఎక్స్‌రే, గొంతును పరిశీలించడం ద్వారా.
జాగ్రత్తలు: ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం, పరిశుభ్రత పాటించడం, తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు రుమాలు అడ్డుపెట్టుకోవడం, కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగడం, రోగనిరోధక శక్తిని పెంచే ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వేడినీళ్లలో ఉప్పు వేసి రోజూ నాలుగైదుసార్లు పుక్కిలించడం, విశ్రాంతి తీసుకోవడం.
హోమియో చికిత్స: శరీరంలోకి ముక్కు, నోటి ద్వారా ప్రవేశించే క్రిములకు అడ్డుకట్ట వేయడంలో ఎడినాయిడ్స్ పాత్రే కీలకం. దీనికి ఇన్ఫెక్షన్ సోకితే పనితీరు మందగించి క్రిములు సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అయితే హోమియో మందులు ఇన్ఫెక్షన్‌ని పూర్తిగా నిర్మూలించడంతోపాటు తిరిగి అనారోగ్యం బారినపడకుండా కాపాడుతుంటాయి. రోగి మానసిక, శారీరక లక్షణాలను గుర్తించి వైద్యులు తగిన మందులు సూచిస్తుంటారు. అడినాయిడ్స్ వాపు తగ్గించడానికి ఆపరేషన్ లేకుండా కాల్కేరియా కార్బ్, స్యాంబకస్, కాల్కేరియా ఫ్లోర్, ఆగ్రాఫిస్ వంటి మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి
హైదరాబాద్
గ్యాస్త్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
నాకు 29 ఏళ్లు. వివాహమై మూడేళ్లవుతున్నా సంతానం లేకపోవడంతో డాక్టర్ చెప్పిన పరీక్షలు చేయించాను. రిపోర్టులో హెచ్‌బీఎస్ ఎజీ-పాజిటివ్ అని వచ్చింది. హెచ్‌ఇపి-బి వైరస్ నా రక్తంలో, వీర్యంలో ఉంటుందా? నా ద్వారా హెచ్‌ఇపి-బి వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉంటుందా? నేను నా భార్యతో కలవచ్చా? దీని ద్వారా కాలేయానికి హాని జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో తెలుపగలరు.
- ఎమ్.ఆర్., కడప
హైపటైటిస్-బి రక్తం ద్వారా వస్తుంది. కాని సెక్స్ ద్వారా వ్యాపించడం చాలా తక్కువ. అయినప్పటికీ మీ భార్యకి ముందుజాగ్రత్తగా 3 డోస్‌లు వ్యాక్సిన్ ఇప్పించాలి. వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు మీరు కండోమ్ వాడాల్సి ఉంటుంది. దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాని రెగ్యులర్‌గా మీరు ఎల్.ఎఫ్.టి. టెస్ట్ చేయించుకోవాలి. మీరు సంతానం కోసం ఇన్‌ఫెర్టిలిటీ చికిత్స కూడా చేయించుకోవచ్చు.
హైపటైటిస్-బి చాలా వేగంగా లివర్‌కు సమస్యలు తెచ్చిపెడుతుంది. ఒక రకంగా హెచ్.ఐ.వి. కన్నా 50 నుంచి వంద రెట్లు ఎక్కువ ప్రమాదమైనది. ఇది రక్తం, లాలాజలం, వీర్యం, సర్వైకల్ ద్రవాల ద్వారా వ్యాపించవచ్చు. వైరస్ చేరిన వెంటనే పెద్దగా లక్షణాలు కనిపించకపోవచ్చు. కొంతమందిలో ఫ్లూలాంటి జ్వరం, తీవ్రమైన అలసట, వికారం, కళ్లు, ఒళ్లు పచ్చబడటం కామెర్ల లక్షణాలు, విరోచనాలు ఉంటాయి. హైపటైటిస్-బి గుర్తించేందుకు మాంటిజన్ పరీక్షను నిర్వహిస్తారు. వైరస్ చేరిన వెంటనే ఈ పరీక్షలో తెలియదు. 6 నుంచి 12 వారాల తర్వాత మాత్రమే పాజిటివ్ అన్న ఫలితం వస్తుంది. కాబట్టి మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి. దీని బారిన పడిన 10 మందిలో 9 మందికి ఆరు నెలల్లో దానంతట అదే తగ్గిపోతుంది. కొద్దిమందిలో మాత్రమే శరీరంలో ఉండిపోయి దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌గా మారుతుంది. దాతో లివర్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. లివర్ క్యాన్సర్ రావడానికి ఒక ముఖ్య కారణం హైపటైటిస్-బి అని చెప్పవచ్చు. ఇలాంటప్పుడు ఇన్ఫెక్షన్ ముదరకుండా లివర్‌ను దెబ్బతీయకుండా చికిత్స అందిస్తారు. కొన్ని వారాల పాటు మందులు వాడితే వైరస్ పెరుగుదల ఆగిపోతుంది.
జాగ్రత్తలు: శరీరంలో హైపటైటిస్-బి వైరస్ ఉంటే వారి రక్తం, శారీక స్రావాల ద్వారా ఇతరులకు కూడా సంక్రమించే అవకాశం ఎక్కువ. శృంగారం, ఇతరులకు వాడిన ఇంజెక్షన్లు, సూదులు, సిరంజిలు, బ్లేడులు, టూత్‌బ్రష్‌లు, నెయిల్ క్లిప్లర్ల వంటి వాటి ద్వారా వ్యాపిస్తుంది. బిడ్డకు కూడా పుట్టగానే టీకా ఇప్పించాలి. హైపటైటిస్-బి వ్యాక్సినేషన్ చేయించాలి. మీరు క్రమం తప్పకుండా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి రెగ్యులర్‌గా చికిత్స తీసుకోవాలి.
డాక్టర్ భవానీరాజు
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్,
హైదరాబాద్
పల్మనాలజీ కౌన్సెలింగ్
మా వారి వయసు 40. గత ఐదేళ్లుగా మా ఆయనకు రాత్రిళ్లు విపరీతమైన గురక వస్తుంది. గురక పెడుతున్న సమయంలో తడితే కొద్ది సమయం పాటు ఆగి, మళ్లీ అలాగే గురక వస్తుంది. ఆయనకు సిగరెట్ అలవాటు ఉంది. బరువు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువే ఉంటారు. ఆయన గురక వల్ల నేను, మా పిల్లలు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేకపోతున్నాము. గురక కారణంగానే మా కాపురంలో చాలా గొడవలు వస్తున్నాయి. ఈ గురక సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా..? దయచేసి తెలుపగలరు.
- ధనలక్ష్మి, కడప
చాలామంది గురక సమస్యను అంతగా పట్టించుకోరు. కుటుంబ సభ్యులకు గురక సమస్య ఉన్నా అలాగే సర్దుకుపోతుంటారు. గురక సమస్యకు సరైన కారణం కనుక్కుని చికిత్స అందించడం చాలా అవసరం. ఎందుకంటే గురక ఉండడం ఒక జబ్బు కూడా కావచ్చు. అకస్మాత్తుగా ఊపిరి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. గురక వల్ల బీపీ, షుగర్, గుండె సమస్యలు, ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. గురక వల్ల కుటుంబపరమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా సామాజికంగా కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. గురక పెట్టేవారితో పాటు వారితో కలిసి పడుకునే వారికి కూడా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుంది. గురక పెట్టేవారితో కలిసి పడుకునే వారిలో నిద్రలేమి సమస్య ఎదురవుతుంది. నిద్రలేమితో ఒత్తిడి, ఏకాగ్రత లోపించడం, బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గురక సమస్యను నిర్లక్ష్యం చేయడం అంత మంచిది కాదు. మీరు సాధ్యమైనంత త్వరగా మీ వారిని పల్మనాలజీ నిపుణులకు చూపించండి.
గురక సమస్యకు సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. గురకలో మంచి గురక, చెడు గురక అని రెండు రకాలుగా ఉంటుంది. దీనిని తెలుసుకోవడానికి స్లీప్ స్టడీ చేయాల్సి ఉంటుంది. స్లీప్ స్టడీ ద్వారా సమస్యను కనుక్కుని అందుకు తగిన చికిత్స అందిస్తారు. చికిత్స తీసుకోకుండా ఆలస్యం చేస్తే మాత్రం ఇతర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే వైద్యులను సంప్రదించండి.
డాక్టర్ ఎమ్.వి. నాగార్జున
సీనియర్ పల్మనాలజిస్టు,
యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ,
హైదరాబాద్