అది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కావచ్చు... | Iritabul bowel syndrome, it may be | Sakshi
Sakshi News home page

అది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కావచ్చు...

Published Thu, Apr 14 2016 11:43 PM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM

అది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కావచ్చు... - Sakshi

అది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కావచ్చు...

హోమియో కౌన్సెలింగ్

 

మా బాబుకు ఆరేళ్లు. ఎప్పుడూ నోటితో గాలి పీలుస్తుంటాడు. రాత్రి నిద్రలో గురకపెడుతుంటాడు. డాక్టర్లు అడినాయిడ్స్ వాపు ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. హోమియోపతిలో దీనికి పరిష్కారం ఉందా? - పి.కల్యాణి, కొలనుకొండ

అడినాయిడ్స్ అనేది రకరకాల బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకునే ముఖ్యమైన శరీర వ్యవస్థ. ఇది పుట్టుకతో కూడా రావచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల, అలర్జీల వల్ల, సిస్టిక్ కార్సినోమా వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంది.

 
లక్షణాలు
: ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కనిపించే ప్రథమ లక్షణం గొంతునొప్పి అయితే ఇన్ఫెక్షన్‌ను నియంత్రించే ప్రక్రియలో దీని పరిమాణం పెరిగే అవకాశం ఉంది. జలుబుతో ముక్కు మూసుకుపోవడం, గొంతు, మెడలో ఉండే గ్రంథులలో వాపు, నిద్రలేమి, గురక, చెవి సమస్యలు, గొంతు బొంగురు పోవడం, నోటి దుర్వాసన, మింగడానికి ఇబ్బంది కలగడం, పెదవులు పగలడం, నోరు పొడిబారినట్లుగా ఉండటం, నోటి ద్వారా గాలి పీల్చాల్సి రావడం, ఏకాగ్రత లోపించడం, ఆకలి మందగించడం, జ్ఞాపకశక్తి తగ్గడం

 
దుష్ర్పభావాలు: చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే కీళ్లవాతం, సైనసైటిస్, చెవి సంబంధ ఇన్ఫెక్షన్, న్యూమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులు రావడం, శారీరక ఎదుగుదలపై ప్రభావం వంటివి.

 
నిర్థారణ
: రక్తపరీక్షలు, ఎక్స్‌రే, గొంతును పరిశీలన ద్వారా.

 
జాగ్రత్తలు: ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం, పరిశుభ్రత పాటించడం, తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు రుమాలు అడ్డుపెట్టుకోవడం, కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగడం, రోగనిరోధక శక్తిని పెంచే ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వేడినీళ్లలో ఉప్పు వేసి రోజూ నాలుగైదుసార్లు పుక్కిలించడం, విశ్రాంతి తీసుకోవడం.

 
హోమియో చికిత్స: శరీరంలోకి ముక్కు, నోటి ద్వారా ప్రవేశించే క్రిములకు అడ్డుకట్ట వేయడంలో ఎడినాయిడ్స్ పాత్రే కీలకం. దీనికి ఇన్ఫెక్షన్ సోకితే పనితీరు మందగించి క్రిములు సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అయితే హోమియో మందులు ఇన్ఫెక్షన్‌ని పూర్తిగా నిర్మూలించడంతోపాటు తిరిగి అనారోగ్యం బారినపడకుండా కాపాడుతుంటాయి. రోగి మానసిక, శారీరక లక్షణాలను గుర్తించి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. అడినాయిడ్స్ వాపు తగ్గించడానికి ఆపరేషన్ లేకుండా కాల్కేరియా కార్బ్, స్యాంబకస్, కాల్కేరియా ఫ్లోర్, ఆగ్రాఫిస్ వంటి మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాలి.

 

డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి
హైదరాబాద్

 

గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్

 

 నా వయస్సు 46 ఏళ్లు. నేను చాలా రోజుల నుండి అసిడిటి సమస్యతో బాధపడుతున్నాను. గడచిన 6 నెలల నుండి నేను పాంటాసిడ్-హెచ్‌పి మందులు ఒక వారం వాడాను. ప్రస్తుతం ఒమేజ్ మాత్రలు వాడుతున్నాను. అయినా కడుపులో నొప్పి తగ్గడం లేదు. దీనికి తోడు మలబద్దకం, తలనొప్పి సమస్య ఉంది. నా సమస్యకు తగిన సలహా ఇవ్వగలరు.     - వి. భానుమతి, బెంగళూరు
మందులు వాడినా ఫలితం కలగడం లేదని చెబుతున్నారు. ఒకసారి మీరు ఎండోస్కోపి చేయించుకొని దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవండి. రెండవది మలబద్దకం, కడుపులో నొప్పి ఉందని అంటున్నారు. సాధారణంగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే వ్యాధి వల్ల ఇలా జరుగుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మలబద్దకం కడుపులో నొప్పి ఉంటుంది. మీ ఆహారపు అలవాట్లు, యాంగ్జైటీ, ఒత్తిడి వల్ల వచ్చే అవకాశముంది. కాబట్టి మీరు మీ దగ్గరలోని గ్యాస్ట్రోఎంటరాలజిస్టును కలిసి చికిత్స తీసుకోండి.

మా బాబు వయస్సు 9 సంవత్సరాలు, మూడు సంవత్సరాల క్రితం పచ్చ కామెర్లు వచ్చాయి. ఒక నెల రోజుల తరువాత వాటంతట అవే తగ్గిపోయాయి. అయితే రెండు రోజుల నుండి మళ్లీ కళ్లు పచ్చగా అనిపిస్తున్నాయి. మళ్లీ కామెర్లు వచ్చాయని సందేహంగా ఉంది. దయచేసి ఏమి చేయాలో సలహా ఇవ్వండి.    - జి. బాలరాజు, ఆదిలాబాద్
సాధారణంగా చిన్న వయస్సులో వచ్చే పచ్చకామెర్లకు హెపటైటిస్-ఎ, ఇ అనే వైరస్‌లు కారణమవుతాయి. ఈ వైరస్ ఇన్‌ఫెక్షన్ వల్ల వైరస్‌లు వచ్చే అవకాశం ఉంది. మీరు ఒకసారి కామెర్లు వచ్చాయి అని తెలిపారు. కాబట్టి మళ్లీ మళ్లీ ఈ వైరస్ ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు వ్యాధి నిరోధక శక్తి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ బాబుకి కామెర్లు రావడానికి విల్సన్ డిసీజ్ వంటి ఇతర కారణాలు ఉండి ఉండవచ్చు. అలాగే మీ బాబుకి దురద, రక్తహీనత వంటి లక్షణాలేమైనా ఉన్నాయో రాయలేదు. ఒక్కసారి మీరు మీ దగ్గరలోని గ్యాస్ట్రోఎంటరాలజిస్టును కలిసి తగిన పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోండి.

 

డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,  కేర్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్

 

డర్మటాలజీ కౌన్సెలింగ్

 

నాకు క్రీములు వాడే అలవాటు లేదు. సౌందర్యసాధనాలు వాడటం కూడా ఇష్టం లేదు.  ఆహారం ద్వారానే చర్మం మెరిసేలా చేసుకోవడం ఎలాగో చెప్పండి.     - డి.ఎల్. అనూరాధ, కొత్తగూడెం
మంచి ప్రశ్న వేశారు. ఆహారంతోనే చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి మేలు చేస్తాయి. ఇవి ఎక్కువగా ఉండే ఆహారాలైన తాజా చేపలు, అవిశెలు, బాదం... వంటివి తీసుకోవడం ద్వారా చర్మం మెరిసేలా చూసుకోవచ్చు. ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉండేలా చేస్తాయి. ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్స్‌లో ఫైబర్ (పీచు పదార్థాలు) ఎక్కువ. ఇవి శరీరంలోని విషాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. ఇందులోని పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి. వైటమిన్-బి6 ఎక్కువగా ఉండే ఆహారమైన కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్‌నట్, అవకాడో వల్ల హార్మోన్లలోని అసమతౌల్యత వల్ల వచ్చే మొటిమలను నివారించవచ్చు. అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మానికి హానిచేసే ఫ్రీ రాడికల్స్ అనే విషాలను తొలగించి మేనిని మెరిసేలా చేస్తాయి.

 

నాకు కుడి చేతి మీద అలర్జిక్ ర్యాష్ వచ్చింది. దురదగా ఉంటే అక్కడ చాలాసేపు గీరాను. దాంతో అక్కడ నల్లటి మచ్చలు (డార్క్ మార్క్స్) ఏర్పడ్డాయి. అవి వచ్చి నాలుగు నెలలైనా ఇంకా తగ్గలేదు. నేను ఫెయిర్‌గా ఉంటాను. అందుకే అవి ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.     - పి.పద్మజ, మచిలీపట్నం

మీరు చెబుతున్న కండిషన్‌ను పోస్ట్ ఇన్‌ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఇది తగ్గడానికి ఈ కింది సూచనలు పాటించండి.  సాఫ్ట్ పారఫిన్, షియాబట్టర్, గ్లిజరిన్ ఉన్న మాయిశ్చరైజర్‌ను డార్క్ మార్క్స్ ఉన్నచోట బాగా రాయండి  ఆ ప్రాంతంలో ఎస్‌పీఎఫ్ 50 కంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ ప్రతిరోజూ ఉదయం, మధ్యానం రాయండి  కోజిక్ యాసిడ్, అర్బ్యుటిన్, నికోటినమైడ్‌తో పాటు లికోరైస్ ఉన్న స్కిన్ లెటైనింగ్ క్రీములు అప్లై చేయండి  ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను ప్రతిరోజూ తీసుకోండి. దీనికితోడు మీరు మీ అలర్జీని అదుపులో ఉంచుకునే మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఈ సూచనలు పాటించాక కూడా తగ్గకపోతే కెమికల్ పీలింగ్, మైక్రో డర్మా అబ్రేషన్ వంటి చికిత్సలు తీసుకోవడం కోసం మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి.

 

డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ  చీఫ్ డర్మటాలజిస్ట్
త్వచ స్కిన్ క్లినిక్  గచ్చిబౌలి, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement