
అమ్మ నాన్న... ఓ ప్రేమ...
13-19 కేరెంటింగ్
అవగాహన అవసరం..
అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?!
ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19...
సమస్య: 1
కాలేజీ నుంచి ఇంటికి చేరాల్సిన గీతిక అర్థరాత్రి అవుతున్నా ఎలాంటి సమాచారమూ లేదు. ఫోన్ స్విచ్చాఫ్, స్నేహితులను సంప్రదిస్తే ‘తెలియదు’ అనే సమాధానం. కూతురు ఏమైందో అన్న ఆందోళనతో పోలీసు కంప్లైంట్ ఇచ్చారు గీతిక తల్లిదండ్రులు. వారం రోజుల తర్వాత కూతురి ఆచూకి తెలిసింది. అప్పటికే నచ్చినవాడిని పెళ్లి చేసుకుందని తెలిసి ఆశ్చర్యపోయారు. ‘చదువుతున్నది ఇంటర్మీడియెట్ సెకండియర్. అప్పుడే పెళ్లేంటి?’ ఇంటికి వచ్చేయమని బతిమిలాడారు. తను చేసుకున్నవాడు సరైన వాడు కాదని నచ్చజెప్పారు. గీతిక వినలేదు. ఏడాది తిరక్కుండానే తల్లిదండ్రులను వెతుక్కుంటూ వచ్చింది. భర్త ఏ పనీ చేయడని, రోజూ నరకం చూపిస్తున్నాడని, తను గర్భవతిని అని. భర ్త మీద కేసు పెట్టింది. తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.
సమస్య : 2
పందొమ్మిదేళ్ల రమ్య ఇంజనీరింగ్ ఫస్టియర్. ఇంటికి ఆలశ్యంగా రావడం, స్నేహితులతో కంబైన్డ్ స్టడీ అని అబద్దాలు చెప్పడం, ఆమె నడవడికలో వచ్చిన మార్పులు చూసి తల్లిదండ్రి నిలదీశారు. తనంటే ప్రాణమంటున్న వ్యక్తిని వారం క్రితం పెళ్లి చేసుకున్నానని, మతమార్పిడి కూడా చేసుకున్నానని చెప్పేసరికి ఇంట్లో అంతా షాక్ అయ్యారు.
సమస్య : 3
వసంత జూనియర్ ఇంటర్ చదువుతోంది. తండ్రి చనిపోతే తల్లే అన్నీ అయ్యి కూతురుని సాకుతోంది. ఓ రోజు తల్లికి తనో వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పింది. కూతురు ఇచ్చిన అడ్రస్‌ని తీసుకొని అబ్బాయి ఇంటికి వెళ్లిన తల్లి అక్కడ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయింది. తన కూతురు ప్రేమిస్తున్న వ్యక్తి ఓ జులాయి. చదువు, సంస్కారం, ఆస్తి.. ఏమీ లేవు. కూతురుకు అవన్నీ కళ్లకు కట్టి చూపించింది. అయినా వసంత వినలేదు. ‘నేను చదువుతున్నాను కదా! సంపాదిస్తాను. అతడిని మార్చుకుంటాను’ అని పంతం పట్టింది. వద్దని పట్టుబడితే కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అలాగని చూస్తూ చూస్తూ కూతురిని స్లమ్ ఏరియాలో ఎలా ఉంచుతుంది. ఏమీ అర్థం
కాలేదు ఆ తల్లికి...
టీనేజ్ దాటకుండానే ‘ప్రేమ’ పేరుతో అమ్మాయిలు గడప దాటుతున్నారు. తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకున్న అమ్మాయిల జాబితాను ఒక్కసారి గమనిస్తే, కాసేపు వారితో మాట్లాడితే లోపం ఎక్కడ ఉందో తెలిసిపోతుంది.
పిల్లల్లో ఇంటి పట్ల విముఖత ఇలా...
ఇంట్లో తీవ్రమైన క్రమశిక్షణ. కౌమారంలో ఉన్న పిల్లలు చేసే ప్రతి చిన్న పనిని తప్పు పట్టడం, వ్యతిరేకతను చూపించడం.అమాయకత్వం. త్వరగా ఎదుటివారిని నమ్మడం. బయటి వారు చూపే ‘అభిమానం’ నిజమైందని అనుకోవడం.
అమ్మాయిలను ట్రాప్ చేయాలని అనుకునేవారు ముందుగా వారి అందాన్ని పొగుడుతారు. అమ్మాయిలు ఏం కోరినా ఎంత కష్టమైనా వెంటనే వాటిని అమర్చుతారు. కావల్సినంత సమయం కేటాయిస్తారు. పట్టించుకోకపోతే చేతులపై బ్లేడ్లతో కోసుకోవడం, వాతలుపెట్టుకోవడం, పచ్చబొట్లు పొడిపించుకోవడం.. వంటివి చేస్తుంటారు. ‘నేను కాదంటే ఏమైపోతాడో’ అనే భావనను అబ్బాయిలు(కొంతమంది) అమ్మాయిల్లో కల్పిస్తారు. దీంతోఅమ్మాయిలు తమది ‘అజరామరమైన ప్రేమ’ అనే భావనకు లోనవుతారు.
విమర్శ సరైనది కాదు...
సినిమాల్లోనూ, టీవీల్లోనూ చూపించే కథనాలలో ‘ప్రేమ’ ప్రధాన కథాంశంగా ఉంటుంది. కానీ, ఇంట్లో తల్లిదండ్రులు, బయట సమాజం మొత్తం ‘ప్రేమ’కు వ్యతిరేకత చూపుతుంది. ఏదైతే వద్దంటారో అదే చేసి చూపాలనుకునే నైజం టీనేజ్ దశలో అమితంగా ఉండటం వల్ల, ప్రేమకు త్వరగా ఆకర్షితులవడం ప్రధానంగా ఉంటుంది. అంతా అయిపోయాక పిల్లలను తప్పుపట్టడం, దండించడం కాదు. టీనేజ్ దశలోనే ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి, ప్రేమ-ఆకర్షణల మీద విస్తృతంగా పిల్లలతో చర్చించాలి.
{పేమలో ఉన్నప్పుడు కలిగే ఉద్విగ్నత పెళ్లి తర్వాత ఉండదని, భాగస్వామిలో చూడాల్సిన లక్షణాలు వేరేగా ఉంటాయని వివరించాలి. కానీ నూటికి 99 శాతం అలా జరగడం లేదు. పిల్లలు చేసిన పొరపాటుకు తల్లిదండ్రులు విమర్శనే ప్రధానాంశంగా తీసుకుంటున్నారు. ‘ఫలానవారి అమ్మాయి ఎవరితోనో వెళ్లిపోయిందట’ అనగానే ఇంట్లో తీవ్రంగా స్పందిస్తుంటారు. ‘మా అమ్మాయే అలాంటి పనిచేస్తేనా.. చంపేద్దుం. వారికి కల్చర్ తెలియదు. క్యారెక్టర్ లేదు. ఎంత విలువ తక్కువ పని...’ అంటూ పిల్లల ముందే అంటుంటారు. దీంతో తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పాలనుకున్నా నోరు నొక్కేసుకుంటారు. ‘అమ్మనాన్నలు ఎలాగూ ఒప్పుకోరు’ అని ముందే నిర్ధారణకు వచ్చిన అమ్మాయిలు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోతుంటారు.
‘ప్రేమిస్తున్నాను’ అని అమ్మాయి ఇంట్లో చెబితే అవతలి వ్యక్తి గురించి పూర్తి అవగాహనకు రాకముందే ‘చెడు’గా చెప్పడం మొదలుపెడతారు. డబ్బు, చదువు, వ్యక్తిత్వం.. ఇవేవీ అబ్బాయిలో లేవని ఏకరువు పెడతారు. దీంతో తమ అమర ప్రేమకు ఇవన్నీ ముడిపెడుతున్నారన్న భావన అమ్మాయిల్లో కలుగుతుంది. తమ ప్రేమను విజయవంతం చేసుకోవడం వైపే మొగ్గుచూపుతారు.
- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
.
టీనేజ్ దశలో ‘ప్రేమ’ పట్ల ఆకర్షితులవడం సహజంగా జరుగుతుంది. ‘కోరిక’ కలిగింది కాబట్టి ఎలాగైనా కలిసి బతకాలి అనే అభిప్రాయం నుంచి ఈ దశలోనే ‘జీవితభాగస్వామి అంటే ఎలా ఉండాలి? ఎలాంటి లక్షణాలు చూసి ఎంపిక చేసుకోవాలి..’ అనే విషయాల పట్ల తల్లిదండ్రులే కాదు టీచర్లూ, సామాజిక మాధ్యమాలు అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదేళ్లుగా టీనేజ్ టెంప్టేషన్స్ పై పిల్లలకూ, తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఇస్తూ వస్తున్నాను. ఇప్పటి వరకు దాదాపు 3 వేల మందితో మాట్లాడి ఉంటాను. అందులో కనీసం 4-5 వందల మంది టీనేజ్ అమ్మాయిలు తల్లిదండ్రులకు చెప్పకుండా ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడం, ఆ తర్వాత భంగపడి ఇల్లు చేరడం చూశాను. అమ్మాయిలు, వారి తల్లిదండ్రుల బాధ కళ్లారా చూశాను. 23 జిల్లాల్లో 300 వరకు టీనేజ్ ప్రేమల మీద కాలేజీలలో కార్యక్రమాలు ఏర్పాటు చేశాను. అక్కడ అబ్బాయిలు-అమ్మాయిలు ‘ప్రేమ-ఆకర్షణ’లకు సంబంధించిన ఎన్నో సందేహాలు అడగడం చూశాను. అంటే, ఈ వయసు వారికి తగినంత అవగాహన కల్పించడంలో అన్ని వ్యవస్థలు వైఫల్యం బాటన పయనిస్తున్నాయి. చదువు తప్ప మరో ప్రపంచం లేనట్టుగా ఉన్న నేటి సమాజంలో రేపటి యువతను కాపాడుకునే బాధ్యత మనందిరి మీదా ఉంది.
- డా. వీరేందర్, సైకాలజిస్ట్