అంతా శ్రీరంగడి సతీమణి దయే! | Everything Srirangam daye wife! | Sakshi
Sakshi News home page

అంతా శ్రీరంగడి సతీమణి దయే!

Published Tue, Dec 23 2014 11:38 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

అంతా శ్రీరంగడి సతీమణి దయే! - Sakshi

అంతా శ్రీరంగడి సతీమణి దయే!

ఏమిచేతురా రంగా అన్నా దిక్కుండదు...

ఇంటి వరండాలో కూర్చుని ఓ చేత్తో పేపర్ పట్టుకుని... అంతర్జాతీయ ద్రవ్యనిధీ, భారత విత్త విధానం- దాని లోపాలు... అంటూ తన ఫ్రెండ్‌తో దేశ ఆర్థిక విధానాల్లోని లోటుపాట్లు చర్చిస్తున్నారు శ్రీవారు. అంతలోనే కొరియర్ కుర్రాడు వచ్చి, ఏదో లెటర్ లాంటిది ఆయన చేతిలో పెట్టాడు. అంతే! అప్పటివరకూ సీరియస్‌గా ఏవేవో చర్చించుకుంటున్న ఆ ఫ్రెండ్‌తో తర్వాత కలుస్తానంటూ ఇంట్లోకి వచ్చారు. వచ్చీ రాగానే... ‘‘ఏవోయ్... ఇది చూశావా? పెద్దదానికి ఇంజనీరింగ్ సీట్ కన్‌ఫర్మ్ అయ్యిందట. మొదటి టర్మ్‌లో లక్షా నలభైవేలు కట్టాలట. ఇంత పెద్ద మొత్తం ఎలా పూలప్ చేస్తాం? ఏదో ఆ పై నలభయ్యో, యాభయ్యో అంటే సర్దగలను కానీ... దాదాపుగా లక్షన్నర... అదీ ఇప్పటికిప్పుడు ఎలా’’ అంటూ దిగులుపడిపోయారు.

 ‘‘ఇప్పటివరకూ దేశ ఆర్థిక పరిస్థితినంతా మీ భుజస్కంధాల మీదే మోస్తున్నట్లు మాట్లాడారు కదండీ. ఇంతలోనే ఇలా డీలా పడిపోవడం ఎందుకు?’’అడిగ్గాన్నేను.

 ‘‘అవన్నీ అంతర్జాతీయ విత్త వ్యవహారాలూ, ద్వైపాక్షిక వాణిజ్య ద్రవ్యవిధానాలు. చెప్పినా నీకర్థం కావు. కానీ ఈ డబ్బు వ్యవహారం ఎలా చేద్దామో చెప్పు’’ అన్నారు.
 
మౌనంగా నేను వంటింట్లోకి వెళ్లబోతుంటే... ‘‘చెట్టంత మనిషిని ఇలా దిగాలు పడిపోతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా నీ దగ్గర్నుంచి ఓ చడీ చప్పుడూ, ఓ ఆందోళనా గీందోళనా ఏదీ లేదేంటి?’’ అంటూ ఉక్రోషపడిపోయారు.

 ‘‘ఏదో, ఎలాగో చేద్దాం లేండి. మీరిప్పట్నుంచే ఆందోళనపడకండి. ముందు మీరు తెస్తానన్న ఆ నలభై వేలూ ఏటీఎమ్‌నుంచి డ్రా చేసి తీసుకురండి’’ అంటూ అప్పటికి ఆయనను సముదాయించా.
   
 పెద్దదాని ఇంజనీరింగ్ సీటు కోసం చెల్లించాల్సిన అడ్మిషన్ ఫీజు డబ్బు సర్దుబాటు చేసి ఆయన చేతిలో పెట్టా. ఆ డబ్బు కట్టి వచ్చాక ‘‘అవునూ... ఒక్కసారిగా లక్ష రూపాయలు ఎలా పూలప్ చేశావ్’’ అడిగారాయన ఆసక్తిగా.
 
‘‘నాకు ఐఎమ్మెఫ్‌లూ, విత్త విధానాలూ, ద్రవ్య వ్యవహారాలూ తెలియదుగానీ... దిగుల్లేకుండా ఇల్లు ఎలా గడపాలన్న చింత మాత్రం ఉంటుంది. ఆ ఆలోచనే చాలామంది ఆడవాళ్లలో మొగుడికి తెలియకుండా ఏదో చేయిస్తుంది’’ ఉపోద్ఘాతంగా అన్నాన్నేను.

 ‘‘చెప్పు... అంత డబ్బు ఎలా సర్దుబాటు చేశావ్’’ అంటూ సముదాయింపుకీ, లాలనకీ దిగారాయన!
 ‘‘అప్పట్లో మీకేవో ఎరియర్స్ వచ్చాయనీ, బంగారం  కొనుక్కోమనీ నాకు లక్షరూపాయలిచ్చారు గుర్తుందా. అది మన ఇంటి ఓనర్‌గారికి రెండు రూపాయల వడ్డీకి ఇచ్చా.  ఆయన ఇచ్చే వడ్డీని ఖర్చు చేయకుండా మళ్లీ మన కాలనీలోనే ఒకరి దగ్గర చిట్టీ వేసి ఆ వడ్డీనే దీనికి ప్రీమియంగా పే చేస్తూ వచ్చా. ఆ అమౌంట్ మెచ్యూర్ అయ్యాక దాన్ని డ్రా చేసి బ్యాంకులోఎఫ్డీ చేశా. అయితే దీర్ఘకాలికంగా కాకుండా 45రోజులూ, 90 రోజుల కోసమే డిపాజిట్ చేస్తూ ఎప్పుడు అవసరం వచ్చినా తీసుకునేలా ప్లాన్ చేశా. మన లక్ష  అలాగే ఉంది. అదనంగా వచ్చిన ఆ లక్షా సమయానికి అందించగలిగా’’ అంటూ అసలు విషయం చెప్పాను.
   
 ‘‘ఇప్పుడు తెలిసింది... నాకోసంగతి’’ అన్నారాయన.
 ‘‘ఏవిటో అది?’’ అడిగాను ఆసక్తిగా.
 ‘‘హోటళ్లూ, దుకాణాలూ, ఫ్యాన్సీ కొట్లూ... వీటన్నింటిలోనూ లక్ష్మీదేవి పద్మం మీద ఆసీనురాలై అరచేతిలోంచి డబ్బు రాలుస్తూ ఉన్న ఫొటోయే పెడతారుగానీ... విష్ణుమూర్తి సైడుకు పడుకోగా... లక్ష్మీదేవి కాళ్లొత్తుతున్న ఫొటో మాత్రం పెట్టరు. అలాంటి ఫొటోలు పూజగదుల్లోనే ఎందుకుంచుతారో ఇప్పటికి తెలిసింది’’ అన్నారాయన.
 ‘‘ఎందుకంటారూ?’’ ఉత్సాహంతో అడిగా.
 ‘‘ఆడవాళ్లెప్పుడూ... ఇల్లు ఏ కష్టం లేకుండా, చేతిలో డబ్బు గలగలలాడుతూ గడిచిపోవాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే అరచేతిలోంచి కాసులు రాలుస్తున్న లక్ష్మీదేవి ఫొటోలనే బట్టల దుకాణాల్లో, ఫ్యాన్సీ షాపుల్లో పెడుతుంటారు. ఏమో అనుకున్నాగానీ... నువ్వు ఫొటోలో లేకుండా ఉన్న వాకింగ్ మహాలక్ష్మివే సుమా’’ అంటూ  మొదటిసారిగా నన్ను మెచ్చుకున్నారు మావారు.
 -వై!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement